మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం1,2,3,4 పాదాలు, ధనిష్ట 1,2 పాదాలు

Sri Subhakrit Nama Samvatsara Makara Rasi Phalalu

ఈ రాశివారికి ది. 14-4-2022 వరకు గురుడు రెండవ యింట రజతమూర్తి, తదుపరి మూడవ స్థానమందు లోహమూర్తిగా సంచారం చెయ్యనున్నారు. శనైశ్చరుడు ఈ సంవత్సరం మొత్తం జన్మరాశిలో సంచారం చెయ్యనున్నారు. రాహు-కేతువులు ది. 15-4-2022 వరకు 5-11వ స్థానాలలో, తదుపరి 4-10వ స్థానాలలో రజత మూర్తులుగా సంచారం చెయ్యనున్నారు.

ఈ రాశికి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే మెరుగయిన ఫలితాలు కనబడుతున్నాయి. ఏప్రిల్ వరకు గురుబలమున్నది. ఏప్రిల్ తదుపరి గురుబలము తగ్గును. “అర్ధాష్టమ రాహు” దోషము పట్టును. “ఏలిననాటి శని” అనుభవిస్తూ ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ఏప్రిల్ ముందు అనగా పూర్వార్ధము బాగున్నది. కావున ముఖ్యమయిన పనులన్నీ ఏప్రిల్ లోపు ముగించుకొనుట ఉత్తమము.

ది. 14-4-2022 వరకు రెండవ స్థానమందు గురుని సంచారము వలన “మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమః” అను శాస్త్ర వచనం ప్రకారం వివాహాది శుభకార్యములు జరుగును. సంతానము కలుగును. నూతన ఉద్యోగ ప్రాప్తి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును. ఉద్యోగమున ప్రమోషను, అనుకూల ప్రాంతమునకు బదిలీలు జరుగును. వ్యాపారాభివృద్ధి, ధనధాన్యాధివృద్ధి జరుగును. భూ-గృహ లాభము, వాహన లాభము కలుగును. ధార్మిక కార్యక్రమములకు ధనాన్ని ఖర్చు చేయుదురు. తీర్థయాత్రలు చేస్తారు. విందు విహార యాత్రలలో పాల్గొంటారు.

ది. 14-4-2022 తదుపరి తృతీయ గురుని సంచారము వలన “అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనమ్” అను శాస్త్రవచనం ప్రకారం ఉద్యోగమున ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు బాగాలేకుండుట బంధు మిత్రులతో మాట పట్టింపులు, ధనము అధికముగా ఖర్చు చేయుట, మానశిక ప్రశాంతత లోపించుట, అనవసరపు తగాదాలు అధికము. ప్రయాణములు వృధాగా చేస్తుండుట, నీలాపనిందలు, ప్రతి చిన్న దానికీ ప్రక్కవారిపై అధారపడుట, దేశాంతర వాసము, కొండప్రాంత సంచారము, బుద్ధి చాంచల్యము ఉండును.

ది. 15-4-2022 వరకు “రాహు పంచమ స్థాన సంచారం” సంచారం వలన “పుత్రవైరం నృపాత్పూజ్యం కాలాతిక్రమ భోజనం” అను శాస్త్రవచనము ప్రకారం సంతానముతో విరోధము, రాజ సన్మానము, కాలాన్ని అతిక్రమించి భోజనము చేయుట. నాస్తికత్వము ప్రబలుట జరుగును. మోసపోవు అవకాశములు ఎక్కువ. జూదము, స్పెక్యులేషన్ వంటి వాటిలో ధనము కోల్పోవు ప్రమాదమున్నది. పాపపు కర్మలు చేస్తారు. శుభకార్యములు వాయిదా పడును.

ది. 15-4-2022 తదుపరి “అర్ధాష్టమ రాహు” సంచారం వలన “చిత్త భ్రంశం వాతరోగం స్త్రీమూలశ్చ ధనక్షయమ్” అను శాస్త్రవచనం ప్రకారం, ఉద్యోగమున ఒత్తిడి అధికము. బుద్ధి చాంచల్యము అధికము. స్త్రీ వలన జీవితంలో కొంత నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఉన్నతాధికారుల ఒత్తిడి అధికము. దూరప్రాంత సంచారము, విదేశీయానము చేయుదురు. స్పెక్యులేషన్ వలన జూదములో ధనాన్ని నష్టపోతారు.

“ఏలిననాటి శని” వలన బద్ధకము అధికము. ప్రతీ పనినీ వాయిదా వేస్తారు. “తేజోహనిర్మాతిభ్రంశో మనఃపీడా భయం తథా” అను శాస్త్రవచనం ప్రకారం తగాదాలు అధికము, నీలాపనిందలు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అధికము, ఆర్ధిక ఇబ్బందులు కలుగును.

మొత్తం మీద ఈ సంవత్సరం కొంత ప్రతికూలము. “మన్యుపాశుపత హోమము” ద్వారా మనఃశాంతి కలుగును. “సర్ప సూక్త”ముతో అభిషేకము సుబ్రహ్మణ్య స్వామికి చేయుట ద్వారా అన్ని సమస్యలనుండి విముక్తి కలుగును.