
Health Tips in Telugu
శృంగుడు అనేవాడు తన జీవితకాలం ఎక్కువగా అడవుల్లోనే గడిపాడు. దాంతో అతనికి నాగరిక జీవనం అంటే ఏమిటో తెలియదు.
ఒకసారి ముకేశుడు అనేవాడు ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన అతనికి అక్కడంతా చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటీ జీవితం? ఎలా ఉండగలుగుతున్నాడు? అని.
అన్నిటికీ ప్రకృతి మీద ఆధారపడేదే. చీకటి పడిందంటే చాలు ఏ దీపాలు పెట్టినా వెలుతురుగా ఉండకపోవటం మరీ కష్టంగా అనిపించింది. అందుకని ఒకసారి తనతో రమ్మన్నాడు ముకేశుడు. సరేనని బయల్దేరాడు శృంగుడు.
వెళ్లిన చోట ప్రతీదీ ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నట్టుగా అనిపించింది శృంగునికి. ఏది చేయాలన్నా మరో యంత్రం మీద ఆధారపడటమే.
స్వయంగా కష్టం అంటే ఏమిటో తెలియదు వారికి. అందువల్ల శారీరక శ్రమ తెలియదు. దాంతో ఎన్నో ఇబ్బందులు ఆరోగ్యపరంగా కూడా ఎదుర్కోవలసి వస్తోంది.
పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకు ఎంతో శ్రమ పడటం శృంగుడికి అలవాటు. అట్లా అయితే ఆరోగ్యం కూడా ఎంతో చక్కగా ఉండేది. అక్కడ అందరి పరిస్థితి చూసి తరువాత అదే అన్నాడు శృంగుడు. మనిషి కూర్చుని తినడం వల్ల అనారోగ్యమే ఎక్కువ.
కాబట్టి తగిన శ్రమ చేయండి. అప్పుడు ఇతరుల మీద, యంత్రాల మీద ఆధారపడివలసిన పని ఉండదు. దానివల్ల ఆరోగ్యం కూడా ఎంతో గొప్పగా ఉంటుందంటూ తన ఆరోగ్య రహస్యాన్ని చెప్పాడు.
అప్పుడు తనతో అడవికి వచ్చిన ముకేశుడు అక్కడ వుండి కూడా అసలు విషయం తెలుసుకోలేక పోయాడు. శృంగుడు రావడం మంచిదే అయింది. తమకు తెలియని విషయాలు చెప్పి ఎంతో మేలు చేశాడు అనుకున్నాడు ముకేశుడు.
నేను చెప్పింది విని ఊరుకోకండి. మీరూ ఆచరించి చూడండి. అప్పుడే నేను ఇక్కడికి వచ్చినందుకు ఫలితం దక్కుతుంది అని చెప్పి మళ్లీ అడవికి బయల్దేరాడు శృంగుడు.
-పి.జ్యోతి