బుడ్డ మిరపకాయ కథ

0
1628

 

chili story 
chili story 

chili story 

ఒక ఊరిలో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. ఒక నాడు ఆ అవ్వ కూరగాయలు తీసుకరావడానికని సంతకెళ్ళింది. సంతలో అవ్వ చాలా కూరగాయలు కొన్నది. వాటిలో ఒక బుడ్డ మిరపకాయ ఉన్నది. అవ్వ బస్సెక్కి ఇంటికి వెళ్ళింది. బస్సులోంచి బయటికి దూకిపోదామని బుడ్డమిరపకాయ చాలా ప్రయత్నించింది, కానీ తనను ఎవరైనా తొక్కేస్తారేమోనని భయపడి కూరగాయల బ్యాగ్ లోనే ముడుక్కున్నది.

ఇంటికి చేరుకున్న అవ్వ ఏమిచేద్దామా అని ఆలోచించి, మిరపకాయ బజ్జీలు చేద్దామనుకున్నది. బజ్జీలకోసమని మిరపకాయలను తీసుకొని, వాటికున్న తొటాలను తీసింది. బుడ్డ మిరపకాయ వంతు వచ్చేప్పటికి, అది ’అవ్వా! అవ్వా! నన్ను ఏమీ చేయ్యొద్దవ్వా! నువ్వు ఏమి సహాయం చెయ్యమన్నా చేసిపెడతాను’ అని ప్రాధేయపడ్డది. సరేనన్నది అవ్వ. బుడ్డ మిరపకాయకు ఒక పరక ఇచ్చి, ఇల్లంతా ఊడ్చమని చెప్పింది. బుడ్డ మిరపకాయ సరేనన్నది, కానీ ఇల్లు ఊడ్చకుండా మంచమెక్కి కాలు మీద కాలేసుకుని కూర్చుంది. అప్పుడు అవ్వ దాన్ని పరకతో కొట్టింది. అప్పటినుంచీ బుడ్డ మిరపకాయ బుద్దిగా ఉన్నది.

ఒకనాడు బుడ్డ మిరపకాయ అవ్వతో, ’అవ్వా! ఇకనుంచీ నేను బడికి పోతానవ్వా!’ అని అడిగింది. అందుకు అవ్వ ’సరే’నని ఒప్పుకుంది. బుడ్డ మిరపకాయకు ఒక పలకా, ఒక బలపం ఇచ్చి బడికి పంపింది. బుడ్డ మిరపకాయ పలకా, బలపం తీసుకొని బడికి వెళ్ళింది. ఆ రోజున బడిలో టీచరు ప్రజెంటు వేస్తూ, ’బుడ్డ మిరపకాయా’ అన్నది. అప్పుడు పిల్లలంతా గట్టిగా నవ్వారు. ఆరోజున బుడ్డ మిరపకాయ ‘ అ ‘ ‘ఆ ‘ లు నేర్చుకుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేప్పుడు పిల్లలందరూ బై, బుడ్డ మిరపకాయా! బైబై బుడ్డ మిరపకాయా!’ అని ఎగతాళి చేశారు.

ఇంటికెళ్ళిన బుడ్డ మిరపకాయ అవ్వతో, ’అవ్వా! నన్నంతా ’బుడ్డ మిరపకాయా’ అంటున్నారవ్వా!’ అని చెప్పింది. అప్పుడు అవ్వ ’ఏడుకొండల అవతల ఒక ఋషి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆయనను అడుగు. ఏమి చేయాలో ఆయనే చెబుతాడు’ అని చెప్పింది. బుడ్డ మిరపకాయ ఏడుకొండలు దాటి, అక్కడున్న ఋషిని కలిసి, తన బాధను చెప్పుకొంది. ఋషి ” టింగరు బుల్లయ్య ” అని దానికి ఒక మంత్రం ఉపదేశించి, ’ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. దీన్ని సరిగా వాడితే లోక కల్యాణం జరుగుతుంది. చెడు పనులకు వాడితే వినాశనం తప్పదు’ అని హెచ్చరించాడు.

తిరిగొచ్చిన బుడ్డ మిరపకాయ మర్నాడు బడికి వెళ్ళింది. ’హాయ్ బుడ్డమిరపకాయా’ అన్నారంతా. ’నన్నే బుడ్డ మిరపకాయంటారా!’ అని మండిపడ్డ బుడ్డ మిరపకాయ, “పిల్లలంతా టింగర్ బుల్లయ్య” అన్నది. అంతే! పిల్లలంతా చనిపోయారు. టీచరు వచ్చి ’ఒరేయ్! బుడ్డ మిరపకాయా! అందర్నీ లేపురా’ అని అన్నది. ’నన్నే బుడ్డ మిరకాయంటావా! టీచరూ?’ “టీచరూ టింగరు బుల్లయ్య” అన్నది బుడ్డ మిరపకాయ. అంతే! టీచరు కూడా చనిపోయింది.

ఇక బుడ్డ మిరపకాయ తీరికగా ఇంటికెళ్లింది. ఇంట్లో అవ్వ ’ఒరేయ్! బుడ్డ మిరపకాయా! అరటి పండు తింటావారా?’ అని అడిగింది ప్రేమగా. గర్వపోతు బుడ్డ మిరపకాయ “నన్నే బుడ్డ మిరపకాయంటావా” అని, “అవ్వకూడా టింగరు బుల్లయ్య” అన్నది బుడ్డ మిరపకాయ. అంతే! అవ్వ కూడా చనిపోయింది.

తర్వాత బుడ్డ మిరపకాయకు ఆకలైంది. అది ఒక అరటి పండును తీసుకొని అద్దానికి ఎదురుగా నిలబడింది. తన అందాన్ని చూసుకొని మురిసిపోయింది. తినటంకోసం పండు తొక్క ఒలిచింది. అద్దంలో బుడ్డ మిరపకాయ ప్రతిబింబం కూడా అరటిపండు తొక్కను ఒలిచింది.

ఆత్మదురభిమానం ఎక్కువ అయిన బుడ్డమిరపకాయకు కోపం వచ్చింది. “ఆ! నేనెలా చేస్తే నువ్వూ అలానే చేస్తావా! నువ్వు కూడా టింగరు బుల్లయ్య” అన్నది. అంతే! ప్రతిబింబంతోపాటు బుడ్డ మిరపకాయకూడా చనిపోయింది!

అహంకారం వినాశహేతువు.

Courtesy..
kottapalli.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here