Mesha Rasi Ugadi Phalalu in Telugu
మేషరాశి వారికి ది. 14-4-2022 వరకు గురుడు పదకొండవ యింట రజతమూర్తి తదుపరి పన్నెండవ స్థానమందు రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు. శనైశ్చరుడు ఈ సంవత్సరం మొత్తం పదవ యింట సంచారం చేస్తారు. రాహు-కేతువులు ది. 15-4-2022 వరకు 2-8వ యింట, తదుపరి 1-7వ యింట సువర్ణమూర్తులుగా సంచారం చేయనున్నాను.
ఈ రాశి వారికి ది. 14-4-2022 వరకు గురు బలమున్నది. “యశోవృద్ధిర్బలం తేజః సర్వత్ర విజయస్సుఖమ్” అను శాస్త్రవచనం ప్రకారం, ఏప్రిల్ వరకు ఆర్ధిక పరిస్థితులు చాలా ఉన్నతంగా ఉన్నాయి. సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. భూములకొనుగోలు, నూతన గృహాల కొనుగోలు, బంగారము వంటివి కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలు జరుగుతాయి, సంతానము కలుగును.
దూరప్రాంత విద్య, ఉన్నత విద్యకు అవకాశములు ఉన్నవి. విద్యార్ధులకు మంచి సమయం. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు కలుగుతాయి. ఉన్నత పదవులు, అధికారం లభించును. శతృనాశనము కలుగును. ధార్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. చాలాకాలంగా రావలసిన మొండి బకాయిలు చేతికందుతాయి. విదేశీయానమునకు పరిస్థితులు అను కూలంగా ఉన్నాయి. మిత్రులు, సన్నిహితులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు.
ది. 14-4-2022 తదుపరి గురుని 12వ స్థాన సంచారము వలన “శుభమూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం” అను శాస్త్రవచనం ప్రకారం స్థానచలనము, ప్రయాణములు అధికమగుట, శుభకార్యక్రమాలకు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగ మార్పు, ఋణములు తీసుకొనుట జరుగును.
శనైశ్చరుని సంచారము వలన “వ్యాకులం శోక సంతాపః పాపముద్యోగ విఘ్నకమ్” అను శాస్త్రవచనం ప్రకారం పాప కృత్యములు చేయుట, ఉద్యోగ సమస్యలు, పని ఒత్తిడి అధికంగా ఉండి, ప్రతిఫలము తక్కువగా ఉండుట, ఎప్పుడూ ఏదో ఒక సమస్య గురించి దీర్ఘాలోచన, మొదలు పెట్టిన కార్యములలో ఆటంకాలు అధికంగా రావడం జరుగును. మనసుకు నచ్చని పనులు చేయుట జరుగును.
ది. 15-4-2022 వరకు 2-8 స్థానాలలో రాహు సంచారము “సౌభాగ్య భాగ్యమారోగ్యం అర్ధలాభం యశస్కరం” అను శాస్త్ర వచనం ప్రకారం వివాహాది శుభ కార్యములు, ఆర్థికాభివృద్ధి, సంతానము, సమాజమున మంచిపేరు ప్రఖ్యాతలు కలుగును. ది. 15-4-2022 తదుపరి రాహువు జన్మరాశి సంచారము వలన “ధారాపుత్ర విరోధశ్చ స్వజనే కలహస్థథా” అను శాస్త్రవచనం ప్రకారం కుటుంబానికి దూరంగా ఉండుట, అధిక
ధనవ్యయము, ప్రయాణములు కలుగును. చర్మ సంబంధిత వ్యాధులు, వెన్నుముకకు ఇబ్బంది కలుగును. జన్మరాశిలో రాహు సంచారము వలన మోసపోవుట, అప్పులు ఇచ్చి, వారితో విరోధము తెచ్చుకొనుట జరుగును.
మొత్తం మీద మేషరాశి వారికి ది. 14-4-2022 వరకు శుభఫలితాలు, తదుపరి కొంత వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నవి.
ఏప్రిల్ దాటిన తరువాత గురుబలము పొందటానికి క్రింది సంకల్పంతో గురువారము శనగలు దానమీయవలెను.
గురు గ్రహ దాన సంకల్పం
మమ జన్మరాశి వశాత్ వ్యయ గురు దోష పరిహారార్ధం. రాహు జన్మరాశి సంచారము వలన కలిగే చెడుఫలితాల నుండి బయట పడుటకు “సర్పసూక్తం”తో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము అలాగే క్రింది సంకల్పముతో
ఆదివారం మినుములు దానమీయుట మంచిది.
రాహు గ్రహదాన సంకల్పము
మమ జన్మరాశి స్థిత రాహుగ్రహ దోష పరిహారార్ధం.