నేడు దుర్గాష్టమి..! ‘శరదృతువులో వచ్చే దుర్గాష్టమి మాఘ మాసంలో రావడమేమిటి..?’ అనుకుంటున్నారా.
హిందూ సాంప్రదాయం లో సంవత్సరానికి ఐదు నవరాత్రులు వస్తాయి.
వసంత నవరాత్రులు,
ఆషాఢ నవరాత్రులు,
శరన్నవరాత్రులు,
పౌష నవరాత్రులు,
మాఘ నవరాత్రులు.
మాఘ శుద్ధ అష్టమి ని ‘వీరాష్టమి’ అంటారు. సాధారణంగా దసరా నవరాత్రులలో ఎనిమిదవ రోజు చేసే దుర్గాష్టమీ పూజ తో సమానమైనది ‘వీరాష్టమి’. మాఘ మాసం లోని శుక్ల పక్షం లో ఒచ్చే మొదటి తొమ్మిది రోజులనూ “గుప్త నవరాత్రులు” అనీ “మాఘ నవరాత్రులు” అనీ అంటారు. ఆ తొమ్మిది రోజులలో మాఘ శుద్ధ అష్టమి ‘దుర్గా పూజ’ , ‘దుర్గాష్టమి’ లేదా ‘మహాష్టమి’ అంటారు. ఈ రోజున ఆదిపరాశక్తిని పూజించడం వల్ల శత్రు పీడలు తొలగుతాయి. సకల శుభాలూ కలుగుతాయి. ఆయుధ పూజలకూ, వాహన పూజలకూ,కొత్త పనులను ప్రారంభించడానికీ నేడు ఎంతో మంచి రోజు.
శరన్నవరాత్రులలో పాటించే పూజా విధానమే మాఘ నవరాత్రులలోనూ పాటించాలి. వీలుపడని పక్షం లో అమ్మవారి ఆలయానికి వెళ్ళి అర్చన, అభిషేకం చేయించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది.