
అపామార్గ పత్రం | Apamarga patram
గుహాగ్రజాయ నమః అపారమార్గ పత్రం సమర్పయామి!
దీనికి తెలుగులో ఉత్తరేణి అని పేరు. ఉత్తర దిశగా వ్యాపించిన వేరు కలిగినది శ్రేష్టముగా చెప్పబడింది. సంస్కృతంలో దీనికి ఖరమంజరి, శిఖరి, ప్రత్యక్పుష్టి అనేవి పర్యాయ నామాలు. దీని శాస్త్రీయ నామము – achyranthes aspera, కుటుంబం- Amaranthaceae.
దీని పత్రములు గుండ్రంగా ఉండి గింజలు వరి ధాన్యము వలె ముళ్ళను కలిగి, బాటలో నడుస్తున్నప్పుడు కాళ్ళకు తగులుతుంటాయి. అథర్వవేదంలో అపామార్గము గురించి విశేషముగ వర్ణించబడింది. చరకసంహిత యందు వీటి బీజములు ఉత్తమ శిరో విరేచన ద్రవ్యముగా ప్రశంసించ బడ్డయి. దీని విత్తనములతో చేసిన పాయసము సేవించి పూర్వ కాలంలో మునులు చాలాకాలము వరకు ఆకలి బాధ లేకుండా ఉండేవారని ప్రతీతి. దీని ఉదర శూల, చర్ధి, కండు మరియు శ్వాస వ్యాధులలో విశేషంగా వాడతారు. దీని క్షారమును భస్మక రోగము (ఎంత ఆహారమును తీసుకున్నా త్వరగా జీర్ణమయి మరల తొందరగా ఆకలిని కలిగించు వ్యాధి)
నందు ప్రత్యేకంగా చెప్పబడినది. తంత్ర శాస్త్రమునందు వశీకరణ ద్రవ్యములలో ఇది ఒకటి.