స్వామి హరిదాసుల జీవితంలోని సంఘటనమిది. స్వామి హరిదాసులవారికి ఒక పాలు పోసే స్త్రీ నిత్యమూ వేళకు సరిగా తెచ్చిపోసేది. కాని ఒకనాడు యమునా నది పొంగిపొర్లడంవలన సకాలానికి రాలేకపోయింది. కారణమేమని ప్రశ్నించగా “స్వామీ యమునానది పొంగి పొర్లుతోంది, పడవ నడిపేవారు కూడా సాహసించుటకు జంకి, పడవలను గట్టుననే వుంచారు. తర్వాత నది వేగం తగ్గింది. ఆమె ఆశ్రమం చేరింది.
కరుణామయులైన హరదాస స్వామి “అమ్మా భవసాగరాన్ని దాటించగల శ్రీకృష్ణ భగవానుడు యమునా నదిని దాటించలేడా? కృష్ణ కృష్ణ అంటూ ముందడుగు వేస్తే పడవ అక్కరలేదు అన్నారు. మరుసటి రోజు నుంచి పాలమనిషి తెల్లవారేసరికి, పాలు తెచ్చేది. ఒకనాడు క్రమం తప్పలేదు. పడవలు నీటిలో దిగలేదు. యమునానది పొంగి పొర్లుతున్నా ఆమె వేళాతిక్రమణ లేకుండా వస్తూ వుండటం శిష్యులకు ఆశ్చర్యం కల్గిం చింది.
ఆశ్రమవాసులు అందరూ ఆమెతోపాటు యమునాతటికి వెళ్లారు. పాలమనిషి గురువుగారు చెప్పినట్లే భక్తితో కృష్ణనామ స్మరణ చేస్తూ పాలకుండను ఒక బుట్టలో వుంచి తలపై పెట్టుకని నదిని సునాయాసంగా దాటడం చూసి ఆశ్చర్యపడ్డారు. ఇది నమ్మకం.
మహాభాగవతంలో, కృష్ణుని జననమైనప్పుడు, కారాగృహానికి వేసిన తాళాలు తెగి పడినవి. శిశువును బుట్టలో పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఏడు పడగల సర్పం శిశువుపై వాన నీరు పడకుండా రక్షణ కల్పించటంతో వసుదేవుడు యమునా నది దాటునపుడు, యమున రెండు పాయలుగా చీలింది. వసుదేవుడు సురక్షితుడై కృష్ణుని యశోద వడిలో పండబెట్టి కారాగారగృహం చేరాడు.
ముఖ్యమైన విషయం.. విశ్వచైతన్యం లోకకల్యాణం కోసం దేహదారిగా లోకానికి విచ్చేస్తుంది. సామాన్యులకు చేతకాని పనిని, విశ్వశక్తి చేయగలదని నిరూపింపబడింది. ఇది నమ్మదగినదా? అని ప్రశ్నించినపుడు అదొక మూఢనమ్మకమంటారు.
కొందరు మిత్రులు హరికథలు చెబుతూ జీవించేవారు. ఒకసారి తిరిగి వచ్చేసరికి చీకటిపడింది. చీకట్లో తారాడుతూ ఒకరివెంట ఒకరు వస్తుండగా, వారిలో ఒకడు దారి తప్పాడు. ఆకస్మికంగా పెద్ద గోతిలోకి పడ్డాడు. అదృష్టవశాత్తు ఒక చెట్టు కొమ్మను పట్టు కొన్నాడు. గట్టిగా పట్టుకొన్నాడు. అంతవరకు ఆ వ్యక్తి నాస్తికుడు. దైవం, పూజ, పునస్కా రాలన్నీ వృధా అని విశ్వసించినవాడు. కాని ఇప్పుడు ఒక ప్రయత్నం చేద్దాం- దేవుడనే వాడున్నట్లయితే కాపాడగలడు అని ఆలోచించాడు.
“భగవాన్ నీకు ఇదొక పరీక్ష. నీవు ఉన్నట్లయితే నీవు నన్ను కాపాడాలి. జీవదానం చేయాలి. అపుడు నీ అస్తిత్వాన్ని నమ్మగలను”. ఆ మాట అన్న వెంటనే ఒక అశరీరవాణి “నీవు పట్టుకున్న కొమ్మను వదులు, నీవు బ్రతుకుతావు” అన్నదాస్వరం.
ఆపదలోవున్న ఆ వ్యక్తికి పునరాలోచన కల్గింది. వినిపించిన ఆ స్వరం దైవానిదో, దయ్యానిదో? పరీక్షిస్తాను అంటూ కొమ్మను బిర్రుగా పట్టుకున్నాడు.
మరుసటి రోజు అతని మిత్రులు అతనిని వెదుకుతూ అడవికి వెళ్లారు. వాడు రాత్రంతా చలికి వణుకుతూ శవమై వున్నాడు! అతని కాళ్ల క్రింద ఇసుక పొరలు! నాడు ధైర్యంతో కొమ్మను వదలి క్రిందపడి వుండిన బ్రతికేవాడు.
ఇదంతా నమ్మకమా? మూఢ నమ్మకమా? అపనమ్మకమా? అంతరంగమందలి కిటికీలను తెరచి వుంచుకొన్న, చింతలనే చీకట్లు మాయమవుతాయి. లోక సంపర్కం లేనిదే మన మనుగడ వుండదు.
మనిషికి ఏ ఆలోచననైనా తలుపు రావచ్చు. దేనినైనా చేసేయగలను అని అనుకోవచ్చు. కాని బాగా ఆలోచించి ఏది మంచో చెడో నిర్ణయించుకుని చేయాలి. తనకు తనపొరుగువారికి కూడా అది మంచిని కలుగచేసేదిగా ఉండాలి. అందుకే నలుగురికీ మంచిది అనిపించినదానిని నమ్మకంతో ముందడుగు వేయడం శ్రేయస్కరం.