
Ganesh Patri Health Benfits in Telugu
వినాయక పూజలో ఉపయోగించే పత్రాలు ఒక్కొక్కటీ ఒక్కో ఔషధ గుణాన్ని కలిగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
సుముఖాయ నమః – మాచీ పత్రం పూజయామి
నేత్రములకు మంచి ఔషధము. ఆకుని తడిపి కళ్ళ మీద ఉంచుకోవాలి. పసుపూ నూనెతో నూరి ఒంటికి రాసుకోవాలి.
గణాధిపాయ నమః – బృహతీ పత్రం పూజయామి
నేలమునుగ ఆకులు – ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును. శరీరమునకు దివ్యఔషధము.
ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి
మారేడు ఆకులు – మూల శంక నయమగును. రోజూ రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగాలి. కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకుని తాగాలి.
గజాననాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
జంటగరిక ఆకు – మూత్ర సంబంధ వ్యాధులు తొలుగును. పచ్చడి చేసుకొని తినవలెను.
హరసూనవే నమః – దత్తూరపత్రం పూజయామి
ఉమ్మెత్త ఆకు – మానసిక రోగాలు తొలగును. ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేయాలి.
లంబోదరాయ నమః – బదరీ పత్రం పూజయామి
రేగు ఆకు – శరీర సౌష్టవానికి శ్రేష్టం. మితంగా తింటే మంచిది.
గుహాగ్రజాయ నమః – అపామార్గపత్రం పూజయామి
ఉత్తరేణి ఆకులు – దంతవ్యాధులు నయమగును. ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకోవాలి.
గజకర్ణాయ నమః – తులసీపత్రం పూజయామి
తులసీ ఆకులు – దగ్గు, వాంతులు, సర్వ రోగనివారిణి. రోజు ఐదు, ఆరు ఆకులను తింటే మంచిది.
ఏక దంతాయ నమః – చూత పత్రం పూజయామి
మామిడి ఆకు – కాళ్ళ పగుళ్ళు, అతిసారం నయమగును. మామిడి జిగురులో ఉప్పు కలిపి వేడి చేసి పగుళ్ళకు రాయాలి.
వికటాయ నమః – కరవీర పత్రం పూజయామి
గన్నేరు ఆకు – జ్వరమును తగ్గించును[లోనికి తీసుకోరాదు]
భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంత పత్రం పూజయామి
అవిసె ఆకు – రక్త దోషాలు తొలగును. ఆకు కూరగా వాడవచ్చు.
సురసేవితాయ నమః – అర్జున పత్రం పూజయామి
మద్ది ఆకులు – వ్రణాలు తగ్గును. వ్రణాలున్న భాగాల్లో ఆకులను నూరి రాసుకోవాలి.
సర్వేశ్వరాయ నమః – దేవదారు పత్రం పూజయామి
దేవదారు ఆకులు – శ్వాశకోశ వ్యాధులు తగ్గును
ఫాలచంద్రాయ నమః – మరువక పత్రం పూజయామి
మరువం ఆకులు – శరీర దుర్వాసన పోగొట్టును. వేడినీటిలో వేసుకొని స్నానం చేయవలెను.
హేరంబాయ నమః – సింధువార పత్రం పూజయామి
వావిలి ఆకు – ఒంటినొప్పులను తగ్గించును. నీటిలో ఉడికించి స్నానం చేస్తె మంచిది.
సురాగ్రజాయ నమః – గండకీ పత్రం పూజయామి
గండకీ ఆకు – వాత రోగములు నయమగును
ఇభవక్త్రాయ నమః – శమీపత్రం పూజయామి
జమ్మి ఆకులు – కుష్ఠు వ్యాధులు తొలగును. ఆకుల పసరును ఆయా శరీర భాగాలలో రాసుకోవాలి.
శూర్పకర్ణాయ నమః – జాజీ పత్రం పూజయామి
జాజి ఆకులు – నోటి దుర్వాసన పోగొట్టును. ఆకులను వెన్నతో కలిపి నూరి పళ్ళు తోముకోవాలి.
వినాయకాయ నమః – అశ్వత్థ పత్రం పూజయామి
రావి ఆకులు – శ్వాసకోశ వ్యాధులు తగ్గును. పొడి చేసి తేనెతో సేవిస్తే మంచిది.
వటవే నమః – దామిడీ పత్రం పూజయామి
దానిమ్మ ఆకు – అజీర్తి, ఉబ్బసం తగ్గును. పొడిచేసి కషాయంగా తాగవచ్చు.
కపిలాయ నమః – అర్క పత్రం పూజయామి
జిల్లేడు ఆకులు – వర్చస్సు పెంచును.