Sri Subhakrit Nama Samvatsara Meena Rasi Phalalu
ఈ రాశివారికి ది. 14-4-2022 వరకు గురుడు 12వ యింట తామ్రమూర్తి, తదుపరి జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చెయ్యనున్నారు. శనైశ్చరుడు ఈ సంవత్సరం మొత్తం 11వ స్థానమందు సంచారం చెయ్యనున్నారు. రాహు-కేతువులు ది. 15-4-2022 వరకు 3-9వ యింట, తదుపరి 2-8 స్థానాలలో తామ్రమూర్తులుగా సంచారం చెయ్య నున్నారు.
ఈ రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా మెరుగయిన ఫలితాలు గోచరిస్తున్నవి. గురుబలము లేకపోయినా శని, రాహువులు అనుకూల సంచారము వలన మెరుగయిన శుభఫలితాలు రానున్నవి. జాతకమందు మంచి దశలు నడుస్తున్నచో మరింత రాజయోగమును ఆ రాశివారు అనుభవిస్తారు.
గురు సంచారము 12, జన్మరాశిలో ఉండుట వలన “శుభమూలోవ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం” అను శాస్త్రవచనం ప్రకారం శుభకార్యములకు ధనాన్ని ఖర్చు చేస్తారు. స్థాన చలనము, దూర ప్రాంత సంచారము. విదేశీయానమునకు అవకాశము కలదు. నూతన భూ-గృహ కొనుగోలు, నూతన వాహనములు కొనుగోలు చేస్తారు. లగ్జరీ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున ఒత్తిడి అధికము. స్థానచలనముకు అవకాశం, ఉద్యోగ మార్పు, ఉన్నతాధికారుల వలన ఇబ్బందులు, వివాహాది శుభకార్యములు చేస్తారు.
ది. 15-4-2022 వరకు రాహుబలము లేదు. ఫలితంగా సంచారము, తోబుట్టువు లతో మాట పట్టింపులు, అన్నదమ్ములతో సమస్యలు, భయము అధికము. భోజన సౌఖ్యము తక్కువ. ఏప్రిల్ 15 దాటిన పిదప “సౌభాగ్య భాగ్య మారోగ్యం అర్ధలాభం యశస్కరం” అను శాస్త్రవచనం ప్రకారం, వివాహాది శుభకార్యములు జరుగుట, బంధు-మిత్రులతో ఆనంద సమయం గడుపుట, ఆరోగ్యము బాగుండుట, ఆర్థికాభివృద్ధి, విందు, విహార యాత్రలలో పాల్గొంటారు. చర్మ సంబంధిత వ్యాధల నుండి విముక్తి లభించును. కుటుంబ సమస్యల నుండి బయట పడతారు. బంధువులతో విరోధములు తగ్గును. మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. అందరూ మీ మాటను గౌరవించెదరు.
శని లాభస్థాన సంచారము వలన “ఆరోగ్య మర్ధలాభశ్చ స్త్రీ పుత్ర సుఖ వర్ధనం” అను శాస్త్రవచనం ప్రకారం ఆరోగ్యము బాగుండును. ధనము సంపాదించు మార్గములు పెరుగును. చాలాకాలంగా చేతికి రావలసిన ధనము వచ్చును. సంతాన ప్రాప్తి, సంతోషము కలుగును. ప్రయత్న పూర్వకముగా కార్యములందు జయము కలుగును. ఉద్యోగమున ప్రమోషన్ల, విదేశీయానమునకు పరిస్థితులు అనుకూలము. దూరవిద్యకు అవకాశమున్నది. గతంలో నష్టపోయిన ద్రవ్యమును తిరిగి సంపాదించుకుంటారు. వివాహాది శుభకార్యములు జరుగును. సంతానము వృద్ధి చెందును. సుఖ సంతోషములు ఉంటాయి.
మొత్తం మీద ఈ రాశి వారికి మంచి సమయము. గురుబలము పెంచుకోవడానికి గురువారం శనగలు దానమీయుట మంచిది. ప్రతిరోజూ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ ఉత్తమము. “శ్రీ గురు చరిత్ర” పారాయణ ద్వారా మరింత అనుకూల ఫలితాలు పొందగలుగుతారు.