Where does Krishna river originates?

Where Does Krishna River Originates?

River Krishna Origin / కృష్ణానది పుట్టుక

3. సరస్వతీ దేవి శాపవృత్తాంతము(Curse of Goddess Saraswati)

పూర్వం చాక్షుషమన్వంతరమున బ్రహ్మ సహ్యాద్రియందు భార్యా సమేతుడై ‘దీక్షాయణేష్టి’ అను యజ్ఞముచేయ సంకల్పించి భృగుమహర్షిని ఆచార్యునిగా, శివకేశవులను ఉపద్రష్టలుగా, ఋషులను ఋత్విజులుగా ఎన్నుకొని ఒక సుముహూర్తమును చూసుకొని యాగమును ప్రారంభం చేయుటకు సిద్ధమయ్యెను. కానీ సరస్వతీ దేవి యాగసంకల్ప సమయమునకు రాక ఆలస్యము చేసెను. దానితో ఆచార్యులందరూ ముహూర్తము దాటిపోవుననే భయంతో ‘గాయత్రి’ అనే కన్యనుతెచ్చి బ్రహ్మతో వివాహముచేసి సకాలమునకు యజ్ఞసంకల్పాన్ని గావించినారు.

అనంతరం అక్కడికి వచ్చిన సరస్వతీదేవి జరిగిన విషయమంతా తెలుసుకొని, సభాసదులందరినీ వీక్షించి “జ్యేష్టభార్యను నేనుండగా మీరు బ్రహ్మకు మరల పెండ్లిచేసి నన్ను అవమానించారని కోపించి, తన భర్తయైన బ్రహ్మదేవునికి, తన సవతి గాయత్రికి, అక్కడున్న ఋత్వికులకు మీరు జడస్వరూపమైన నదుల రూపమును పొందుదురుగాక” అని శపించెను.

శ్లో : తత్రవిష్ణురభూత్కృష్ణా వేణీదేవో మహేశ్వరః |

బ్రహ్మాకకుద్మతీ చాపి పృథగేవాభవన్నృప||

దేవాః స్వానపి తానంశాన్ జడీకృత్వా విచక్షువుః |

సహ్యాద్రి శిఖరేభ్యస్తే పృథగ్భూతశ్చ నిమ్నగ్రాః||

సరస్వతీ దేవి శాపమున విష్ణువు కృష్ణానదిగాను, శంకరుడు వేణీ నదిగాను, బ్రహ్మదేవుడు కకుద్మతీ నదిగాను, మిగతా ఋత్విక్కు లైన ఋషులంతా వారి వారి అంశలచే విశాలా, విజయా, వైష్ణవి, నారాయణి, తుంగా, భద్రా, మలాపహారిణి, కౌశికి, అర్చిరాది నదీరూపములను పొంది యాగము జరిగిన ప్రదేశమగు సహ్య పర్వతమున జన్మించి కృష్ణలో కలసి ఏకరూపమై ప్రవహించినారు.

గాయత్రీ దేవి కూడా సరస్వతీదేవిపై కోపించి బ్రహ్మపత్నిగా నీకు ఎంతఅర్హత ఉన్నదో నాకు అంతేఅర్హత ఉన్నది. కానీ నీవు నా అర్హతను ప్రశ్నించి నన్ను అవమాన పరిచావు కాబట్టి నీవుకూడా నదీరూపాన్ని పొందుదువుగాక! అని శాపాన్నిచ్చింది. సరస్వతిదేవి నదిగా మారింది. అదే సరస్వతీనది.

ఈ విధంగా దేవతల శాపాలు, వాటికి ప్రతిశాపాలు వారిపాలిట శాపాలైనా, ఈ శాపాల కారణంగా జన్మించిన నదులు మానవుల పాలిట వరాలయ్యాయి.

ఈ విధంగా శ్వేతాశ్వత్తరూపుడగు శ్రీకృష్ణుని దేహమునుండి ఉద్భవించిన కృష్ణానది సహ్యాద్రి శిఖరాగ్రమునుండి ప్రవహిస్తూ సకల జనులను పవిత్రులను చేస్తున్నది.

 శ్యామ్ ప్రణీత్ శర్మ అవధాని
 భారత ఋషిపీఠం
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here