
Story of Ashapura Mata – ఆశాపూరమాత మహాశక్తి రూపాలలో ఒకటి. పేరుకు తగ్గట్టు అమ్మవారు నమ్మి కొలిచిన భక్తులందరి ఆశలనీ నెరవేరుస్తుంది. ఈమెకు ఏడు జతల కన్నులు ఉంటాయి. అసుర సంహారానికై అవతరించిన ఆదిశక్తి రూపాలలో ఈమె ఒకరు. కొన్ని ప్రాంతాలలో ఈమెను అన్నపూర్ణాదేవి అంశగా కూడా కొలుస్తారు. కచ్ ప్రాంతం లోని రాజపుత్ర వంశాలకూ, అక్కడి ప్రజలకూ ఈమె కులదేవత. జడేజా రాజా వంశం వారికి, సింధి వారికి కూడా ఈమె కులదేవత. గుజరాత్ లోని జూనాఘడ్ దేవచందని పరివార్ వారు,చౌహానులు,బ్రహ్మ క్షత్రియులు,వైశ్యులు ఇలా ఎంతో మంది ఆశాపూర మాతను కులదైవంగా భావిస్తారు. గుజరాత్ ప్రాంతం లో ఈమె ఆలయాలు ఉంటాయి.
ఆశాపూర మాత ప్రధానాలయం కచ్ ప్రాంతం లోని మతానో మధ్ లో ఉంది. ఈమె ఆలయాలు రాజస్థాన్ లోనూ, బొంబాయి లోనూ ఉత్తర భారత దేశం లో పలు చోట్ల ఉన్నాయి. గుజరాత్ లోని బర్డా కొండలలో మహాశక్తి ఆదేశం మేరకు ఒక అసురుని చంపి ఆశాపూర మాత అక్కడే కొలువై ఉందని స్థలపురాణం. బెంగళూరు లో బన్నెర్ఘట్ట జాతీయ పార్కు దగ్గర ఆశాపూర మాత ఆలయం ఉంది.