కన్య

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1,2,3,4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు

Sri Subhakrit Nama Samvatsara Kanya Rasi Phalalu

ఈ రాశివారికి ది. 14-4-2021 వరకు ఆరవ యింట గురుడు రజతమూర్తి, తదుపరి ఏడవ స్థానమందు లోహమూర్తిగా సంచారం చెయ్యనున్నారు. శని ఈ సంవత్సరం మొత్తం ఐదవ యింట సంచారం చేయనున్నారు. రాహు-కేతువులు ది. 15-4-2022 వరకు 9-3వ యింట, తదుపరి 8-2వ స్థానాలలో సువర్ణమూర్తులుగా సంచారం చెయ్య నున్నారు.

ఈ రాశి వారికి ఈ సంవత్సరం ది. 14-4-2022 వరకు గురుబలము లేదు. తదుపరి అనగా ది. 14-4-2022 దాటిన పిదప గురుబలమున్నది. రాహు-కేతువులు, శనైశ్చరుడు ఈ సంవత్సరం ప్రతికూలంగా సంచారం చెయ్యనున్నారు. అయితే పూర్తి గురుబలము వలన ది. 14-4-2022 లాగాయితు శుభఫలితాలు, అష్టమ రాహువు వలన అశుభ ఫలితాలతో మిశ్రమ ఫలితాలు ఈ రాశికి గోచరిస్తున్నది.

ది. 14-4-2022 వరకు షష్ఠ గురుని సంచారము వలన “ధారాపుత్ర విరోధంచ స్వజనే కలహస్థథా” అను శాస్త్రవచనం ప్రకారం, భార్యా పిల్లలకు దూరంగా కాలాన్ని గు, సొంత బంధువులు – మిత్రుల చేతిలో మోసపోవుట, ఆర్థిక లావాదేవీల కారణంగా బంధువులతో మాటపట్టింపులు. అగ్ని, దొంగలు వలన బాధ, ఉన్నతాధికారుల వలన సమస్యలు, బంగారము మొదలగు విలువయిన వస్తువులను కుదువ పెట్టుట, ఋణములు తీసుకొనుట, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో కొంత ఇబ్బందులు వంటివి జరుగును.

ది. 14-4-2022 తదుపరి గురుని సప్తమ స్థాన సంచారము వలన “రాజదర్శన మారోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం” అను శాస్త్ర వచనం ప్రకారం, వివాహాది శు భకార్యములు జరుగును. సంతానము కలుగును. ఉద్యోగమున ప్రమోషన్లు, ఆశించిన స్థానముకు బదిలీలు జరుగును. సమాజంలో ఉన్నత స్థాయిలో వున్న వ్యక్తులతో పరిచయము ఏర్పడును. మొదలు పెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. భూ-గృహ-వాహనములు కొనుగోలు చేస్తారు. బంగారము, నూతన వస్తు-వస్త్ర ప్రాప్తి కలుగును. ఎప్పటినుండో చేతికి రావలసిన ధనము అందుతుంది. తీర్థయాత్రలు విందు విహారయాత్రలు చేస్తారు.

శనైశ్చరుని సంచారము ఐదవ రాశిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చును. “కార్యహా నిర్మనస్థాపః జ్ఞాతివ్యాజ్య కలాపహం” అను శాస్త్రవచనం ప్రకారము, పనులలో జాప్యం అధికమగును. సంతాన సమస్యలు, తోబుట్టువులతో విరోధము. స్త్రీ వలన సమస్యలు, పాపపు కర్మ చేయవలసిన వచ్చుట, మనసుకు నచ్చని పనులు చేయవలసి వచ్చుట, బుద్ధి చాంచల్యము, భగవంతుని దూషించుట, నాస్తికత్వము కలుగును. జూదము, స్పెక్యూలేషను వంటి వాటి వల్ల ధననష్టము కలుగును.

ది. 15-4-2022 వరకు భాగ్య రాహు సంచారము వలన “గోవాజి గజ నాశంచ ధనధాన్యాధి నాశకృత్” అను శాస్త్ర వచనం ప్రకారం భాగ్యమందు రాహువు వలన ఆర్ధిక నష్టము జరుగును. మొదలు పెట్టిన పనులలో జాప్యము అధికము. ప్రయాణములు అధికంగా చేస్తారు. వంశపారంపర్య ఆస్థిపాస్తులకు ముప్పు. అనువంశి కముగా వచ్చు వ్యాధుల వలన ఇబ్బందులు కలుగును.

ది. 15-4-2022 తదుపరి “అష్టమ రాహు” సంచారము వలన “దేహపీడా మనఃక్లేశం చతుష్పాద మృగాద్భయమ్” అను శాస్త్రవచనం ప్రకారం, శరీర పీడ, అనారోగ్యం, మనోవిచారము, జంతువుల వలన భయం, రాజదండన, ప్రయాణములు, పనులలో జాప్యము కలుగును. పిశాచ బాధ, నరదృష్టి ప్రబల అధికముగా ఉండును. అనారోగ్య సమస్యలధికము.

ఈ సంవత్సరము రాహుపీడ అధికముగా ఉన్న కారణము చేత ప్రతి మంగళవారం “సర్ప సూక్తము”తో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము జరిపించుట మంచిది. క్రింది సంకల్పముతో ఆదివారం మినుములు దానమీయుట చేయవలెను.

సంకల్పం : మమ చన్ద్ర లగ్న వశాత్ అష్టమరాహు దోష పరిహారార్ధం.