ఆడికృత్తిక 2022

0
697

2022 Saturday, 23rd of July

మార్గశిరమాసంనందు శుద్ధషష్ఠీతిథి, ధనిష్ఠానక్షత్రయుక్త వృశ్చికలగ్నమందు వేకువజామున అరుణకాంతులు విరజిల్లే రూప తేజస్సుతో ఆరుముఖాలు, పన్నెండుచేతులతో షణ్ముఖుడు ఉదయించాడు. అతడు శిరస్సులకు రత్నకిరీటాలూ, పన్నెండుచేతుల్లో దివ్య శస్త్రాస్త్రాలు ధరించి ఉన్నాడు.

అతడు పుట్టినతోడనే చతుర్వేదాలనూ, ప్రణవనాదాన్నీ, ఆయుర్వేదాన్నీ తన షణ్ముఖాలతో ఉచ్చరిస్తూన్నాడు. ఆ దివ్యపురుషుణ్ణి చూచి ఆకాశవాణి ఆహా… షణ్ముఖుడు అవతరించాడు… తారకాసురసంహారానికి శివకుమారుడు జన్మించాడు అంటూ దిశలన్నీ పిక్కటిల్లేలా ప్రకటించింది. ఇంద్రాది దేవతలంతా భక్తిపారవశ్యంతో భక్తి స్తోత్రాలు చేశారు.

ఆ సమయంలో ఆరుమంది ఋషిపత్నులు అక్కడి కొచ్చారు. వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఆ బాలుణ్ణి ఎత్తుకొన్నారు. అప్పుడు వారివద్ద కడుపార పాలు త్రాగి తృప్తి చెందాడు. ఆ తర్వాత ఆ బాలుడు చిరునవ్వుతో మీ వద్ద పాలు త్రాగినవాడను కాబట్టి నేను మీ కుమారుడను అని చెప్పాడు.

అప్పుడే పుట్టిన బిడ్డ అలా మాట్లాడ్డం చూసి మునిపత్నులు విస్తుపోయారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఈ బిడ్డ శివకుమారుడనీ, కారణజన్ముడనీ వారికి చెప్పాడు. ‘షట్ కృత్తికలు’ అనగా ఆరుగురు మునిపత్నులపాలు త్రాగిన ఆ షణ్మాతురునకు ‘స్కందుడు’ అని నామకరణం చేశాడు. మునిపత్తులతో ఆ బాలుణ్ణి పెంచాల్సిందిగా చెప్పి వెళ్లిపోయాడు.

అలా పెరిగి పెద్దవాడవుతున్న కుమారుని సామర్థ్యాన్ని పరీక్షించాలని దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం కుమారుని ఎదను తాకింది. ఆ ఎదపై రక్తంచింది, అందుండి విశాఖుడు, పార్శ్వాలనుండి శాఖుడు, నైగమాఖ్యుడు అనే ముగ్గురు పుట్టారు. వారు దేవలోకానికి వెళ్లి ఇంద్రుణ్ణి పట్టి బంధించి కుమారుని వద్దకు ఈడ్చుకొచ్చారు. ఇంద్రుడు భయంతో గడగడ లాడుతూ ‘శరణు కుమారా… శరణు.. శరణు..’ అని ప్రార్థించాడు. తారకాసురసంహారంకై కుమారుణ్ణి సర్వ సైన్యాధ్యక్షుడుగా ప్రకటించాడు ఇంద్రుడు.

ఆ యుద్ధంలో తారకాసురుని మెడలోనున్న అమృత లింగంలో అతని పంచప్రాణాలున్నాయని తెలుసుకుని ఆగ్నేయాస్తాన్ని వదలి లింగాన్ని ఐదుభాగాలుగా ఖండించాడు. తర్వాత బ్రహ్మాస్తాన్ని ప్రయోగించగా తారకుడు నేల కూలాడు. అప్పుడు దేవతలందరూ ‘దేవసేనాధిపతికీ జై.. శివ కుమారునికీ జై… షణ్ముఖునికీ జై జై….’ అంటూ జేజేలు పలుకుతూ స్కందుణ్ణి పూజించి పుష్పవర్షం కురిపించారు. మనమూ ఈ ఆడికృత్తికరోజున కుమారస్వామిని స్మరించి ధన్యులమౌదాం.

కుమారస్వామికి శివపార్వతులిచ్చిన ‘ఫలం’… పళని