కోరికలు తీర్చే కొండగట్టు హనుమాన్ ? | Hanuman Fillfulls Desire in Telugu.

0
1937

Hanuman Fillfulls Desire.

Hanuman .
Hanuman Fillfulls Desire.

కొండగట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్‌ జిల్లాకేంద్రం నుంచి 35 కి.మీ.ల దూరంలో ఉంది. వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కి.మీల దూరంలో ఉంది. ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. రోగగ్రస్థులు, సంతాన హీనులు అంజన్న సన్నిధిలో 41 రోజులు గడిపితే బాగవుతారని భక్తుల విశ్వాసం.

క్షేత్రచరిత్ర/స్థలపురాణం: దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. వెతికి వేసారిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయస్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికికి అవధుల్లేకుండాపోయాయి. భక్తిభావంతో కోరంద ముళ్లపొదలను తొలగించి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. నారసింహ వక్త్రంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్యభాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆధారాలున్నాయి. శ్రీరాముడు సీతకోసం లంకకు వెళ్లే సమయంలో ల‌క్ష్మ‌ణుడు మూర్ఛిల్ల‌గా  ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్కరాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు పురాణగాథను చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారిపక్కన సీతాదేవి రోదించిన‌ట్టు చెప్పే కన్నీటిగుంతలు భక్తులకు దర్శనమిస్తాయి.

ఆలయంలో నిర్వహించే ప్రధాన పర్వదినాలు..

* ఏటా చైత్ర పౌర్ణమిరోజు హనుమాన్‌ చిన్నజయంతి, వైశాఖ బహుళదశమినాడు వచ్చే పెద్ద హనుమాన్‌ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజ‌నేయ‌స్వామి దీక్ష తీసుకున్న ల‌క్ష‌లాది మంది భ‌క్తులు స్వామిని ద‌ర్శించుకుని  ముడుపులు కట్టివెళ్తుంటారు. పెద్ద హనుమాన్‌ జయంతి సందర్భంగా మూడ్రోజులపాటు హోమం నిర్వహిస్తారు.

* ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది.

* చైత్ర శుద్ధనవమి రోజు శ్రీరావమనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది.

* శ్రావణమాసంలో సప్తాహ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

* ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నెల రోజులపాటు తిరుప్పావై, గోదారంగనాయకుల కల్యాణం జరుగుతుంది.

* వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం గావిస్తారు.

* దీపావళి పర్వదినం సందర్భంగా సహస్ర దీపాలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతారు.

* ఆలయ పవిత్రతతోపాటు లోక కల్యాణం నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

* ప్రపంచ శాంతి. జగత్‌కల్యాణ సిద్ధికి ఏటా మూడు రోజులపాటు శ్రీ సుదర్శన మహాయాగం జరుపుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here