
కనకదుర్గమ్మతల్లి వైభవం | Glory Of KanakaDurgamma
Glory Of KanakaDurgamma సర్వదేవతానిలయమైన ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు సర్వతీర్థాత్మకయై కృష్ణానది వింజామర పట్టుచున్నది.
నవదుర్గలలో బ్రహ్మచారిణియైన దుర్గరూపాన్నే ఉపాసకులు ఉపాసిస్తారు. కాశీరామేశ్వరయాత్రచేయు ఉత్తరదేశ తీర్థయాత్రికులు తమ తిరుగుప్రయాణంలో తప్పక దర్శించే దివ్యక్షేత్రము కనకదుర్గాలయము. సోదెచెప్పు స్త్రీలు కంచికామాక్షి, మధుర మీనాక్షి, కాశీవిశాలాక్షి అమ్మవార్లతోపాటు బెజవాడ కనక దుర్గమ్మను తప్పక స్మరిస్తారు.
సింహవాహనయై ఎనిమిది చేతులలో అయుధములను ధరించి భీకరంగాకానవచ్చే యీ అమ్మవారిని శాంతింపజేయడానికి ఆది శంకరాచార్యులవారు శ్రీచక్రమును మూలవిరాట్టు వామపార్శ్వ మున ప్రతిష్టించినట్లు చెప్పబడుతోంది.
అమ్మవారికి ఎడమప్రక్కన గణపతి విగ్రహము కలదు.
శ్లో: తస్యాఃదర్శనమాత్రేణ పలాయంతే2 తిపాతకాః
ఇంద్రకీలస్థ దుర్గాంబాం, స్తుత్వాతాం జగదంబికాం!!
అని పద్మబ్రహ్మాండ పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇంద్ర కీలాద్రిపై వెలసిన దుర్గాదేవిని దర్శించి, స్తుతిస్తే సర్వపాపాలు పారి పోతాయిట. ఆదిశంకరులు, విద్యారణ్యులు దుర్గాస్తోత్రాలు రచించారు.