వృశ్చికం

విశాఖ 4వ పాదం, అనూరాధ, 1,2,3,4 పాదాలు, జ్యేష్ట 1,2,3,4 పాదాలు

Sri Subhakrit Nama Samvatsara Vrischika Rasi Phalalu

 

ఈ రాశి వారికి ది. 14-4-2022 వరకు గురుడు నాల్గవ యింట తామ్రమూర్తి, తదుపరి ఐదవ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చెయ్యనున్నారు. ఈ సంవత్సరం మొత్తం శనైశ్వరుడు మూడవ యింట సంచారం చెయ్యనున్నారు. రాహు-కేతువులు ది.15-4-2022 వరకు 7-1వ యింట, తదుపరి 6-12వ యింట సువర్ణమూర్తులుగా చెయ్యనున్నారు.

ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూల ఫలితాలు రానున్నాయి. ది.14-4-2022 దాటిన పిదప దీర్ఘసంచార గ్రహములయిన రాహు, గురు, శనులు పూర్తి స్థాయిలో అనకూలిస్తుండటము వలన గత కొద్ది సంవత్సరాలుగా అనుభవిస్తున్న గడ్డు పరిస్థితి నుండి విముక్తి లభించును.

ది. 15-4-2022 వరకు గురుబలము తక్కువ, అలాగే రాహు సప్తమ స్థాన సంచారము వలన “యాచనం బుద్ధి చాంచల్యం తేజోహనిర్ ధనవ్యయం” అను శాస్త్రవచనం ప్రకారం కుటుంబ సమస్యలు, ఉద్యోగమున ఒత్తిడి, వృధా ప్రయాణములు, నీలాపనిందలు, దాంపత్య జీవనంలో సమస్యలు, శుభకార్యములు వాయిదా పడుట, దూరప్రాంత సంచారము చర్మ సంబంధిత సమస్యలు కలుగును.

ది. 15-4-2022 తదుపరి స్వర్ణయుగము. రాహు, గురు, శనుల అనుకూల పరిస్థితుల వలన “అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితమ్” అను శాస్త్రవచనం ప్రకారం, వివాహాది శుభకార్యములు చేస్తారు. సంతానము కలుగును. ఆర్థికాభివృద్ధి, ఋణబాధలు తగ్గును. పదవులు అలంకరిస్తారు. భూ-గృహములకు కొనుగోలు చేస్తారు. బంగారము, నూతన వస్తు, వస్త్రములను కొనుగోలు చేస్తారు. తీర్థ యాత్రలు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిమ్మల్ని వారు అందరికీ సరైన మార్గం చూపగలుగుతారు. ఉద్యోగమున ప్రమోషన్లు, ఆశించిన ప్రాంతమునకు బదిలీలు జరుగును. వ్యాపార విస్తరణ, వ్యాపారస్తులకు మంచి సమయం, విద్యార్థినీ విద్యార్థులకు మంచి సమయము. నూతన ఉద్యోగాలు లభిస్తాయి.

రాహు-కేతువుల అనుకూల స్థితి వలన “ధైర్యబుద్ధిర్వీర్య బుద్ధిః రిపునాశం సదా శుభం” అను శాస్త్రవచనం ప్రకారం తెలివితేటలు, పరాక్రమము, శతృవులపై విజయము, శుభకార్యములు జరుగును. గో-భూ లాభము కలుగును. చాలాకాలంగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఋణబాధలు తగ్గును. చాలాకాలంగా రావలసిన ధనము చేతికందును. అన్నింటా శుభఫలితాలు వచ్చును.

శనైశ్చరుని తృతీయ స్థాన సంచారము వలన “స్త్రీభోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్” అను శాస్త్రవచనం ప్రకారం అన్నదమ్ములతో సమస్యలు తగ్గును. వివాహాది శుభకార్యములు జరుగును. ఆర్థికాభివృద్ధి కలుగును. మానశిక ప్రశాంతత పెరుగును. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. గృహ లాభము, భూమి కొనుగోలు నూతన వస్త్ర-వస్తు కొనుగోలు చేస్తారు. వంశపారంపర్య ఆస్థులు చేతికొస్తాయి. విద్యార్థులు అనుకూలం, వ్యాపారస్థులు లాభపడతారు.

అన్నింటా వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం పూర్తి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నవి. దీనికి తోడు జాతకమున యోగదశలు నడిచినచో రాజయోగము సిద్ధించును.