
వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు | Diwali Celebration in Different Region in Telugu
భారతదేశంలో ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ దీపావళి. భారతీయ పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆచారవ్యవహారాలన్నిటి కలయికతో కూడుకొని ఉంటాయి. అందుకే పండుగలను, పర్వదినాలను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
దూరతీరాల్లో ఉన్న కుటుంబంలోని వ్యక్తులందరూ కలసి ఒకేచోట సుఖ సంతోషాలతో, హాయిగా గడపటానికి ఈ పండుగలు ఎంతగానో ఉపయోగపడతాయి. అటువంటి పండుగలలో అతి ముఖ్యమైన పండుగ దీపావళి.
1. వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు
భారతీయ సంస్కృతికి, నాగరికతకు, విలువలకు, వారసత్వానికి దీపావళి పండుగ ప్రతీక. భారతదేశంలో వారి వారి ఆచార వ్యవహార పద్ధతుల ద్వారా, సమైక్యభావనతో ‘దీపావళి’ పండుగను జరుపుకుంటారు.ఇది భిన్నత్వంలోని ఏకత్వాన్ని సూచిస్తుంది.
“దీపప్రదః స్వర్గలోకే దీపమాలేవ రాజతే?”
అన్న శ్లోకాంశాన్ని బట్టి మహాభారత కాలానికే ఈ పండుగ ఆచరణలో ఉన్నదని స్పష్టమౌతుంది. దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ బహుళ అమావాస్య నాడు వస్తుంది.
ఈ మాసం ‘శరన్నవరాత్రులతో మొదలై దీపావళితో ముగుస్తుంది. స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్య రోజున ‘దీపావళిని జరపాలని శాస్త్రజ్ఞలు నిర్ణయించారు.
దీనికి ముందు రోజు అనగా చతుర్ధశిని నరకచతుర్దశి’ అని అంటారు. నరకాసుర సంహారం జరిగిన రోజు ఇది. అనగా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకొంటున్నాము.