నిలకడగా జీవక్రియలు
నిలకడగా జీవక్రియలు? – గంటలకొద్దీ అదేపనిగా కూచోవటం ఎవరికైనా మంచిది కాదు. ఇది జీవక్రియల వేగాన్ని నెమ్మదింపజేస్తూ.. మధుమేహం వంటి రకరకాల సమస్యలకు దారితీస్తుంది. చాలాసేపు కూచొని పనులు చేయాల్సిన వారికిది నిజంగానే హానికరంగా పరిణమిస్తుంది. అంతమాత్రాన మరీ బెంగ పడాల్సిన పనేమీ లేదు. మధ్యమధ్యలో కాసేపు లేవటం, వీలైతే కొద్దిసేపు నడిస్తే చాలు. దీంతో ఎక్కువసేపు కూచోవటం వల్ల తలెత్తే అనర్థాలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా నెలసరి నిలిచిన మహిళలకిది ఎంతో మేలు చేస్తుంది. బ్రిటన్, ఆస్ట్రేలియా పరిశోధకుల తాజా అధ్యయనం ఈ విషయాన్నే నొక్కి చెబుతోంది. అధికబరువు, వూబకాయం గల మహిళలను ఎంచుకొని.. కొందరిని ఏడున్నర గంటల పాటు కూచోవాలని సూచించారు. మరికొందరిని మధ్యమధ్యలో లేవాలని, ఇంకొందరికి లేచి ఐదు నిమిషాల సేపు నడవాలని చెప్పారు. ఏడున్నర గంటల పాటు కూచునేవారితో పోలిస్తే.. మధ్యమధ్యలో కాసేపు లేచి కూచున్నవారిలోనూ, నడిచినవారిలోనూ గ్లూకోజు, ఇన్సులిన్, కొవ్వు ఆమ్లాల స్థాయులు తగ్గటం గమనార్హం. ఇవన్నీ జీవక్రియలు వేగం పుంజుకున్నాయనటానికి సూచనలే! కాబట్టి ఎక్కువసేపు కూచోని పనులు చేసేవారు మధ్యమధ్యలో కాసేపు లేచి నిలబడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జీవక్రియలు పుంజుకునేలా చూసుకోవటానికిది తేలికైన, చవకైన పద్ధతనీ వివరిస్తున్నారు.