
2. డిప్రెషన్ కి లోనవుతున్నారా
కాలం మారింది. అన్నిరంగాలు వేగం పుంజుకున్నాయి. అందరూ కాలం తో పాటూ పరుగెడుతున్నారు. కాని కొంతమంది.
ఆ కాలవేగాన్ని అందుకోలేక సతమతం అవుతున్నారు. యంత్రాలతో పాటు పరిగెట్టే మానవులు తమ శారీరక ఆరోగ్యాన్ని సరిగా చూసుకోవడం లేదు.
ఆరోగ్యముంటేనే ఎన్ని అందలాలనైనా ఎక్కవచ్చు అనే దాన్ని వదిలేసి మన సామర్థంఎంత అనే ఆలోచన లేకుండా పక్కవాడు పరుగెత్తుతున్నాడు నేనూ పరిగెత్తాల్సిందే అనుకోవడమే ఈ రుగ్మతలకు కారణం.
అందరూ పల్లకిఎక్కేవారుంటే మోసేవారు ఎవరు అన్న ఆలోచన్ను మానేస్తున్నారు. ఇంతకుముందు కాలంలో మనుషులు ప్రశాంతంగా ఉంటే చాలు.
ఆరోగ్యముంటే చాలు ఉన్నదాన్నిలో తృప్తిగా జీవిస్తే చాలు అనుకొనేవారు. నేటి జీవనకాలంలో తృప్తి అనే మాటకు విలువ లేకుండా ఇంకా ఇంకా కావాలనే ఆలోచన్ల వల్ల ముందుకు పరుగెడుతున్నారు.
దానివల్లే ఈ బాధలు వస్తున్నాయి. బాధలకు కారణం కనుగొంటేచాలు రుగ్మతలను పారద్రోలవచ్చు. అందుకే సైక్రియాటిస్టులు, సైకాలజిస్టులు కావాల్సివస్తున్నారు.
అసలు ఆరోగ్యం కావాలంటే మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే చాలు ఆరోగ్యం అదే వస్తుంది.
ఇంటర్ చదువుతున్న విజయ్ యేడాది క్రితం హాస్టల్ నుండి పారిపోయాడు. కొడుకును ఇంజనీరింగ్ చేయాలని కలలు కన్న తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగిలింది.
ఎంత వెదికినా దొరకని కొడుకు కోసం అమ్మానాన్నలు కుమిలిపోతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని నిందిస్తూ పోలీసు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, కొడుకు కోసం నిరీక్షించడం తప్ప వారికి మరో దారి దొరకడంలేదు.
కామర్స్ అంటే ఇష్టపడే నిషాంత్ ను తల్లిదండ్రులు బలవంతంగా ఇంటర్లో ఎంపిసిలో చేర్పించారు. యేడాది తరువాత కాలేజీకి పోనని మొండికేస్తున్నాడు. బలవంతంచేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు.
రోజంతా తన గదిలోనే గడుపుతున్నాడు. నలుగురితో కలవడానికి, బయట తిరడానికి ఇష్టపడటం లేదు. ఇంజనీర్ కావలసిన కొడుకుని మానసిక వైద్యుల చుట్టూ తిప్పాల్సి వస్తుందని తల్లిదండ్రులు వ్యధ చెందుతున్నారు.
ఆధునిక విద్యా వ్యవస్థలో ఇలాంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. 20 ఏళ్ల క్రితం పెద్దలకు మాత్రమే వస్తుందని భావిస్తున్న డిప్రెషన్, మనోవ్యాధి లాంటి మానసిక రుగ్మతలు బాలలు, యువతను కూడా ఆవహిస్తున్నాయి.
అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (ఎన్ఐఎంహెచ్) వారు నిర్వహించిన అధ్యయనంలో 8 శాతం యువకులు 2 శాతం బాలుల డిప్రెషన్తో బాధపడుతున్నట్టు వెల్లడయ్యింది.