నలభై ఏళ్ళ వయసువాడైన నిర్లిప్తుడనే వాడికి, హఠాత్తుగా జీవితంలో తానేమీ సాధించలేదనే ఆలోచన వచ్చింది. వాడు చూస్తూండగానే ఎందరో లక్షాధికారులయారు; కళాకారులయారు. కీర్తి ప్రతిష్ఠలు గడించారు. తాను మాత్రం అనామకుడుగానే వుండిపోయాడు !
నిర్లిప్తుడు యిక బతకడం వృధా అని భావించి, ఏ పులివాతో పడి చావదలిచి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సాధువు వాడికి ఎదురుపడి, “క్రూరమృగాలు తిరిగే, యీ అడవికి ఎందుకొచ్చావు ?” అని ప్రశ్నించాడు.
“స్వామీ, నేను జీవితంలో ఏమీ సాధించలేకపోయాను. అందువల్ల విరక్తి చెంది, చావాలని యిక్కడికి వచ్చాను,” అన్నాడు నిర్లిప్తుడు.
సాధువు చిరునవ్వు నవ్వి, “ఏమీ సాధించలేకపోయినందుకు బాధపడుతున్నావు, బాగానే వున్నది. మరి జీవితంలో ఫలానిది సాధించాలని ఎప్పుడైనా అనుకున్నావా ?” అని అడిగాడు.
నిర్లిప్తుడు లేదని తల ఊపాడు. అప్పుడు సాధువు, “బాణం గురి పెట్టకుండా లక్ష్యానికి తగలలేదని బాధపడడం అవివేకం !” అన్నాడు.
సాధువు మాటలతో నిర్లిప్తుడికి కనువిప్పు కలిగింది. వాడు మరెన్నడూ ఏమీ సాధించలేదని బాధపడకుండా, ఎంతో కొంత సాధించడానికి ప్రయత్నించాడు.