రోజు రోజుకూ పెరిగే గణపయ్య ఎక్కడ ఉందొ మీకు తెలుసా?

0
2341

విఘ్నాలకు అధిపతి వినాయకుడు. పార్వతీ తనయుడైన గణపతిని పూజించిన అనంతరమే అన్ని కార్యాలను ప్రారంభిస్తాం. మూషిక వాహనుడైన విఘ్నేశ్వరునికి దేశంలో ఆలయాలు అనేకం ఉన్నాయి. తొలి పండగను వినాయక చవితిగా జరుపుకొంటాం. జగన్మాత కుమారుడైన స్వామికి ఉన్న విశిష్ట ఆలయాల్లో కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలోని మధూరు ఒకటి. మధురవాహిని నదీ తీరంలో, ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన విఘ్నరాజును దర్శించుకునేందుకు భక్తులు వస్తుండటంతో మధూరు నిత్యం దైవ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో నిండివుంటుంది.

ఉద్భవమూర్తి..
మధూరులోని ఆలయంలో ప్రధాన దైవం పరమేశ్వరుడు. ఈ క్షేత్రంలో మదరాంతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. స్థలపురాణం ప్రకారం ఒక మహిళ స్వామివారి విగ్రహాన్ని కనుగొంది. అందుకనే స్వామివారిని ఉద్భవమూర్తిగా పేర్కొంటారు. తొలిసారిగా మహిళా భక్తురాలికి స్వామివారు దర్శనమిచ్చారు. అందుకనే ఆమె పేరుపై మధూరు ఆలయంగా ప్రసిద్ధి చెందింది. స్వామి గర్భగుడి వెలుపల దక్షిణ భాగం గోడపై వినాయకుడి విగ్రహం ఉంటుంది. రోజురోజుకూ స్వామివారు పెరుగుతుండటం విశేషం. అందుకనే బొడ్డ గణేశా అని పిలుస్తుంటారు. ప్రధాన దైవం ఈశ్వరుడు అయినా గణనాథునికి విశేషపూజలు నిర్వహించడం క్షేత్ర ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది.

సుల్తాన్‌ వెనుదిరిగాడు..
ఒక కథనం ప్రకారం టిప్పుసుల్తాన్‌ ఆధ్వర్యంలోని సేనలు మలబార్‌పై దండెత్తాయి. ఈ క్రమంలోనే ఆలయంపైకి సేనలు వచ్చాయి. ఆలయ ప్రాంగణంలోని బావిలోని నీటిని టిప్పుసుల్తాన్‌ తాగిన తరువాత మనస్సు మారి దాడిని విరమించుకొని వెనక్కు మళ్లినట్టు తెలుస్తోంది.ఆలయాన్ని ఏనుగు ఆకారంలో నిర్మించారు. మూడు అంతస్తులుగా ఉండే ఆలయం సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది.

ప్రసాదంగా అప్పం..
ఆలయంలో కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్ని ప్రసాదంగా ఇస్తారు. మహాగణపతికి ఉదయాస్తమానసేవ నిర్వహిస్తారు. సహస్ర అప్ప పూజలో భాగంగా వెయ్యి అప్పాలతో పూజలు జరిపిస్తారు. మరో ముఖ్యమైన సేవ మూడప్పమ్‌. ఇందులోనూ అప్పాలతో పూజ జరిపించడం విశేషం. వినాయక చవితికి భారీ స్థాయిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవాలి…
* కాసర్‌గోడ్‌ నుంచి ఆలయం 7 కి.మీ. దూరంలో ఉంది.

* కాసర్‌గోడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మధూర్‌కు వివిధ వాహనాల ద్వారా చేరుకునే సౌలభ్యముంది.

* మంగళూరు విమానాశ్రయం ఇక్కడ నుంచి 70 కి.మీ. దూరంలో ఉంది. విమానాశ్రయం నుంచి ఆలయానికి ప్రైవేటు ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here