
ayurveda health tips / care
కొత్త నీరు, చల్లని వాతావరణంతో సూక్ష్మక్రిములు వృద్ధి చెంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొద్దిపాటి జాగ్రత్తలు, ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో ఆయుర్వేద మందులను తయారు చేసుకొని వినియోగించడం ద్వారా రోగాలకు దూరంగా ఉండవచ్చని డాక్టర్ నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల (విజయవాడ)లోని కాయచికిత్స విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.రత్నప్రియదర్శిని సూచించారు.
కలుషిత నీరు తాగితే జలుబు, దగ్గు, నిమ్ము చేయడం, ఉబ్బసం వచ్చే అవకాశం ఉంది.
పావు స్పూను దాల్చిన చెక్కపొడి, స్పూను తులసి ఆకు రసం, చిటికెడు మిరియాల పొడిని తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు లేదా అరస్పూను కరక్కాయ, తానికాయ చూర్ణం, చిటికెడు మిరియాల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం ద్వారా తగ్గుతుంది.
* కామెర్లు, వాంతులు, విరేచనాలు, బంక విరేచనాలు, కడుపునొప్పి, టైఫాయిడ్, జ్వరం వంటి రోగాల నివారణకు చేదుగా ఉండే కాకర, మెంతులు, పసుపు వంటివి నిత్యం తీసుకునే ఆహారంలో తరచుగా ఉండేలా చూసుకోవాలి. ఒక స్పూను అల్లం రసంలో సైంధవ లవణం కలుపుకొని ప్రతిరోజు పరగడుపున తీసుకోవాలి.
* దోమలు కుడితే విషజ్వరాలు ప్రబలుతాయి. వేపాకులు, కర్పూరం, నేలవేములను ఎండబెట్టి ప్రతిరోజు ధూపం వేస్తే దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు.
* ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే శొంఠి, ధనియాలు, సోంపు, జీలకర్ర నీటిలో వేసుకొని వేడి చేసి 100 మిల్లీలీటర్ల చొప్పున రోజుకు రెండు సార్లు తాగాలి.
* తామర, సోబి నివారణకు గానుగ ఆకులు, వేపాకు బెరడు, మార్కుండి ఆకు, కసింతాకులను మెత్తగా నూరి పసుపు కలిపి రాస్తే తగ్గుతాయి.
* కాళ్లు పాస్తే స్వేత మల్హం, సింధూరాది లేపం రాసుకోవాలి.
* వానలో తడవకుండా జాగ్రత్త పడాలి.
* దుప్పట్లు, తువ్వాళ్లు వారానికి ఒకసారి వేడి నీటిలో నానబెట్టి ఉతికి ఎండ తగిలేలా ఆరబెట్టాలి.