
వివాహానికి వచ్చి ఆశీర్వదించే దేవతలు ఎవరో మీకు తెలుసా ? | Gods Blessing for Marriage in Telugu
శాస్త్రోక్తంగా జరుగు వివాహానికి వచ్చి ఆశీర్వదించే దేవతలు
కళ్యాణం! ఈ పదంలో ఎంత కమ్మదనం ఉంది? ప్రతి మనిషి జీవితంలో జరిగే ఈ వేడుక జీవితంలో మరచి పోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోతుంది. ఈ అద్భుత క్షణం ఒక అసాధారణమైన అనుభూతి. ఈ కళ్యాణ ఘడియ తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా కుటుంబంలోను, అటు సంఘంలోనూ కూడా ఒక గుర్తింపును కలుగజేసేది వివాహమే. ఎన్నో సుఖాలు, కష్ఠాలు, ఆనందాలు, అనుభూతులు వీటన్నింటిని దంపతులు ఒకరినోకరు సమానంగా పంచుకుని జీవన గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణం వెనుక పరమార్ధం. ఇందులో చదివే ప్రతి వేద మంత్రాక్షరంలో ఉన్న అర్థమూ ఇదే!
వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగే పెళ్ళి ప్రధమంగా గణపతి పూజతో ప్రారంభమౌతుంది అనగా గణపతి మొదటగా వస్తాడు.శ్రీ మహావిష్ణువు సతీసమేతంగా పెళ్ళి మండపానికి వస్తునాడనే సమాచారాన్ని గరుడు దేవతలందరికీ తెలియజేస్తాడు. స్వామికి స్వాగతం పలికేందుకు అష్ఠదిక్పాలకులు (ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు), వివాహవేదిక వద్దకు చేరుకుంటారు. వీరితోపాటుగా వైకుంఠ-కైలాస వాసులు మరియు వశిష్ఠ, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, కశ్యప, జమదగ్ని మొదలగు సప్తమహర్షులు వస్తారు. తరువాత లక్ష్మీదేవితో సహా శ్రీ మహా విష్ణువు వచ్చి సర్వ వివాహ ధర్మాన్నీ గమనించి నూతన దంపతులను ఆశిర్వదిస్తారు.