తుల

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, 1,2,3,4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు

Sri Subhakrit Nama Samvatsara Tula Rasi Phalalu

ఈ రాశివారికి ది. 14-4-2022 వరకు గురుడు ఐదవ యింట లోహమూర్తి, తదుపరి ఆరవ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరించనున్నారు. శనైశ్చరుడు ఈ సంవత్సరం మొత్తం 4వ యింట సంచారం చెయ్యనున్నారు. రాహు కేతువులు ది. 15-4-2022 వరకు 8-2వ యింట, తదుపరి 7-1వ స్థానాలలో లోహమూర్తులుగా సంచారం చెయ్య నున్నారు.

తులారాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంత మెరుగయిన ఫలితాలు కనబడుతున్నాయి. ఏప్రిల్ నెలలో “అష్టమ రాహు” దోషము తొలగిపోవును. అలాగే ఒక నెలపాటు “అర్ధాష్టమ శని” దోషము తొలగును. ది. 14-4-2022 వరకు గురుబలము సంపూర్ణముగా ఉండును.

ది. 14-4-2022 వరకు గురుబల ప్రభావము వలన “అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితమ్” అను శాస్త్రవచనం ప్రకారం, వివాహాది శుభకార్యములు చేస్తారు. సంతానము కలుగును. ఆర్థికాభివృద్ధి, ఋణబాధలు తగ్గును. పదవులు అలంకరిస్తారు. భూ-గృహములకు కొనుగోలు చేస్తారు. బంగారము, నూతన వస్తు, వస్త్రములను కొనుగోలు చేస్తారు. తీర్థ యాత్రలు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిమ్మల్ని నమ్ముకున్న వారు అందరికీ సరైన మార్గం చూపగలుగుతారు. ఉద్యోగమున ప్రమోషన్లు, ఆశించిన ప్రాంతమునకు బదిలీలు జరుగును. వ్యాపార విస్తరణ, వ్యాపారస్తులకు మంచి సమయం, విద్యార్ధులకు మంచి సమయము. నూతన ఉద్యోగాలు లభిస్తాయి.

ది. 14-4-2022 తదుపరి షష్ఠ గురు సంచారము వలన “ధారాపుత్ర విరోధంచ స్వజనే కలహస్థథా” అను శాస్త్రవచనం ప్రకారం, భార్యా పిల్లలకు దూరంగా కాలాన్ని గడుపుట, సొంత బంధువులు – మిత్రుల చేతిలో మోసపోవుట, ఆర్థిక లావాదేవీల కారణంగా బంధువులతో మాటపట్టింపులు. అగ్ని, దొంగలు వలన బాధ, ఉన్నతాధికారుల వలన సమస్యలు, బంగారము మొదలగు విలువయిన వస్తువులను కుదువ పెట్టుట, ఋణములు తీసుకొనుట, దీర్ఘకానలిక అనారోగ్య సమస్యలతో కొంత ఇబ్బందులు వంటివి జరుగును.

ది. 15-4-2022 వరకు “అష్టమ రాహు” సంచారము వలన “దేహపీడా మనఃక్లేశం చతుష్పాద మృగాద్భయమ్” అను శాస్త్రవచనం ప్రకారం, శరీర పీడ, అనారోగ్యం, మనోవిచారము, జంతువుల వలన భయం, రాజదండన, ప్రయాణములు, పనులలో జాప్యము కలుగును. పిశాచ బాధ, నరదృష్టి ప్రబల అధికముగా ఉండును. అనారోగ్య సమస్యలధికము.

ది. 15-4-2022 తదుపరి సప్తమ రాహు సంచారము వలన, “సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం వ్యధా” అను శాస్త్రవచనం ప్రకారం, కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. అనవసరపు ప్రయాణములు అధికముగా చేస్తారు. చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు. దాంపత్య జీవనమునందు మాట పట్టింపులు, విదేశీ యానము, అల్పభోజనము, కాళ్ళు, చేతుల వేళ్ళ మధ్యలో ఎలర్జీలు వచ్చును.

“అర్ధాష్టమశని” సంచారం వలన “వాతశూలం మనఃక్లేశం భయం స్వస్థాన హానికృత్” అను శాస్త్రవచనం ప్రకారం కుటుంబమున సమస్యలు, మానశిక బాధలు, ఇంటిలో ఉండుటకు భయపడుట, రోగభయము, ఉద్యోగమున సమస్యలు, ఒత్తిడితో కూడిన వాతావరణము ఉండును.

మొత్తం మీద గత సంవత్సరం పూర్తి వ్యతిరేక ఫలితాలతో పోల్చుకుంటే, ఈ సంవత్సరం గురుబలము వలన కొంత ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయినప్పటికీ దైవతారాధన, శనిజపము వలన మరింత మంచి ఫలితాలు వచ్చును. క్రింది సంకల్పంతో శనివారం నువ్వులు, ఉప్పు, నూనె, నల్లటి వస్త్రం దానమీయుట మంచిది.

సంకల్పము : మమ చన్ద్ర లగ్న వశాత్ “అర్ధాష్టమ శని” దోష పరిహారార్ధం.