కుంభం

ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం1,2,3,4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

Sri Subhakrit Nama Samvatsara Kumbha Rasi Phalalu

ఈ రాశివారికి ది. 14-4-2022 వరకు గురుడు జన్మరాశిలో “లోహమూర్తి”, తదుపరి రెండవ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చెయ్యనున్నారు. శనైశ్చరుడు ఈ సంవత్సరం మొత్తం 12వ స్థానంలో సంచారం చెయ్యనున్నారు. రాహు-కేతువులు ది. 15-4-2022 వరకు 4-10 స్థానాలలో, తదుపరి 3-9 స్థానాలలో లోహమూర్తులుగా సంచారం చెయ్యనున్నారు.

గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా మెరుగయిన ఫలితాలు గోచరిస్తున్నవి. ఏప్రిల్ దాటిన పిదప గురుబలము వస్తున్నది. “అర్ధాష్టమ రాహు” దోషము తొలగిపోతున్నది. కావున “ఏలిననాటి శని” బాధ ఉన్ననూ ఏప్రిల్ తదుపరి చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నవి.

ది. 14-4-2022 వరకు “జన్మ గురు”, “అర్ధాష్టమ రాహు” సంచారము వలన “రాజకోపోయశోహాని ఉద్యోగస్య విరోధకమ్” అను శాస్త్ర వచనం ప్రకారం, కుటుంబ సమస్యలు, ఉద్యోగమున ఒత్తిడి అధికము, నీలాపనిందలు ఎదుర్కొనుట, బుద్ధి చాంచల్యము అధికము. లగ్జరీ వస్తువులకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉన్నతాధికారుల వలన ఇబ్బందులు, ప్రభుత్వ పరంగా జరగవలసిన పనులలో జాప్యం, ఉద్యోగమార్పు, దాంపత్య జీవనములో చిన్న చిన్న సమస్యలు, కొంత మానసిక అశాంతితో నడుచును.

ది. 14-4-2022 తదుపరి గురుబలము అధికము. “మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమః” అను శాస్త్రవచనం ప్రకారం ఆర్ధికంగా ఉన్నత పరిస్థితి ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు మెరుగును. వివాహాది శుభకార్యములు జరుగును. సంతానము కలుగును. నూతన భూ-గృహ లాభము ఉండును. నూతన వాహనములు, వస్తు-వస్త్రములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యంగా చాలాకాలంగా లోపించిన మానశిక ప్రశాంతత ఉండును. బంగారము కొంటారు. పదవులు లభించును. ఉద్యోగమున ప్రమోషన్లు, ఆశించిన స్థానమునకు బదిలీలు జరుగును. వ్యాపారము అభివృద్ధిలో ఉండును విద్యార్థినీ విద్యార్థులకు మంచి సమయము.

‘అర్ధాష్టమ రాహు’ దోషము తొలగిపోయినది. కావున పిశాచ బాధ, నరదృష్టి వలన బాధ నుండి ఉపశమనం పొందుతారు. అయితే తృతీయ రాహు సంచారము వలన సోదరులతో కలహము, ధైర్యం సన్నిగిల్లుట జరుగును.

“ఏలిననాటి శని” బాధ వలన “మానహానిర్మనక్లేశం కృషిర్భోజన పల్పసః” అను శాస్త్రవచనం ప్రకారం, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయుట, బద్దకము అధికము, ధన వ్యయము, మోసపోవుట, స్త్రీ వలన మానశిక అశాంతి, భోజన సౌఖ్యము తక్కువగా వుండును. ప్రయాణములు అధికంగా చేస్తారు.

మొత్తం మీద “ఏలిననాటి శని” మినహా దోషములు తక్కువ. కావున క్రింది సంకల్పం ప్రకారం ప్రతి శనివారం నువ్వులు, నూనె, ఉప్పు దానమీయుట, అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన విశేషించి శుభఫలితాలను ప్రసాదించును.

సంకల్పము : మమ చన్దలగ్న వశాత్ వ్యయ స్థానస్థిత శనిగ్రహదోష పరిహారార్ధం.