ధనస్సు

మూల1,2,3,4 , పాదాలు, పూర్వాషాఢ1,2,3,4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం

Sri Subhakrit Nama Samvatsara Dhanu Rasi Phalalu

ఈ రాశివారు ది. 14-4-2022 వరకు గురుడు మూడవ యింట సువర్ణమూర్తి, తదుపరి నాల్గవ స్థానమందు రజతమూర్తిగా సంచారం చెయ్యనున్నారు. శనైశ్చరుడు ఈ సంవత్సరం మొత్తం రెండవ యింట సంచారం చెయ్యనున్నారు. రాహు-కేతువులు ది. 15-4-2022 వరకు 6-12వ యింట, తదుపరి 5-11వ యింట తామ్రమూర్తులుగా సంచారం చెయ్యనున్నారు.

గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏప్రిల్ దాటిన తదుపరి రాహు బలము తగ్గును. గురుబలము లేదు. “ఏలిన నాటి శని” బాధను అనుభవించుచున్నారు. దీర్ఘ సంచార గ్రహములలో అన్ని గ్రహములూ ప్రతికూలమయిన ఫలితాలను ఇచ్చుచున్నాయి. జాతకమున మంచి దశలు నడిచినచో ఈ గ్రహస్థితి అంతగా బాధించదు. జాతకమున దశలు అనుకూలించని యెడల ఇది విపత్కర పరిస్థితే !

గురుని సంచారము వలన “అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనమ్” అను శాస్త్రవచనం ప్రకారం ఉద్యోగమున ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు బాగాలేకుండుట బంధు-మిత్రులతో మాట పట్టింపులు, ధనము అధికముగా ఖర్చు చేయుట, మానశిక ప్రశాంతత లోపించుట, అనవసరపు తగాదాలు అధికము. ప్రయాణములు వృధాగా చేస్తుండుట, నీలాపనిందలు, ప్రతి చిన్న దానికీ ప్రక్కవారిపై అధారపడుట, దేశాంతర వాసము, కొండప్రాంత సంచారము, బుద్ధి చాంచల్యము ఉండును.

ఈ రాశివారికి ది. 15-4-2022 వరకు రాహువు అనుకూలము. “ధైర్యబుద్ధిర్వీర్య బుద్ధిః రిపునాశం సదా శుభం” అను శాస్త్రవచనం ప్రకారం తెలివితేటలు, పరాక్రమము, శతృవులపై విజయము, శుభకార్యములు జరుగును. గో-భూ లాభము కలుగును. చాలాకాలంగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఋణబాధలు తగ్గును. చాలాకాలంగా రావలసిన ధనము చేతికందును. అన్నింటా శుభఫలితాలు వచ్చును.

ది. 15-4-2022 తదుపరి పంచమ రాహు సంచారము వలన “పుత్రవైరం నృపాత్పూజ్యం కాలాతిక్రమ భోజనం” అను శాస్త్రవచనము ప్రకారం సంతానముతో విరోధము, రాజ సన్మానము, కాలాన్ని అతిక్రమించి భోజనము చేయుట నాస్తికత్వము ప్రబలుట జరుగును. మోసపోవు అవకాశములు ఎక్కువ. జూదము, స్పెక్యులేషన్ వంటి వాటిలో ధనము కోల్పోవు ప్రమాదమున్నది. పాపపు కర్మలు చేస్తారు. శుభకార్యములు వాయిదా పడును.

“ఏలిననాటి శని” చివరి సంవత్సరము, వచ్చే సంవత్సరము లగాయితు దాదాపు ఏడున్నర సంవత్సరాలుగా ఉన్న ఈ దోషము తొలగిపోవును. చివరి సంవత్సరమయిన ఈ ఏడాది జాగ్రత్తగా ఉండవలెను.

“సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనమ్” అను శాస్త్రవచనం ప్రకారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, దాంపత్య జీవనములో మాటపట్టింపులు, అనవసరపు తగాదాలు అధికము. మాట వలన సమస్యలు వచ్చును. మానసిక ప్రశాంతత లోపించును.

మొత్తం మీద ఈ ఒక్క సంవత్సరం కొంత దాటగలిగితే అన్నిరకాల సమస్యల నుండి ఈ రాశివారు విముక్తి పొందుతారు. ఏలిననాటి శని పోతుంది, గురుబలము వస్తుంది. అప్పటి వరకు ప్రతినెల మొదటి శనివారం “మన్యుసూక్త” పారాయణ చాలా ముఖ్యము. అలాగే శనికి జపము చేయించుకొనిన మంచిది. “శ్రీగురు చరిత్ర “ పారాయణ ఉన్నత ఫలితాలను ఇచ్చును.