సంకల్పం

0
1955
Determination / సంకల్పం

Determination / సంకల్పం

మంచి పనులు చేయడమే కాదు, మంచి జరగాలనే సంకల్పం కూడా మన జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుందనటంలో సందేహం లేదు.

మన సంకల్పంలో నిజాయితీ, మనలోని ఆశావహ దృక్పథం మన చుట్టూ ఉన్న చెడును వేళ్ళతో సహా పెకిలించివేయగలదు.

మంచికి ఉన్న శక్తి, ఆలోచనకున్న శక్తి, వాటిని మన దృక్పథంలోకి తెచ్చుకునేంత సహృదయత కలిసికట్టుగా పనిచేయగలిగితే అనుకోనివే కాదు, ఎన్నటికీ కాలేనివి కూడా జరగడానికి ఆస్కారముంటుంది.

మనకు మనమే మనవంతుగా మనమూ ప్రపంచానికి మంచి జరగాలనే సత్సంకల్పం చేయగలిగితే అసాధ్యమన్నదే లేదని తెలియపరుస్తూ మనలోని మంచినీ, సంకల్పాన్నీ తట్టిలేపే కథే ఇది.

ఒకానొక చిన్న పల్లెటూరు. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిషపండితుడు నివసించేవాడు. ఆయన చెప్పిన మాట పొల్లుపోదనీ చెప్పి ఫలితం తప్పుకాదనీ ఆ ఊరి ప్రజల విశ్వాసం.

ఆ నోటా ఈ నోటా విన్న ఓ పేదరైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిషుని దగ్గరకు వచ్చి తనకు జోస్యం చెప్పమనీ తన జాతకాన్ని అతనికి ఇస్తాడు.

తనపై నమ్మకముంచి వచ్చినందుకు ఆ పేదరైతుకు కూర్చోమని సైగచేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు.

ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిషుడు పేదరైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు.

ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేదరైతుకు ఆనాటి రాత్రి ప్రాణ గండం కనిపించడం వల్లనే. ఎంతటి నిజాన్నైనా చెప్పగలను.

కానీ రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉందని ఎలా చెప్పనని చింతించి ఎలాగోలా తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ఇవాళ నాకు చాలా పనిఉంది. మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి.

రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశితంగా పరిశీలించి చెబుతాను అని అంటాడు.జ్యోతిషునిపై మర్యాదతో ఆ పేదరైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు.

రైతు వెళ్ళగానే జ్యోతిషుడు తన భార్యతో విషయం చెబుతాడు. కానీ మనసులో పాపం పేదరైతు నేడు మరణిస్తాడే. నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడేనని చింతిస్తాడు జ్యోతిషుడు.

పేదరైతు జ్యోతిషుని ఇంటినుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళుతున్నాడు. దారిలోనే చీకటి పడటంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెదకడం మొదలుపెట్టాడు.

ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలావస్థలో శివుని ఆలయం కనిపించిందతనికి.

అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు. ప్రజలకు మనఃశ్శాంతినీ, భక్తి భావాలనూ పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే.

నా దగ్గర డబ్బుండుంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాణ్నిని మనసులో అనుకుంటాడు. మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి.

రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి. మండపాలు ఎలాకడితే బాగుంటుంది. అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలూ, పూజలూ నిర్విఘ్నంగా జరుగుతుంటే ఎంత బాగుంటుందనీ శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుందనీ అనుకుంటుండగానే మండపం పైభాగంలోంచి నల్లని త్రాచుపాము అతనిని కాటు వేయడానికి అతనిపై దూకపోతుంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు.

మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అమ్మయ్య! బతికి పోయాననుకొని ఇంటికి చేరుకుంటాడా పేదరైతు.

మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకొని జ్యోతిషుని దగ్గరకు వెళతాడు పేదరైతు. అతణ్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిషుడు నా గణనలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్ర్తాలను తిరగేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు.

కానీ గణింపులో ఎక్కడా తేడాలేదు. అంతా సరిగ్గానే ఉంది. ఇక తప్పదన్నట్లు విషయం పేదరైతుకు వివరించి జ్యోతిషుడు నిన్న ఏం జరిగిందో ఏదీ మర్చిపోక తెలియజేయమని రైతుకు చెబుతాడు. జరిగిందంతా వివరిస్తాడు పేదరైతు.

మంచి చేయాలని కేవలం తలింపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం.మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి.

మన ఆలోచనలు సత్సంకల్పాలయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం.

అందుకే అంటారు అందరూ మంచిగా ఉండాలి. మంచివారి సంకల్పాలూ మంచిగా ఉండాలి. మంచిని సంకల్పించే వారంతా బాగుండాలి. ఈ ఆర్టికల్ నమేస్తే తెలంగాణ సైట్ నుంచి సేకరించబడినది.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here