Bathukamma 2022: తొమ్మిది రోజులు.. ఎనిమిది నైవేద్యాలు.. ఏరోజు ఏం చేస్తారంటే..

0
448

ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యంతో బతుకమ్మకు సమర్పిస్తారు.

బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న పండుగ. భాద్రపద అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో మొదలయ్యే వేడుకలు.. దసరా మరుసటి రోజు వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సద్దుల పండుగతో ముగుస్తాయి. బతుకమ్మ వేడుకల్లో పిల్లా పాపలు.. మహిళలు.. యువతులు చేసే సందడే వేరు. ఆటపాటలతో తామంతా ఒక్కటే అనే భావనతో ఆడిపాడుతారు. కొత్తబట్టలు.. కోలాటాలతో తొలి రోజు నుంచి చివరి రోజు వరకు ఆడపడుచులు చేసే సండది అంతాఇంత కాదు. ఇక బతుకమ్మలో ప్రధాన ఆకర్షణగా నిలిచేవి తీరొక్క పూలు. బంతి, చామంతి, గునుగు, తంగేడు, గులాబీ.. ఒక్కటేంటి… ప్రకృతిలో లభించే పూలతో అందంగా అలంకరించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. రోజుకో రకమైన పూలతో అలకంరిస్తూ వేడుకలు నిర్వహిస్తారు.

ప్రజల జీవనంలో భాగమైపోయిన బతుకమ్మ ఇక.. ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాపితం చేసింది. భావం..అర్ధం..శబ్దం ఏకంగా ప్రతిధ్వనించే అలాంటి అద్భుత..అద్వితీయ దృశ్యమే ..బతుకమ్మ మహోత్సవం. దేవుళ్లను పూలతో పూజిస్తారు ఎవరైనా..కానీ పూలనే దైవంగా కొలిచే తెలంగాణ సంస్కృతి యావత్‌ ప్రపంచం జయహో అంటోంది.

ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ, ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. 

తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు

తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతులు పాల్గొంటారు. చివరిరోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.

  1. ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక సంబురం మొదలవుతుంది. తెలంగాణలో ఈ రోొజును పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
  2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
  3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
  4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి గౌరీ దేవికి నైవేద్యంచేస్తారు.
  5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
  6. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
  7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
  8. వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
  9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.

పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో తొలిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని.. చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు.. కొలుస్తారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడి పాడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు. 

 

దసరా పండుగ నిర్ణయం ఎలా చేస్తారు? పండుగ జరుపుకునే విధానం ఏమిటి ? | How to Celebrate Dussehra Festival in Telugu?