
కొత్త గా కాపురానికి వచ్చిన కోడలు ప్రవర్తన ఎలా వుండాలి? | Behavior of newly married bride with her mother in law
వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నటువంటి యువతీ యువకులలో అనేక కోరికలు ఉండవచ్చు. అమ్మాయిలయితే నాకు రాకుమారుడు కావాలని, అబ్బాయిలయితే నాకు రాకుమారి కావాలని. కాని, ఎవరు కోరుకున్న వారు ఎవరికీ పూర్తిగా వారు కోరుకున్న లక్షణాలతో దొరకరు. ఇది నిజం. అందుకనే వివాహము అంటేనే సర్దుకుపోవడం మరియు ఒకరికొకరు అర్ధం చేసుకోవడం.
ఇప్పుడు క్రొత్తగా భార్య కాబోతున్న అమ్మాయి కొన్ని లక్షణాలను కనుక అలవర్చుకుంటే ఆమె భార్యగా సంపూర్ణంగా భర్త యొక్క హృదయంలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతుంది. సీతమ్మ తల్లి ఎలా అయితే ఆ శ్రీరాముని మనసునంతా ఆక్రమించుకొన్నదో, మహాసాధ్వి ద్రౌపదీదేవి ఎలా అయితే ఆ పంచపాండవుల హృదయాలలో నిక్షిప్తమై ఉన్నదో అలా కొన్ని భర్తను అనుసరించడం వల్ల ఏర్పడుతుంది. .
స్త్రీ Office లో భర్తకంటే ఎంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ, విద్య విషయంలో అధికురాలు అయినప్పటికీ అది బయటి వరకే పరిమితము కావాలి. ఇంట్లో తను, తన భర్తకి భార్యగా అతనికి సమయానుకూలంగా అన్నీ అమరుస్తూ, కార్యేషు దాసిలా భర్తకి సేవ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే మనకి శాస్త్రాలే చెబుతున్నాయి. స్త్రీకి ప్రత్యేకమయిన పూజ అఖ్ఖర్లేదు. భర్తను సేవించడమే ఆమెకు పరమధర్మము. భర్తతోపాటుగానో లేక భర్త లేచిన తరువాత భార్య లేవడం కాదు. భర్త కంటే ముందు నిద్రలేచి వారి వారి ఇష్టదేవతను స్మరించుకోవడానికి, నిత్య అనుష్ఠానం చేసుకోవడానికి తగిన విధంగా అన్ని అమర్చిపెట్టాలి. అలాగే భర్తకి ఉపాహారం పెడితే, భగవంతునికి బాల భోగం చేసేసినట్లే. అలాగే మధ్యాహ్న వేళలో భర్తకి మధ్యాహ్న భోజనం పెడితే, భగవంతునికి మహానివేదన చేసినట్లే. అలాగే రాత్రి వేళ భోజనమో, పలహారమో పెట్టి అతడు శయనించడానికి తగిన ఏర్పాట్లు చేస్తే భగవంతునికి పవళింపు సేవ చేసినట్లే. పైగా, భర్త ఏదైనా దైవకార్యం చేస్తే దానిలో ఉన్నటువంటి సగ ఫలితం భార్య ఖాతాలో పడుతుందని మన శాస్త్రాలే చెప్పాయి. మన పురాణాలలో, ఇతిహాసాలలో ఎన్నో కధలు మనకు గోచరమవుతాయి. భర్త ఎంత ధూర్తుడైనప్పటికీ, భర్తనే సేవించి ఉత్తమగతుల్ని పొందిన ఎందరో మహాతల్లుల్ని మనము చూడవచ్చు. ఉదాహరణకి సతీ అనసూయ, దమయంతి, చంద్రమతి మొదలగువారు. కనుక మనము ఎంత ఉన్నత పదవులలో ఉన్నప్పటికీ భర్తను అనుసరించడం తప్ప విస్మరించకూడదు. మీరు నిజంగా ఉద్యోగ వత్తిడిలో ఉండి కొన్ని కార్యక్రమాలు చేయలేక పోతే ఫరవాలేదు కాని, మా అమ్మ ఏనాడు ఇలా చేయలేదు కాబట్టి నేను చెయ్యను అని అనడానికి వీలులేదు. అలాగే కొత్తగా అత్తవారింటికి వచ్చిన అమ్మాయికి అనేక కోరికలు, ఆశలు ఉంటాయి. ముందుగా అత్తగారింట్లో గృహప్రవేశం చేయగానే అవి అన్ని ఒక్కసారిగా ఏకరువు పెట్టకూడదు. ఇప్పటి అమ్మాయిలు చాల తెలివిగలవారు, లౌక్యం తెలిసినవారు కనుక ఇంటిలోకి ప్రవేశించగానే, వారు వారి అత్తగారి కుటుంబం యొక్క ఆర్ధిక పరిస్థితిని అకళింపు చేసుకోగలరు. కాబట్టి మీ కోర్కెలను అన్నింటిని తీర్చుకోవడానికి భర్త ప్రశాంతముగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రణాలికలను రూపకల్పన చేసుకొని వాటిని పొందవచ్చు. స్త్రీలకు సహజంగా భగవంతుడు పెట్టినటువంటి ఆభరణం ఓర్పు, చిరునవ్వు. రాను రాను కారణం ఏదైనా కావచ్చు, ఆ ఓర్పు అనేది చాలా తగ్గిపోయింది అనే చెప్పవచ్చు. దానిని ప్రయత్నపూర్వకంగా మన యొక్క సహజ గుణాన్ని మనము పొందడం పెద్ద కష్టమేమి కాదు.
కొత్త కోడలు అత్తవారింటికి వెళ్ళగానే ముందుగా అందరి యొక్క మనస్తత్వాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి మనసుకు అనుగుణంగా నడుచుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే వివాహము తరువాత ఇక ఈ కుటుంబమే నా కుటుంబము. కాబట్టి మన కుటుంబంలోని వారి కోసము మన యొక్క చిన్న చిన్న అలవాట్లను వారి కోసమే మార్చుకోవడంలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది. ఇలా మార్చుకోవడం వలన కూడా మనము ఆనందాన్ని వెతుక్కుంటే ఆ జీవితము స్వర్గతుల్యమే. వీళ్ళతో నేను సర్దుకు పోవడమేమిటి, వాళ్ళే సర్దుకుపోవాలి అని అనుకుంటే మాత్రము పైకి చాలా గంభీరంగా కనిపించినప్పటికీ మనసులో ఎదో ఒక అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది.
ఒకవేళ ఉమ్మడి కుటుంబం అయితే అత్తగారిని ఒక పని చేసే యంత్రంలానో, ఒక పనిమనిషిలా భావించకూడదు. (అందర్నీ అనడం లేదు, కొంతమంది విషయంలో మాత్రమే) ఏదైనా అనారోగ్యం వస్తే ఆఫీసుకి శెలవు పెట్టడం, మందులు తెచ్చి ఇవ్వడం చేస్తే ఆవిడ ఎంతో సంతోషించి రెట్టింపు ఉత్సాహముతో మీకు సహాయాన్ని అందచేస్తుంది. అలా అత్తవారింటిలో అందరి అభిమానాన్ని మనము మన ప్రవర్తనతో చూరగొనాలి. నాకు ఎవరూ గౌరవం ఇవ్వడం లేదు అని బాధ పడటం కాదు. ఎదుటి మనిషి గౌరవం ఇచ్చేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. భర్తకి ఇష్టమైనవి సమయము ఉన్నప్పుడు చేసిపెట్టడం, అత్తగారి ప్రక్కన కూర్చుని కబుర్లు చెబుతూ మీ వారి చిన్ననాటి విషయాలు అడిగి తెలుసుకోవడం, ఇంట్లో ఎవరెవరికి ఏమి ఇష్టమో అడిగి తెలుసుకుని మీకు వీలున్నప్పుడు చేసి పెట్టడం, మృదు మధురంగా మాట్లాడటం, ఓర్పుతో మెలగడం, ఎంత కష్టమొచ్చినా చిరునవ్వు చిందించడం చేస్తూ ఉండవలసినదే. ఇవన్నీ కూడా సువాసినీత్వ లక్షణాలు అని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కఠినంగా ఒకరిని నొప్పించేటట్టుగా మన మాటలు ఉండకూడదు. కత్తితో పొడిచినా గాయము కొన్ని రోజుల తరువాత చికిత్సకి మానిపోతుందేమో కాని, మాటలు చేసిన గాయం అంతిమ శ్వాశ దాక వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి, ఒక మాట అనేటప్పుడు ఈ విషయం గుర్తుకువస్తే మనము మెల్లిగానే మృదుమధురముగా మాట్లాడే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ప్రతి ఆడపిల్ల గుర్తించుకోవలసిన విషయాలు ఇవి. ఆడపిల్ల పుట్టగానే (ఆ పేరులోనే ఉంది, ఈడపిల్ల కాదు, ఆడపిల్ల అని) వివాహము తరువాత ఇంటి పేరు మారుతుంది. గోత్రం మారుతుంది. మరి మనము వారికి (అత్తవారింటివారికి) అనుగుణంగా మారడంలో తప్పేంటి? మగపిల్లవాడి వల్ల ఒక్క వంశము మాత్రమే కీర్తి పొందుతుంది. కాని ఆడపిల్ల విషయంలో తన ప్రవర్తన కనుక సక్రమంగా ఉంటే రెండు వంశాలను (ఇటు అత్తవారింటి వారు మరియు వారి పుట్టింటి వారు) కీర్తి పొందుతారు.
మరి ఆడపిల్లకి ఇవన్నీ ఎక్కడ నేర్పింపబడాలి అని అంటే, ఆ సీతమ్మే చెప్పింది అయోధ్యకాండ చివరి భాగంలో. సీతారామలక్ష్మణులు, అనసూయ అత్రి మహర్షిల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అనసూయమ్మ సీతామ్మవారిని అడుగుతుంది. అమ్మా… నీవు రాముడిని వనవాసములో ఎలా అనుసరించగలిగావమ్మా అని. అప్పుడు సీతమ్మ ఈ విధంగా చెబుతుంది. ఇక్ష్వాకు వంశంలో బహుభార్యాత్వం ఉన్నప్పటికీ నా శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడు. నా శ్రీరాముడు పరాయి స్త్రీతో మాట్లాడడు, మిత భాషి, మహా ధర్మాత్ముడు, స్నేహానికే అర్ధం చెప్పిన మహానుభావుడు, నన్ను పల్లెత్తు మాట అనడు. అలాంటి నా శ్రీరాముడిని అనుసరించడం అంత గొప్పేమీ కాదు. అయినా లోకంలో ఎంతో మంది తమ భార్యల్ని హింసించే భర్తలు ఉన్నారు. అలాంటివారిని అనుసరించే భార్యలు పుణ్యాత్ములు, అని ఆ సీతామ్మవారు అనసూయమ్మతో చెప్పింది. నాకు ఊహ తెలిసినప్పటినుండి కూడా నాకు నా తల్లితండ్రులు నూరిపోస్తూనే ఉన్నారు. నీవు ఎట్టి పరిస్థితులలో పతిని అనుసరించాలి. మీ అత్తింటి వారిని గౌరవించాలి అని. ‘పాణిప్రదాన కాలేన’ అంటే, నా చేయి రాముల వారి చేతిలో పెడుతున్నప్పుడు కూడా పతిని అనుసరించాలి అని చెప్పారు. అందుకే నేను నా శ్రీరాముడిని అనుసరించగలిగాను అని చెప్పింది. దీన్ని బట్టి మనకు ఏమి అర్ధం అవుతుంది. అత్తవారింట్లో ఎలా మసలుకోవాలి? భర్తతో ఎలా ఉండాలి అన్నది ఆడపిల్లకి పుట్టింట్లో నేర్పబడాలి. అందుకనే ప్రతి తల్లి, తండ్రి ఆడపిల్లలకు కాని మగపిల్లలకు కాని వయసుకు అనుగుణంగా వారు ఎవరితో ఎలా ఉండాలి అని నేర్పించినట్లైతే అన్ని దాంపత్య సంబంధాలు చక్కగా ఉండి వారు వారి మనవళ్ళను, మనవరాళ్ళను, మునిమనవళ్ళను, మునిమనవరాళ్ళను చూసుకోగలుగుతారు.
లోకాసమస్తాసుఖినోభవంతు.
Anni vishayalu chala bhagunnai…..
Sarve jana sukino bavanthu…..