Vinayaka Chavithi 21 Patri in Telugu / వినాయకచవితి – 21 పుజాపత్రాలు
ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజు మొదలు అనంత పద్మనాభ చతుర్దశి వరకు యావత్ భారతదేశంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి ఇంటా వినాయక విగ్రహాలు ప్రతిష్టించి, వారి వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంత పద్మనాభ చతుర్ధశి నాడు జల నిమజ్జనం చేయడం మన ఆచారం.
వినాయక చవితి వ్రతంలో ఏకవింశతి పత్రపూజ (21 రకముల పత్రాలతో పూజించే విధానం) విశిష్టమైనది. ఒక్కొక్క నామమును స్మరిస్తూ ప్రత్యేక పత్రములతో గణపతిని పూజిస్తాం. ఈ పూజకు ఉపయోగించే పత్రాల్లో అనేక భౌతికమైన, ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాకుండా ఎన్నో దైవీపరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. సూక్ష్మప్రపంచంలో దాగి ఉన్న అద్భుతశక్తులు ఈ పత్రపూజ ద్వారా మానవాళికి శుభాలను కలుగజేస్తాయి.
మహోత్కృష్టమైన హిందూధర్మంలో ఋషులు ఓషధులను, మూలికలను పూజా ద్రవ్యాలుగా, యజ్ఞ యాగాది క్రతువులలో సమిధలుగా చెప్పారు. అటువంటి వాటి వాటి తో పూజలు, యజ్ఞ యాగాదుల నాచరించి ఐహికామప్మిక సద్దతులను పొందవచ్చు.
ఈ పూజలో ఉపయోగించే 21 పత్రములను గుర్తించలేక కొందరు, వాటిని సంగ్రహించలేక కొందరు ఆ రోజు అంగడిలో లభించే పత్రాలతో, అక్షతలతో పూజా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పత్రాల వివరణ, వాటి చిత్రపటములు మరియు వాటి విశేష ప్రాధాన్యత హరి ఓం మరియు ఋషిపీఠం పాఠకులకు ప్రత్యేకం.
ఈ 21 పత్రాలు వేరు వేరు గ్రంధాలలో వేరువేరుగా ప్రస్తావించ బడుట చేత వ్యావహారిక గ్రంథాల్లోని పత్రాలతో పాటు ఇతరత్రా లభ్యమైన పత్రముల వివరణకూడా ఇవ్వబడినది.
వ్యావహారిక గ్రంథాలలోని పత్రపూజకు ఉపయోగించే 21 పత్రాలు-
- మాచీపత్రం,
- బృహతీ పత్రం,
- బిల్వపత్రం,
- దూర్వా యుగ్మం,
- దత్తూర పత్రం,
- బదరీ పత్రం,
- అపామార్గ పత్రం,
- తులసీ పత్రం,
- చూత పత్రం,
- కరవీర పత్రం,
- విష్ణుక్రాస్త పత్రం,
- దాడిమీ పత్రం,
- దేవదారు పత్రం,
- మరువక పత్రం,
- సింధువార పత్రం,
- జాజీపత్రం,
- గండలీ పత్రం,
- శమీపత్రం,
- అశ్వత్ధ పత్రం,
- అర్జున పత్రం,
- అర్కపత్రం.
భవిష్య పురాణోక్త వినాయక వ్రతంలో గణాధిప నామమున భృంగరాజ పత్రంతోను, సుముఖ నామమున మాలతీ పత్రంతోను, వినాయక నామమున కేతకీ పత్రంతోను, సర్వేశ్వర నామమున అగస్త్య పత్రంతోను పూజించే విధానం చెప్పబడింది.