Sri Subhakrit Nama Samvatsara Simha Rasi Phalalu
ఈ రాశివారికి ది. 14-4-2022 వరకు గురుడు ఏడవ యింట తామ్రమూర్తి, తదుపరి ఎనిమిదవ యింట సువర్ణమూర్తిగా సంచారం చెయ్యనున్నారు. శనైశ్చరుడు సంవత్సరం మొత్తం ఆరవ యింట సంచారం చేస్తారు. రాహు-కేతువులు ది. 15-4-2022 వరకు 10-4వ యింట, తదుపరి 9-3వ యింట రజతమూర్తులుగా సంచారం చేయ నున్నారు.
ఈ రాశివారికి ది. 14-4-2022 వరకు గురుబలము ఉన్నది. సప్తమ గురుని సంచారము వలన “రాజదర్శన మారోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం” అను శాస్త్ర వచనం. ప్రకారం, వివాహాది శుభకార్యములు జరుగును. సంతానము కలుగును. ఉద్యోగమున ప్రమోషన్లు, ఆశించిన స్థానముకు బదిలీలు జరుగును. సమాజంలో ఉన్నత స్థాయిలో వున్న వ్యక్తులతో పరిచయము ఏర్పడును. మొదలు పెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. భూ-గృహ-వాహములు కొనుగోలు చేస్తారు. బంగారము, నూతన వస్తు-వస్త్ర ప్రాప్తి కలుగును. ఎప్పటినుండో చేతికి రావలసిన ధనము అందుతుంది. తీర్థయాత్రలు విందు విహారయాత్రలు చేస్తారు.
ది. 14-4-2022 దాటిన పిదప అష్టమ గురుని సంచారము వలన “చోరాగ్ని నృపభీతిశ్చ గాత్రగాంభీర్య నాశనం” అను శాస్త్రవచనం ప్రకారం అగ్ని వలన గానీ, చోరుల వలన గానీ, ప్రభుత్వ ఉన్నతాధికారుల వలన గానీ ఇబ్బందులు వచ్చును. మానశిక భయము అధికము, కోపము అధికము, వివాహాది శుభ కార్యక్రమములు వాయిదా పడును. దీర్ఘకాల అనారోగ్య సమస్యలు, బరువు పెరుగుట జరుగును. పనులలో జాప్యము, ఉద్యోగమున ఒత్తిడి అధికము.
రాహు-కేతువులు ది. 15-4-2022 వరకు పదవ యింట సంచారము వలన “మనస్సౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనమ్” అను శాస్త్రవచనం ప్రకారం మనసు యందు సంతోషం, భోజన సౌఖ్యము, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండుట, శరీర బలము ఉండును, కష్టములు తొలగిపోవుట కలుగును. ఉద్యోగమున మార్పులు, స్థానచలనము, కొండ ప్రాంత సంచారము కలుగును.
ది. 15-4-2022 తదుపరి రాహుకేతువులు 9-3వ యింట సంచారం చేస్తారు.“గోవాజి గజ నాశంచ ధనధాన్యాధి నాశకృత్” అను శాస్త్ర వచనం ప్రకారం భాగ్యమందు రాహువు సంచరించుట వలన ఆర్ధిక నష్టము జరుగును. మొదలుపెట్టిన పనులలో జాప్యము అధికము. ప్రయాణములు అధికంగా చేస్తారు. వంశపారంపర్య ఆస్థిపాస్తులకు ముప్పు. అనువంశికముగా వచ్చు వ్యాధుల వలన ఇబ్బందులు కలుగును.
శనైశ్చరుని సంచారము ఆరవ స్థానంలో శుభఫలితాలు ఇచ్చును. “ధనధాన్యాధి వృద్ధించ బంధు సంతోష వర్ధనం” అను శాస్త్రవచనం ప్రకారం ధనధాన్యాధివృద్ధి, బంధు మిత్రుల కలయిక వలన సంతోషము, నూతన గృహ నిర్మాణము, వివాహాది శుభకార్యములు జరుగుట, సంతోషము మొదలయిన శుభఫలితములు కలిగి విశేష యోగవంతముగా వుండును.
మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలున్నవి. గురు గ్రహ అనుకూలత కోసమై క్రింది సంకల్ప విధానంతో గురువారం శనగలు దానమీయుట మంచిది.
సంకల్పం : మమ చంద్ర లగ్న వశాత్ అష్టమ గురుదోష పరిహారార్ధం రాహుగ్రహ అనుకూలత కోసమై “సర్పసూక్తం”తో సుబ్రహ్మణ్యాభిషేకము చేయుట మంచిది.