
సంపూర్ణ విజయం | Story of Complete Success in Telugu
స్కూల్ నించి ఇంటికి వచ్చాక మౌనిక కాగితాలు తీసుకుని ఏదో రాయడానికి కూర్చుంది. కొద్దిగా రాశాక అది నచ్చక చింపేసి కొత్త కాగితం తీసుకుని మళ్లీ ఏదో రాయసాగింది. ఇలా నాలుగైదు కాగితాలు చింపేశాక, తననే గమనిస్తున్న తండ్రి వంక చూస్తూ మౌనిక అడిగింది.
“నాన్నా! ఓ స్కూల్ అసైనమెంట్లో నాకు సహాయం చేస్తావా?” ‘అలాగే, ఏమిటది?’ ఆయన అంగీకరించాడు.
‘నిజమైన విజయం అంటే ఏమిటి? ఈ పాయింట్ మీద వ్యాసం రాసి తీసుకురమ్మన్నారు.
గాంధీ పోరాడి స్వాతంత్ర్యం తీసుకురావడం గురించి రాశాను. కాని మన దేశ పరిస్థితులు తలచుకుంటే అది సంపూర్ణ విజయం కాదనిపించింది.
అన్నయ్య ఎం.డి చేసి సొంతంగా నూట పది బెడ్ల హాస్పిటల్ తెరవడం విజయం అనిపించి అది కొంత రాశాక, అదీ సంపూర్ణ విజయం కాదనిపించింది. సంపూర్ణ విజయం ఉన్నచోట ఆనందం తప్ప దుఃఖం ఉండదుగా. పెళ్ళై పదేళ్లయినా అన్నయ్యకి ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇలా కొన్ని టాపిక్స్ మీద రాసినా వేటిలో సంపూర్ణ విజయం లేదనిపిస్తోంది.
సంపూర్ణ విజయం గల టాపిక్ ఏదైనా చెప్పగలవా?’ మౌనిక అడిగింది.
ఆయన చిన్నగా తల పంకించాడు. ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన మొహంలోని హావభావాలను బట్టి ఆమెకి అనిపించింది. తర్వాత నవ్వుతూ చెప్పాడు.
“నీ జీవితమే సంపూర్ణ విజయం”
మౌనిక ప్రశ్నార్థకంగా చూసింది.
‘నా జీవితం, మన కుటుంబ సభ్యుల జీవితం.. ప్రపంచంలోని వారందరి జీవితాలు ఈ రోజుకి సంపూర్ణ విజయాలు’
‘నాకు అర్థం కాలేదు’
“చెప్తాను. మనిషికి అన్నిటికన్నా విలువైనది ఏదో దాన్ని పోగొట్టుకోకుండా ఉండటమే అసలైన విజయం. ఆ విజయం సాధిస్తేనే. మిగిలిన విజయాలో లేదా అపజయాలో అతనికి దక్కు తాయి.”
‘మనిషికి అన్నిటికన్నా విలువైనది ఏది?”
‘ఓ ఆటవికుడ్ని ఎవరో ‘నీ జీవితంలోని విజయం ఏమిటి?’ అని అడిగితే అతను చెప్పిన జవాబే నేను నీకు చెప్పింది. అతను ఏమన్నాడో తెలుసా? ‘గత అరవై ఏళ్లకి పైగా నాకు తినడానికి సరిపడా నిత్యం లభ్యం అవడం, నేను తినబడకుండా తప్పించుకోవడం’ అన్నాడు.
‘ఓ! మనిషికి అత్యంత విలువైంది ప్రాణాలా?’
“అవును. నీ జీవితం గురించి ఆలోచించు. నీకు అవసరమైన భోజనం, దుస్తులు, తలదాచుకునేందుకు నీడ ఉన్నాయి. వాటిని మనం చాలా లైట్గా తీసుకుంటూంటాం. వీటిలో ఏది లోపించినా అప్పుడు అవి మన మనుగడకి ఎంతటి అవసరం అయినవో అర్థం అవుతుంది. ఇవి పొందగలగడం ప్రధాన విజయం. మన మనుగడ సాగితేనే మిగిలినవన్నీ.
మౌనిక మొహం వికసించింది.
“నువ్వు చెప్పింది కరెక్ట్ నాన్నా! మొన్న అన్నయ్య లైబ్రరీలోని ఓ పుస్తకంలో ఈ సంఘటన చదివాను. ఎనభై అడుగుల లోతున్న సముద్రపు నీటిలో ఓ కుర్రాడు మైలుదూరం ఈదుకుంటూ వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి ఈదసాగాడు. కాని ఒడ్డు ఇంకో అర మైలు దూరం ఉందనగా వాడిలోని ఓపిక నశించింది. శక్తి లేక ఈదడం ఆగిపోయి నిస్సహాయంగా మునగసాగాడు. సరిగ్గా ఆ సమయంలో వాడికి కొద్ది దూరంలో ఓ షార్క్ చేప కనిపించింది. అంతే! వాడికి అంత శక్తి ఎలా వచ్చిందో వాడికే తెలీదు. ఒడ్డుకి ఈదుకుంటూ వచ్చాడు. సముద్రంలో మునిగి చావటం ఓకే అనుకున్నాడు కాని, షార్క్ తనని తినటం వాడు ఓకే అనుకోలేదు.”
“దీన్నిబట్టి నువ్వు నేర్చుకోవాల్సిన నీతి ఒకటి ఉంది. ఎప్పుడు అపజయం ఎదురైనా కృంగిపోకూడదు. జీవితంలో అపజయాలు వస్తూంటాయి. పోతూంటాయి. కాని మన మనుగడ కొనసాగుతున్నంత కాలం విజయం మన పక్షం అని గ్రహించాలి’ ఆమె తండ్రి చెప్పాడు.
ఆ తర్వాత మౌనిక చకచక కాగితం మీద తన అసైనమెంట్ ని చక్కగా రాసేసింది.
-వెంకట కృష్ణమూర్తి