
గోపద్మవ్రత కథ | The story of Gopadmvrata
చాతుర్మాస్య దీక్షలో గోపద్మవ్రతం గురించి మూడు పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి.
ఒకసారి కైలాసంలో శివునిచేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి- చేయి మెత్తగా, మృదువుగా ఉండటానికి కారణం అడిగింది.
పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు. అందుకే ‘ఎముక లేని చెయ్యి’ అని దానం చేసేవారిని వర్ణిస్తారు.
పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. మారువేషంతో భూలోకానికి వెళ్లింది. నారేళ్ళనాచి అనే పేరు గల గర్భిణికి చేయూతనిచ్చి, సేవచేసి, 11 రోజుల తరువాత సకలైశ్వర్యాలు కలగజేసి, చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది.
అయిదేళ్ళ తరువాత అమ్మకు నారేళ్ళనాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్ళనాచి గోపద్మవ్రత ఉద్యాపన చేసుకొంటోంది.
పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచి నీళ్ళడిగింది. నారేళ్ళనాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తనవారితో చెప్పింది.
అవమానపడిన పార్వతి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది. అది సాధ్యపడదన్నాడు శివుడు.
విష్ణువూ తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ళనాచికి తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి, క్షమించమని కోరింది.
పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు.
ఇదే విధంగా ఒక రాజు సంతానం లేని కారణంగా చెరువులు, బావులు తవ్వించడం, బాటలు వేయించడం, బాటల పక్క చెట్లు నాటించడం చేసి తన రెండో భార్యకు అయిదుగురు సంతానాన్ని పొంది, తన మొదటి భార్యలో గల ఈర్ష్య వల్ల రెండో భార్య గోపద్మ వ్రతానికి భంగం కలగకుండా చేశాడు.
మరో కథలో యముడు గోపద్మ వ్రతం చేయనివారి వెన్నెముక చర్మాన్ని తెచ్చి జయభేరి మోగించాలని తన భటులను కోరాడట.
తన చెల్లెలు ఈ వ్రతాన్ని చేయలేదని తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే సుభద్ర వద్దకు వెళ్ళి అయిదేళ్ళ వ్రతాన్ని ఒకేరోజు జరిపించాడట.
దాంతో యమభటులకు జయభేరిని మోగించడానికి చర్మం లభించలేదట. తూర్పు దిక్కుకు తలపెట్టి పడుకొన్న ఓ జీవి వెన్నెముక చర్మాన్నైనా తెచ్చి జయభేరి మోగించాలన్నాడట యముడు.
అప్పుడు ఓ దున్నపోతు అలా నిద్రిస్తుండటం చూసి దాని చర్మాన్ని తెచ్చి డోలు వాయించారని కథనం.