రక్షాను బంధం

0
3985

Draupadi_Krishnaమన పండుగల్లో ప్రకృతి శక్తుల పరిపుష్టి, వివిధ దేవతల అనుగ్రహం, ఆధ్యాత్మిక దృక్పథం, ఆత్మీయతానురాగాల అనుబంధం కలబోసి ఉంటాయి. పూర్ణిమ నిండు చంద్రుని శోభలను పుడమి స్వీకరించే రోజు. రసమయమైన చంద్రకళలు షోడశంగా, పూర్ణంగా అందే ఈ దినం ధ్యానానికీ, ఆరాధనకీ అనుకూలమైన యోగకాలం. చంద్రకళలు మనసుపై ప్రభావం చూపిస్తాయని సూక్ష్మ విజ్ఞాన విషయం.

“చంద్రమా మనసో జాతః” – విశ్వరూపుని మనస్సే చంద్రునిగా దీపిస్తున్నదని పురుష సూక్తి విషయం. విరాట్పురుషుని మనఃకళలే చంద్రకళలుగా ప్రకాశించడం వల్ల మన మనస్సు పవిత్రమై, రసానందాన్ని అనుభవించే దిశగా ఎదుగుతుందని చెబుతారు. అందుకే పూర్ణిమారాధనలూ, ధ్యానాలు విశేషంగా ఆచరించేది.

వైదిక క్రతువులలోనూ, మంత్ర శాస్తాల ఉపాసనలోనూ, యోగవిద్యలోనూ కూడా పూర్ణిమ సాధనలకు ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రత్యేకించి అనేక విధాలుగా ఆధ్యాత్మిక ప్రశస్తి వహించిన శ్రావణ పూర్ణిమ వివిధ ప్రాధాన్యాలను సంతరించుకుంది. వైదిక సంప్రదాయంలో దీనికి ప్రాముఖ్యం మరీ ఎక్కువ.

ముఖ్యంగా ఈ పూర్ణిమ విద్యాధిదేవత అయిన హయగ్రీవస్వామి ఆవిర్భవించిన రోజు. వివిధ పురాణ కథల ప్రకారం బ్రహ్మదేవుని వద్ద నుంచి వేద విద్యను రక్షించి, అసురులను దునుమాడి, తిరిగి సృష్టికర్తకు ఆ విద్యను అనుగ్రహించాడు. అలా అశ్వముఖుడై అవతరించిన శుభవేళ ఇది.

వేదమయుడైన శ్రీ హయగ్రీవ స్వామి ఆవిర్భవించిన శ్రావణ పూర్ణిమ నాడు చేసే పవిత్ర కర్మలచే బుద్ధికి సిద్ధి లభిస్తుంది. ఆ కారణం చేతనే ఈ రోజున వేదాధ్యయనపరులు ఉపాకర్మల వంటివి ఆచరిస్తారు. దేవతారాధనకు, ధ్యానానికీ అనువైన కాలమిది. జగదంబికను పూజించడానికి అనుకూలమైన సమయం.

వేదాలు పుస్తకాలు కావు. అవి భగవత్కృపచే మేధకు దర్శనమిచ్చే విజ్ఞాన కిరణాలు. తపోజనితమైన బుద్దే దానిని గ్రహించగలదు. ఆ విజ్ఞానానికి రాక్షస ప్రవృత్తి అడ్డు తగిలితే ప్రమాదం. ఆ ప్రమాదాన్ని నివారించి, అసలైన జ్ఞానదీప్తిని తిరిగి ప్రసాదించడమే హయగ్రీవానుగ్రహం.

ఈ పూర్ణిమనాడే రక్షాబంధన మహెూత్సవం. మానవ సంబంధాల్లో దివ్యత్వాన్ని నింపుకునే ఆచారాల్లో ఇది ఒకటి. ఉత్తరాదివైపు సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా భావించే ఈ పండుగ క్రమంగా దక్షిణాదిన ప్రాచుర్యం పొందింది. ఇందులోసోదరీ సోదరుల ఆత్మీయత తొణికిసలాడుదుంది. ఇంటి ఆడపడుచును మహాలక్ష్మీ స్వరూపంగా, పరాశక్తికి ప్రతీకగా భావించే సంస్మృతి మనది. తల్లితండ్రులు పెద్దవారై గతించినా, అన్నదమ్ములు ఆత్మీయంగా “మేము నీకున్నాం, మా ఆప్యాయత, అనుబంధం నీకు అండగా ఉంటాయి” అని ధైర్యమివ్వాలి.

అందుకే ఆడపడుచుల్ని పండుగలకు రప్పించడం, చీరసారెలిచ్చి గౌరవించడం వంటి విధులు మన సంప్రదాయంలో ఉన్నాయి. పుట్టింటి ఆత్మీయత స్త్రీకి ఎంతో మనో నిబ్బరాన్నీ, ఉల్లాసాన్నీ పెంచుతుంది. దానికి కరవులేదని సోదరులు తెలియజేస్తుంటారు. ఆడపడుచు మనస్సు క్షోభపడితే ఇంటికి క్షేమం కాదని కూడా మనవారి విశ్వాసం. తెలుగు నాట కార్తీక మాసంలో “భగినీ హస్త భోజనం” అనేది ఓ సదాచారం. దానిని పాటిస్తున్న వారు ఇప్పటికీ ఉన్నారు. ఆ రోజున ఎక్కడున్నా సరే, అక్కచెల్లెళ్ళ ఇంటికి వెళ్లి, తోబుట్టువు చేతి వంట తిని రావాలని సంప్రదాయం. ఇటువంటి అందమైన ఆచారాలను యాంత్రిక జీవనపు హెూరాహెూరీ పరుగుల్లో పడి పోగొట్టుకుంటున్నాం. మరోవైపు అర్ధరహితమైన అనుకరణలతో పాశ్చాత్యులు వాళ్లకు తోచినట్టు జరుపుతున్న ‘దినా’లను మాత్రం ఏమాత్రం తర్కాన్ని ఉపయోగించకుండా పాటిస్తున్నాం. హద్దుల్ని అతిక్రమిస్తున్నాం.

మన భారతీయ ధర్మశాస్త్రాల్లో పేర్కొన్న రక్షాబంధన మహెూత్సవం ఈ పూర్ణిమ ప్రత్యేకత. భారతీయుల ప్రాచీన ధర్మ గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది. ఈ రోజున సోదరుని తిలకధారణతో, అక్షతలతో అభినందించి, సోదరి రక్షాకంకణాన్ని బంధిస్తుంది. ఇది దేవతారక్షగా అతడిని కాపాడుతుంది. బదులుగా సోదరిని కానుకలతో సత్కరిస్తారు. సోదరీ సోదర అనుబంధానికి పవిత్రమైన, నిర్మలమైన ప్రతీకగా ఆచరించే చక్కని పర్వమిది. కుటుంబ వ్యవస్థ బలీయంగా ఏర్పడిన భరతభూమిలో బాల్యం నుంచే తోబుట్టువుల చెలిమిని బలపరచి, స్త్రీకి పుట్టింటి అనుబంధాన్ని దృఢపరచిన ఈ సంస్మృతిలో సూక్ష్మమైన దేవతాశక్తుల రక్షణను కల్పించిన తపోదృష్టి కూడా దాగి ఉంది.

రక్షాబంధనం కట్టేటప్పుడు చదవవలసిన మంత్రం

‘యేన బద్దోబలి రాజూ

దానవేంద్రో మహాబలః

తేన త్వామభిబధ్నామి

రక్ష మాచల మాచల’

 

“మహాబలుడైన రాక్షసేంద్రుడైన బలిచక్రవర్తిని కట్టిన వానిచే (నారాయణునిచే) నిన్ను కడుతున్నాను. ఓ రక్షా బంధనమా! నువ్వు చలింపకు, చలింపకు” అని దీని భావం. ‘విష్ణు శక్తే నిన్ను కవచంలా కాపాడుతుంది. దృఢంగా రక్షిస్తుంది’ అని దైవశక్తిని ఈ బంధంలో ఆవహింపజేయడమే దీని సారాంశం.

ద్రౌపది ఒకనాడు తన సోదరుడైన శ్రీకృష్ణుని వేలికి దెబ్బ తగిలితే, వెంటనే వస్రంతో కట్టు కట్టిందట. దానికి ప్రతిగా సోదరిని నిండు సభలో ఆదుకున్నాడు ఆ లీలా మానుష విగ్రహుడు. సోదరీ సోదరుల బంధానికి ఇదొక చక్కని ఉదాహరణ.

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here