Sri Subhakrit Nama Samvatsara Vrishabha Rasi Phalalu
ఈ రాశి వారికి ది. 14-4-2022 వరకు గురుడు పదవ యింట సువర్ణమూర్తి, తదుపరి లాభస్థానమందు లోహమూర్తిగా సంచారం చేయనున్నారు. శనైశ్చరుడు ఈ సంవత్సరం మొత్తం తొమ్మిదవ స్థానమందు సంచారం చెయ్యనున్నారు. రాహు, కేతువులు ది. 15-4-2022 వరకు 1-7వ యింట, తదుపరి 12-6వ యింట రజతమూర్తులుగా సంచారం చేయనున్నారు.
ఈ రాశివారికి 14-4-2022 వరకు గురుబలము లేదు. పదవ యింట గురు గ్రహ సంచారము వలన “ధాన్యనాశోధనచ్ఛేదం వృధా సంచరణమ్ భయమ్” అను శాస్త్ర వచనం ప్రకారం ఖర్చు అధికమగును. వృధా ప్రయాణములు చేయుట, మానసిక భయము అధికము, ఉద్యోగమున ఒత్తిడి అధికముగా ఉండును. వృత్తి-ప్రవృత్తులలో కొంత మిశ్రమ పరిస్థితులు, గృహ-భూ-వాహన అమ్మకాలు కొనుగోలులో జాప్యము అధికము. కుటుంబములో తగాదాలు జరుగును.
ఏప్రిల్ 14 దాటిన పిదప గురుడు లాభస్థానమందు చాలా మంచి ఫలితాలను ఇస్తారు. “యశోవృద్ధిర్బలం తేజః సర్వత్ర విజయస్సుఖమ్” అను శాస్త్రవచనం ప్రకారం అన్నింటా విజయలక్ష్మి వరించును. విదేశీయానమునకు పరిస్థితులు అనుకూలము. శుభకార్యక్రమాలు చేస్తారు. సంతానము కలుగును. దూరప్రాంత సంచారము, ఉద్యోగమున ప్రమోషన్లు, ఆశించిన చోటకు బదిలీలు కలుగును. నూతన గృహ, వాహనములను కొనుగోలు చేస్తారు. బంగారము, వస్త్రములను కొనుగోలు చేస్తారు. వ్యాపారములు అభివృద్ధి పదములో ఉండును. విద్యార్థులకు మంచి సమయం, ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఉద్యోగం లభించును.
శనైశ్చరుని భాగ్యస్థాన సంచారము మిశ్రమ ఫలితాలను ప్రసాదించును. “శోకం రోగం మహాదుఃఖం క్వచ్చిద్రవ్యమ్ క్వచిత్సుఖమ్” అను శాస్త్రవచనం ప్రకారం ఆర్ధికంగా మిశ్రమ పరిస్థితులు ఉండును. శుభకార్యములకు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. కొంత ధనము ఆరోగ్య పరిస్థితులు మెరుగు పరచుటకు ఖర్చు చేస్తారు. ప్రయాణములు అధికంగా చేస్తారు. మిత్రులు, సన్నిహితుల చేతిలో ఆర్ధికంగా మోసపోయే అవకాశము వున్నది. అనవసరపు ధనవ్యయము అధికము లగ్జరీ వస్తువులు కొనుగోలు, వ్యసనములకు ధనాన్ని ఖర్చు చేస్తారు. విందు, విహార యాత్రలలో పాల్గొంటారు.
రాహు-కేతువులు ది. 15-4-2022 వరకు 1-7వ స్థానాలలో చేస్తారు. “ధారాపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనమ్” అను శాస్త్రవచనం ప్రకారం భార్యా పిల్లలకు దూరంగా కాలాన్ని గడుపుతారు. ధనవ్యయము, ప్రయాణములు, చర్మ సంబంధిత, వెన్ను పాము సంబంధిత సమస్యలు, క్రిమి కీటకాల వలన ఇబ్బందులు ఉండును. ది. 15-4-2022 తదుపరి 12-6వ స్థానములలో రాహు-కేతువుల సంచారము వలన “దారిద్ర్యం ధననాశంచ నేత్రపీడారిపోర్భయమ్” అను శాస్త్రవచనం ప్రకారం ధనవ్యయము, కంటి సమస్యలు, దొంగల భయము, స్థానచలనము, కాలాన్ని అతిక్రమించి భోజనము చెయ్యుట, నిద్రాసౌఖ్యము తక్కువగా ఉండుట జరుగును.
మొత్తం మీద వృషభరాశి వారికి ఈ సంవత్సరంలో గురుబలం ఏప్రిల్ తదుపరి వున్ననూ రాహు, శని వ్యతిరేక సంచార ఫలములు కూడా ఉన్నవి. ఆ వ్యతిరేక ఫలితముల బాధ తగ్గుటకు “సర్పసూక్తము”తో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము జరిపించుకొని, ఆదివారం యధాశక్తి మినుములు దానమీయవలెను.