కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి 1,2,3,4 పాదాలు, ఆశ్లేష 1,2,3,4 పాదాలు

Sri Subhakrit Nama Samvatsara Karkataka Rasi Phalalu

ఈ రాశి వారికి ది. 14-4-2022 వరకు గురుడు అష్టమస్థానమందు సువర్ణ మూర్తి, తదుపరి తొమ్మిదవ యింట రజతమూర్తిగా సంచారం చెయ్యనున్నారు. శనైశ్చరుడు ఈ వత్సరం మొత్తం ఏడవ యింట సంచారం చేస్తారు. రాహు-కేతువులు ది. 15-4-2022 వరకు 11-5వ యింట, తదుపరి 10-4వ యింట తామ్రమూర్తులుగా సంచారం చెయ్యనున్నారు.

ఈ రాశి వారికి ది. 14-4-2022 వరకు గురుబలము లేదు. అష్టమ గురుని సంచారము వలన “చోరాగ్ని నృపభీతిశ్చ గాత్రగాంభీర్య నాశనం” అను శాస్త్రవచనం ప్రకారం అగ్ని వలన గానీ, చోరుల వలన గానీ, ప్రభుత్వ ఉన్నతాధికారుల వలన గానీ ఇబ్బందులు వచ్చును. మానశిక భయము అధికము, కోపము అధికము, వివాహాది శుభ కార్యక్రమములు వాయిదా పడును. దీర్ఘకాల అనారోగ్య సమస్యలు, బరువు పెరుగుట జరుగును. పనులలో జాప్యము, ఉద్యోగమున ఒత్తిడి అధికము.

ది. 14-4-2022 దాటిన పిదప గురుబలము అధికము భాగ్యస్థానమందు గురుని సంచారము వలన “అర్ధంచ స్వకులాచారః గృహే నిత్యోత్సవ శుభమ్” అను శాస్త్ర వచనం ప్రకారం ఉన్న ఉద్యోగ ప్రాప్తి, అధికారము, నూతన భూ-గృహలాభము కలుగును. నూతన వాహనములు కొనుగోలు చేస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభము కలుగును. ఉద్యోగమున ఆశించిన ప్రాంతమునకు బదిలీలు జరుగును. వివాహాది శుభ కార్యములు జరుగును. సంతానము కలుగును. వ్యాపార విస్తరణ, వ్యాపారములో లాభము కలుగును. కులాచారాలను పాటిస్తారు. బంధువులు, మిత్రులతో విందు విహారయాత్రలలో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు చేస్తారు.

శనైశ్చరుని సప్తమ స్థాన సంచారము వలన “వ్యాధిపీడాం ప్రవాసంచ అంతఃక్లేశం మహద్భయమ్” అను శాస్త్రవచనం ప్రకారం దూరప్రాంత సంచారము, ఉద్యోగ రీత్యా విదేశీయానమునకు అవకాశము. ధనము అధికముగా ఖర్చు పెట్టుట, కుటుంబమునకు దూరంగా కాలాన్ని గడుపుట జరుగును. దాంపత్య జీవనములో కొన్ని మనస్పర్ధలు కలుగును. వ్యాపారమున మార్పులు, సమాజంలో పలుకుబడి పెరుగును.

ది. 15-20 వరకు లాభస్థానమందు రాహు సంచారం వలన “గోవాజిగజి సంఘానాం క్షీరాన్నాది సుభోజనం” అను శాస్త్రవచనం ప్రకారం పశులాభము, భోజన సౌఖ్యము, నూతన వస్త్ర, వస్తు లాభము, సుగంధ లాభము కలుగును. విదేశీయానము, ఉద్యోగమున జీతము పెరుగుట, ఆకస్మిక ధనలాభము కలుగును. శతృ నాశనము, చాలాకాలంగా రావలసిన ధనము వచ్చును. లాటరీలు, జూదము, స్టాక్ మార్కెట్లలో గతంలో కోల్పోయిన ధనము తిరిగి సంపాదించు కుంటారు. ది. 15-4-2022 తదుపరి రాహు-కేతువుల 10-4వ యింట సంచారము వలన ఉద్యోగమున మార్పు “మనస్సౌఖ్యం సదానందం అభీష్ట సుఖ భోజనం” అను శాస్త్రవచనం ప్రకారం మానశిక ప్రశాంతత అధికము. మనోల్లాసము, భోజన సౌఖ్యము, ఎల్లప్పుడూ ఆనందముగా ఉండుట, శరీరబలం, కష్టములు తొలగిపోవుట, విదేశీయానము జరుగును. పనిచేసే రంగమున మార్పు వృత్తి ఉద్యోగములలో ఊహించని మార్పులు వచ్చును.

మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరమున ఏప్రిల్ తదుపరి బాగుగా ఉన్న కాలము. ఏప్రిల్ లోపు క్రింది సంకల్పం ప్రకారము గురువారం శనగలు దానమీయవలెను. శనివారము రావిచెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయవలెను.

సంకల్పం : మమ చన్ద్ర లగ్న వశాత్ “అష్టమ గురు” దోష పరిహారార్ధం.