తోటకాచార్యుడు ఎవరు?
జగద్గురు ఆదిశంకరులవారికి నలుగురు శిష్యులు ఉండేవారట. పద్మ పాదుడు, సురేశ్వరుడు,హస్తమాలకుడు, ఆనందగిరి వారి పేర్లు. వారిలో పద్మపాదునికి తాను అందరికన్నా తెలివైన వాడినని గర్వం ఉండేది. ఆనంద గిరి అమాయకుడు, వారందరిలోకీ తెలివితక్కువ వాడు. కానీ గురువును దైవం కన్నా మిన్నగా పూజించేవాడు. అతని గురుభక్తి అద్వితీయమైంది. ఆయనే తరువాత ఒకనాడు తోటకాచార్యునిగా మారాడు.
ఆశ్రమం లో ఆ నాడు జరిగిన కథ ఏమిటి?
ఒక రోజు శంకరులవారు ప్రాతస్సమయం లో శిష్యులకు ఉపనిషత్తులను బోధించడానికి ఉపక్రమించారు. కానీ వారిలో గిరి లేడు. అతను ఎక్కడికి వెళ్లాడని అడగగా పద్మ పాదుడు “స్వామీ..! అతను బుద్ధి హీనుడు. మీరెంత ప్రయత్నించిననూ అతనికి చదువురాదు. మీ వస్త్రాలను శుభ్రం చేయడానికి అతను నదికి వెళ్ళాడు. అతనికోసం పాఠాన్ని ఆపడం వలన ప్రయోజనం లేదు” అన్నాడు. పద్మ పాదుని అహంకారాన్ని అణచాలని స్వామి నిశ్చయించుకున్నారు. ఆనందగిరి గురుభక్తిని అందరికీ తెలియజెప్పాలనుకున్నారు.
శంకరాచార్యుడు ఆనందగిరి గురుభక్తిని ఎలా సత్కరించాడు?
ఆనందగిరి గురుభక్తికి ఫలితాన్ని ప్రసాదించాలని సంకల్పించి తన దివ్యశక్తి తో అతనికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. గురువుగారి బట్టలను ఉతికి నడినుండీ వచ్చిన ఆనందగిరి అతి కష్టమైన తోటక ఛందస్సులో ఆది శంకరుని స్తుతిస్తూ ఆశువుగా అద్భుతమైన అష్టకాన్ని చదివాడు. అతని వాక్పటిమకు ఆశ్చర్య పోయిన పద్మపాదుడు తన తప్పు తెలుసుకున్నాడు. ఆనందగిరి తరువాత అదే తోటక ఛందస్సులో “శ్రుతిసార సముద్ధరణ” అనే గ్రంథాన్ని కూడా రాశారు. ఆయనకు తోటకాచార్యుడని పేరు. శంకరాచార్యులు ఉత్తరాన బదరీనాథ్ లో గల జ్యోతిర్మఠ పీఠాన్ని నిర్వహించమని ఆయనను నియమించారు.ఇదే తోటకాచార్యుని కథ.
తోటకాచార్యుని కథ మనకు ఏమి చెబుతుంది?
మీ అభివృద్ధినే కాంక్షించే మంచి గురువుని మనసా వాచా కర్మణా నమ్మి శుశ్రూష చేయండి. అహంకారాన్నీ, కుత్సితాన్నీ వీడండి. నిష్కల్మషమైన మనసుతో మీ కర్మలను నిర్వర్తించండి.
గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మైశ్రీ గురవేనమః