మిధునం

మృగశిర 3,4 పాదాలు, ఆర్ధ్ర 1,2,3,4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు

Sri Subhakrit Nama Samvatsaram Mithuna Rasi Phalalu

ఈ రాశి వారికి ది. 14-4-2022 వరకు గురుడు తొమ్మిదవ యింట లోహమూర్తి, తదుపరి పదవ యింట తామ్రమూర్తిగా సంచారం చేయనున్నారు. శనైశ్చరుడు ఈ సంవత్సరం మొత్తం ఎనిమిదవ యింట సంచారం చేయనున్నారు. రాహు కేతువులు ది. 15-4-2022 వరకు 12-6వ యింట, తదుపరి 11-5వ యింట లోహమూర్తులుగా సంచరించనున్నారు.

ఈ రాశి వారికి ది. 14-4-2022 వరకు గురుబలమున్నది. తొమ్మిదవ స్థాన మందు గురుని సంచారము వలన “అర్ధంచస్వకులాచారః గృహలాభస్సు భోజనమ్” అను శాస్త్రవచనం ప్రకారం ఆర్థికాభివృద్ధి కలుగును. ఉద్యోగమున ప్రమోషను, అనుకున్న చోటకు బదిలీ జరుగుట, శుభకార్యములు జరుగుట, సంతానాభివృద్ధి కలుగును. నూతన భూ-గృహ లాభము, నూతన వాహనముల కొనుగోలు, బంగారము కొనుగోలు చేస్తారు. వ్యాపారాభివృద్ధి కలుగును. విద్యార్ధులకు చాలా అనుకూల సమయం దూరవిద్య, విదేశీ ప్రయాణములు అనుకూలము. కులాచారాలను పాటిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు.

ఏప్రిల్ 14 తదుపరి గురుబలము తగ్గుతున్నది. కావున ముఖ్యమయిన పనులన్నీ గురుబలమున్నపుడే పూర్తి చేయుట మంచిది. ఏప్రిల్ 14 తదుపరి గురుని దశమ స్థాన సంచారము వలన “ధాన్యనాశోధనచ్ఛేదం వృధాసంచరణమ్ భయం” అను శాస్త్రవచనం ప్రకారం, ధనవ్యయమధికము, అనవసరమగు ప్రయాణములు అధికంగా చేస్తారు. ఉద్యోగమున ఒత్తిడి అధికము. బంధువులతో మాట పట్టింపులు, బాగా తెలిసున్నవారికి ధన సహాయం చేసి వారితో విరోధము తెచ్చుకొనుట. ఇంటి యందు చిన్న చిన్న మాట పట్టింపులతో అశాంత వాతావరణము ఇవి కలుగును.

రాహు-కేతువులు ది. 15-4-2022 వరకు 12-6వ స్థానాలలో సంచారము వలన “దారిద్ర్యం ధననాశంచ నేత్రపీడా రిపోర్భయమ్” అను శాస్త్రవచనం ప్రకారం స్థాన చలనములు, ధనక్షయము, వెన్నుపాముకు సంబంధించిన ఇబ్బందులు, చర్మము, కంటికి సంబంధించిన వ్యాధులు కలుగును. దొంగల వలన ఇబ్బందులు, పనులలో ఆటంకములు అధికమగును.

ఒక గొప్ప విషయమేమిటంటే గురుబలము తగ్గే సమయానికి రాహు సంచారము అనుకూలముగా మారుతున్నది. ది. 15-4-2022 లగాయితు రాహు-కేతువులు 11-5వ స్థానములలో సంచారము వలన “గోవాజిగజి సంఘానాం క్షీరాన్నాది సుభోజనం” అను శాస్త్రవచనం ప్రకారం పశులాభము, భోజన సౌఖ్యము, నూతన వస్త్ర, వస్తు లాభము, సుగంధ లాభము కలుగును. విదేశీయానము, ఉద్యోగమున జీతము పెరుగుట, ఆకస్మిక ధనలాభము కలుగును. శతృ నాశనము, చాలాకాలంగా రావలసిన ధనము వచ్చును. లాటరీలు, జూదము, స్టాక్ మార్కెట్లలో గతంలో కోల్పోయిన ధనము తిరిగి సంపాదించు

శనైశ్చరుని అష్టమ స్థాన సంచారము వలన “నానాకార్య విరోధశ్చ వ్యాధిపీడా ధనక్షయం” అను శాస్త్ర వచనం ప్రకారం మొదలు పెట్టిన కార్యములలో విఘ్నములు, అనారోగ్యముల వలన ధనవ్యయము కలుగును. ఆకస్మికముగా కొన్ని ప్రయాణములు చేయవలసి వచ్చును. నరముల సమస్యలు అధికము.

మొత్తం మీద ఏప్రిల్ మందు వరకు గురుబలము, ఏప్రిల్ తదుపరి రాహుబలము వలన మిశ్రమ ఫలితాలు ఈ రాశికి ప్రాప్తించనున్నాయి. అయితే గత సంవత్సరము కంటే చాలా మెరుగ్గా ఈ సంవత్సరం వుంటుంది. శనైశ్చరుడు అష్టమ స్థాన సంచారము ఒక్కటే ఇబ్బంది పెట్టును. కావున క్రింది సంకల్పముతో శనివారము నాడు నువ్వులు, ఉప్పు, నూనె దానమీయవలెను.

సంకల్పము : చన్ద్రలగ్న వశాత్ మమ అష్టమ స్థాన స్థిత శని గ్రహ దోష పరిహారార్ధం.