ఖరీదైన చిలగడ దుంప

0
1100

ఒకసారి రాజుగారు వేటకోసం వెళ్లాడు. ఆ క్రమంలో ఆయ నకు బాగా దాహం వేసింది.

ఒక పూరి గుడిసె కనిపించడంతో వెళ్లి తలుపుతట్టాడు. ఒక కట్టెలు కొట్టుకుని బతికే బీదవాడు తలుపు తెరిచాడు. రాజుగారిని చూసి దిగ్ర్బాంతుడై నోట మాట రాక అలా నిల్చుండిపోయాడు.

ఆఖరికి ఎలాగో గొంతుపెగల్చుకుని ‘రాజావారికి స్వాగతం’ అన్నాడు.

అతని భార్య గుడిసె ముందున్న చిన్నపాటి అరుగుమీద జింక చర్మం పరిచింది. దానిమీద కూర్చుంటూ రాజు ‘దాహం’ అన్నట్టుగా సైగ చేసాడు.

ఆమె కొన్ని ఉడకబెట్టిన చిలగడ దుంపలు, మంచినీళ్లు తీసుకుని వచ్చింది.

“అయ్యా తమరు ఏమనుకోకుండా ఇవి తిని, నీరు తాగండి. ఇంత కన్నా మా ఇంట్లో మరేం లేవు’ అంది బిడియంగా.

ఆకలిగా ఉన్న రాజుగారు వాటిని ఆబగా తినేశాడు. ఎంతో రుచిగా ఉన్నాయి అవి. ఆ తర్వాత నీళ్లు తాగాడు.

“అమ్మా! అద్భుతంగా ఉన్నాయి మళ్లీ వచ్చినప్పుడు కూడా నాకు . ఇవే పెట్టాలి” అని సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.

ఓ ఏడాది గడిచింది

కానీ రాజుగారికి మళ్లీ ఆ గుడిసెకు వెళ్లే వీలు కుదరలేదు, ఒకరోజున ఆ కట్టెలు కొట్టేవాడు ఏదో పనిమీద రాజధాని నగరానికి వెళ్లాల్సి వచ్చింది. అతని భార్య కొన్ని ఉడకబెట్టిన చిలగడ దుంపలు మూటగట్టి ఇచ్చి, “ఇవంటే రాజుగారికి ఎంతో ఇష్టం కదా ఆయనకు ఇవ్వు అని చెప్పింది.

కానీ అతనికి తనను రాజుగారి సమక్షానికి వెళ్లనిస్తారని గానీ, అలాంటి బీద కానుక ఇవ్వడం బాగుంటుందని గాని ఏ కోశానా నమ్మకం కలగలేదు. ఏదో భార్య మాట కాదనలేక ఆ మూట పట్టుకుని బయలుదేరాడు.

‘ఎలాగూ తనను రాజుగారిని దర్శించడానికి అనుమతించరు అనే అభిప్రాయంతో ఆకలైనప్పుడల్లా దారి పొడుగునా ఒక్కొక్క చిలగడ దుంపనే తినేసాడు.

రాజధాని నగరానికి చేరుకునే సరికి ఒక పెద్ద దుంప మాత్రమే మిగిలింది. రాజుగారి అంతఃపురం ముందు తచ్చాడుతుంటే భటులు ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? చేతిలో ఆ మూట ఏంటి?’ అని గద్దించారు.  

‘రాజుగారికి ఉడికించిన చిలగడ దుంపలు కానుకగా ఇవ్వడానికి చాలా దూరం నుంచి వచ్చాను’ అన్నాడు బీదవాడు భయంభ యంగా.

‘ఏంటీ? రాజుగారికి చిలగడ దుంపలు కానుకగా ఇస్తావా?’ అంటూ భటులు హేళనగా నవ్వారు, అదే సమయంలో మహా ఆశపోతు జమీందారు అక్కడికి గుర్రం మీద వచ్చాడు. అక్కడి సంభాషణ విని తాను కూడా పెద్దగా నవ్వి లోపలికి వెళ్లి రాజుగారితో, ‘అయ్యా తమరికో తమాషా చెప్పనా? బయట ద్వారం వద్ద ఒక పల్లెటూరి బైతున్నాడు. ప్రభువుల వారికి కానుకగా ఉడకబెట్టిన చిలగడ దుంప తెచ్చాడట. ఎవడో పిచ్చివా డులా ఉన్నాడు’ అన్నాడు.

రాజుగారికా ఆ బీదవాడు ఎవరో వెంటనే జ్ఞాపకం వచ్చింది. “పరుగున వెళ్లి ఆ బీదవాడ్ని సాదరంగా తీసుకురా’ అని ఒక భటుడ్ని ఆజ్ఞా పించాడు.

ఆ బీదవాడు లోపలికి రాగానే సింహాసనం దిగి సాదరంగా ఎదురేగి అతన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అతన్ని ఉచితాసనం మీద కూర్చోబెట్టి అతను ఇచ్చిన దుంపను ప్రీతిగా స్వీకరించాడు. సభికులందరూ ఆశ్చర్యంగా చూడసాగారు.

ఒక వెయ్యి బంగారు నాణాలు తెప్పించి ఆ బీదవాడికి ఇచ్చి ‘ఈ ధనం నీకు మరియు నా సోదరికి. వెళ్లి అతిథి గృహంలో బసచెయ్యి. తర్వాత మాతోపాటు భోజనం చేద్దువుగాని” అన్నాడు.

అదంతా చూసిన జమీందారుకు ఒక ఆలోచన వచ్చింది. ‘రాజు గారు కానుకలిచ్చే ధోరణిలో ఉన్నారు’ అనుకుని బయటికి వెళ్లి తాను ఎక్కివచ్చిన అత్యుత్తమ పంచకల్యాణి గుర్రాన్ని తెచ్చి, ‘ప్రభూ, ఇది తమరికి నా కానుక అన్నాడు.

‘చిన్న చిలగడ దుంపకే వెయ్యి వరహాలిచ్చిన రాజుగారు ఈ మేలు జాతి గుర్రానికి ఎంత పెద్ద బహుమానం ఇస్తారో’ అని ఆశపడుతూ.

రాజుగారు నవ్వి, “కృతజ్ఞతలు.ఈ గుర్రానికి బదులుగా ఈ కానుక తీసుకోండి’ అంటూ ఇందాక బీదవాడిచ్చిన చిలగడ దుంపను అతని కిచ్చి, “ఇదెంత విలువైందో తెలుసుకదా! దీన్ని వెయ్యి వరహాలిచ్చి తీసుకున్నాను.

ఇందులో సగం తీసుకుని మిగతా సగం నాకు ఇవ్వండి’ అన్నాడు.

‘చిత్తం ప్రభూ!’ అన్నాడు జమీందారు నీళ్లు నములుతూ.

-మదన్మోహనరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here