
How To Control Anger / కోపాన్ని అదుపులో పెట్టటానికి మార్గాలు
తనకోపమే తన శత్రువన్న వేమన మాట అక్షరాలా నిజం. మితిమీరిన కోపం మనకు మనుషులను దూరం చేస్తుంది. మనుషులు, బంధాలే కాదు కోపం వల్ల ఎన్నో విలువైన అవకాశాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ పోటీ ప్రపంచం లో తమని తాము సంయమనంగా ఉంచుకోక పోతే ఇంటాబయటా కూడా ఓటములు తప్పవు. కోపాన్ని అణచుకోలేక ఇక్కట్లపాలైనవారు ఎంతోమంది. మరికొంతమంది కోపాన్ని లోలోపలే అణిచిపెట్టుకుని తమలోతాము ఒత్తిడికి లోనై మానసిక రుగ్మతలబారిన పడుతున్నారు. ఇంతకీ కోపాన్ని అదుపులో ఉంచుకునే మార్గాలను తెలుసుకుందాం.
- కోపం వచ్చినపుడు ఒక్క పది సెకన్ల పాటు ఆ విషయం కాకుండా మరో ప్రశాంతమైన సంఘటనను గుర్తుచేసుకోండి. దీర్ఘంగా నెమ్మదిగా ఊపిరిని తీసుకోవాలి.
- మీ కోపం ధర్మబద్ధమా కాదా అన్న ఆలోచన చెయ్యండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మన కోపాన్ని ప్రదర్శించక పోవడం వలన కూడా ప్రమాదాలకు తావిచ్చినట్లు అవుతుంది. ఉదాహరణకు అతిగా చనువు తీసుకుని వేధించే వారిపట్ల సంయమనం పాటించడం వల్ల మరింత ఇబ్బందుల్లో పడవలసి వస్తుంది. అందుకని మన కోపం ప్రదర్శించడం ఆ సందర్భంలో నిజంగా అవసరమా కాదా అన్న ఆలోచన తప్పనిసరిగా చేయాలి.
- మీరు ఎవరిమీదైతే కోపంగా ఉన్నారో వారికీ మీకూ గల స్నేహాన్ని, బంధాన్ని గుర్తుచేసుకోండి.
- మీకోపానికి పరిస్థితులు కారణం అయితే కోపించడం వలన ఆలోచన మందగించి పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయని మీకు మీరు చెప్పుకోండి.
- అన్నిటికన్నా ముఖ్యంగా కోపంగా ఉన్నప్పుడు మౌనంగా అక్కడినుంచీ నిష్క్రమించడం ఉత్తమం.
- పచ్చని చెట్టుని తదేక దీక్షతో 15 సెకన్ల పాటు చూడండి. పసిపిల్లలను గమనించండి. ఇలా చేయడం వాళ్ళ మీలోని కోపం అదుపులోకి వస్తుంది.
శుభం.