
ప్రతి వ్యక్తికీ ఏదో ఒక సందర్భంలో కోపం, ఉద్రేకం, ఆవేశం రాకుండా ఉండవు. కోపం వస్తే మనం ఎలా వ్యక్తం చేస్తామనే విషయంలో మనిషికీ మనిషికీ మధ్య తేడాలుంటాయి.
కొంతమంది తాము కోపిష్టులమనీ, తమకు టెంపర్ ఎక్కువనీ చెప్పుకుంటారు. సాధారణంగా ఈ రకం మనుష్యులు తమ కోపాన్ని ఇంట్లో భార్యమీద, పిల్లలమీద చూపుతుంటారు.
కానీ, తమ పై అధికారిపై చూపించరు. అంటే అధికారి వద్ద కోపాన్ని అణచుకుంటారు. దీని అర్థం మనకు కోపాన్ని నిగ్రహించుకోవాలనే ఆలోచన ఉంటేకొంతవరకైనా నివారించుకోగలుగుతాము.
కోపం వలన చాలా సందర్భాలలో నష్టాలు ఎదురైనప్పటికీ, కొంత మేరకు లాభాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి కంఠస్వరం స్థాయి పెంచి, గట్టిగా గద్దిస్తూ చెబితే తప్ప పనులుకావు.
అయితే గద్దించడంపై నిగ్రహం లేకుండా ప్రవర్తిస్తే, పనులు జరుగవు సరికదా, నలుగురిలో కోపిషులమనే చెడ్డపేరు కూడా వస్తుంది.
కోపం రావడానికి అనేక అంశాలు దోహదం చేస్తుంటాయి. కొన్ని వ్యాధులకు గురైన వారు కూడా అకారణంగా కోపాన్ని ప్రదర్శిస్తుంటుంటారు.
ఉదాహరణకు తలకు గాయమైనవారు, మూర్ఛవ్యాధి, కొన్ని రకాల మానసిక వ్యాధులకు గురైన వారు అకారణంగా ఇతరులపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు.
మనిషి పెరిగిన వాతావరణాన్ని బట్టి కోపం రావడం ఆధారపడి ఉంటుంది. కొంతమంది అతిత్వరగా కోపం ప్రదర్శించడం మనం చూస్తూ ఉంటాం.
పెద్దవాళ్లు ప్రతి చిన్న విషయానికీ అరవడం,పిల్లలను కొట్టడం వంటిపనులు చేస్తుంటే, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.
పరిస్థితుల ప్రభావం వలన మనకు కోపం వచ్చినప్పడు పక్కవారిపై అరుస్తాము. అంతే త్వరగా మర్చిపోతాం కూడా.
కొంతమంది మాత్రం కోపం వస్తే బైటకు చెప్పలేక, లోలోపలే గంటలకొద్దీ ఆలోచించి, బాధపడి తమ ఆరోగ్యం పాడుచేసుకుంటారు.
అంటే కోపాన్ని బైటకు వ్యక్తం చేసినప్పుడు పక్కవాళ్లకు, వ్యక్తం చేయకపోతే కోపం వచ్చిన వాళ్లకు బాధ కలుగుతుంది.
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మునులు, సాధువులు, రుషులకే సాధ్యమని అంటారు. మనం కోపాన్ని నిగ్రహించలేకపోయినప్పటికీ, దానిని వీలైనంత తక్కువ స్థాయికి తగ్గించుకోవచ్చు.
అప్పడే కోపాన్ని సరైన పద్ధతిలో వ్యక్తం చేయడం సాధ్యమవుతుంది.
ఈ విషయంలో మనం మారాలని అనుకున్నప్పుడు ముందుగా మనకు సమస్య ఉందని తెలుసుకోవాలి. తరువాత మారాలనే గట్టి నిర్ణయం తీసుకోవాలి.
కోపం కలుగడానికి పని వత్తిడి ఒక కారణమైతే, మన మాటకు ఎదుటివారు విలువ ఇవ్వడం లేదనే అంశం మరొక కారణం.
కోపాన్ని నిగ్రహించుకోవాలనుకునే వారు ముందుగా రెండు వారాల పాటు తమ ప్రవర్తనను తామే అధ్యయనం చేసుకోవాలి.
ఏఏ సందర్భాలలో కోపం వస్తున్నదో సమీక్షించుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంటున్నది? దీనివలన ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? అనే విషయాలను పరిశీలించాలి.
వీటి ఆధారంగా మనలో మార్పు కోసం ఎటు వంటి ప్రయత్నాలు చేయాలో ఒక ప్రణాళికను రూపోందించుకోవచ్చు.
పని భారం ఎక్కువై తనపై అధికారిపై కోపం వచ్చినప్పడు దానిని వ్యక్తీకరించలేక, ఇంట్లో భార్యాపిల్లల మీద చూపుతూ, తనలో తానుతిట్టుకోవడమే తప్ప మరేమీ చేయలేని స్థితిలో పడటం కొంతమందిలో గమనిస్తుంటాము.
వీరికి కోపంతెప్పించే వారిపై కాకుండా, దానిని భరించే వారిపై చూపడం అలవాటుగా మారుతుంది.
ఇంకొంతమందిలో తనలో తాను మాట్లాడుకోవడం (సెల్ఫ్ టాక్) అలవాటు ఉంటుంది. వీరు కోపాన్ని వ్యక్తం చేయకుండా, కోపానికి కారణమైన వారిని తమ మనస్సుల్లోనే తిట్టుకుంటూంటారు.
తమతో ఏకీభవించే వారితో చర్చిస్తుంటారు. దీని వలన కోపం స్థాయి పెరగడమే తప్ప దానిని తగ్గించుకోవడం సాధ్యం కాదు.
ఇలా కోపం స్థాయి పెరుగుతున్నప్పుడే దానిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
సెల్ఫ్ టాక్ ద్వారా ఒక దశ వరకూ మనం కోపాన్ని ఆపుకోగలం. మితిమీరితో మన నియంత్రణలోనుంచి తప్పిపోతుంది.
కోపం అధికంగా ఉండే కొంతమందితో ఒక గ్రూపును తయారుచేసి, తమ గురించి చర్చించుకోవాలి. ఈ గ్రూపులో ఉన్న వారు తమకు కోపం తెప్పించే సంఘటనలను ఒక నాటకంలాగా అందరి ముందు ప్రదర్శిస్తారు. ఇది ఒక పద్ధతి.
దీనిని రోల్ ప్లే అని వ్యవహరిస్తాము.
అలాగే అదే సంఘటన మరొకసారి జరిగితే ఎలా ప్రవర్తించాలనే విషయమై వారు సాధన చేస్తారు. మరొక పద్ధతి ఊహించుకోవడం.
దీనిని ఇమేజరీ విధానమంటారు. ఈ విధానంలో కోపం వచ్చినప్పుడు దానిని వ్యక్తీకరించడం వలన ఎదురయ్యే పరిణామాలను ఊహించుకోవాలి.
ఉదాహరణకు ఒక వ్యక్తికి తీవ్రమైన కోపం వచ్చినప్పుడు ఆలోచన లేకుండా ఎదుటి వారిని కొట్టేవాడు. తరువాత బాధపడినా, ఇదే విధంగా అనేకసార్లు జరిగింది.
దీనివలన చెడ్డపేరు రావడమే కాకుండా పోలీసు కేసు నమోదు అయింది. ఉద్యోగం పోయింది. ఆ తరువాతనుంచి ఆయన తనకు కోపం వచ్చినప్పుడు ఊహాలోకంలోకి వెళ్లి కోపం కారణంగా ఎదురయ్యే పరిణామాలను అతిగా ఊహించుతో సాగాడు.
అవతలివ్యక్తిని తాను కొట్టినట్లు, అతడు కింద పడిపోయినట్లు, అంబులెన్స్లో అతడిని ఆసుపత్రికి తరలించినట్లు, ఆ వ్యక్తి మరణిస్తే, తనను పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టినట్లు, తనకుటుంబం అనాథలైనట్లు ఊహించుకోవడం మొదలెట్టాడు.
ఈ సీన్లు పూర్తయ్యేసరికి అయ నకు కోపం తగ్గిపోయేది. ఆ తరువాత ఆయనకు కోపం వచ్చినా నిగ్రహం తప్పిపోయిన సంఘటనలు లేవు.
ఇలా ఇమేజరీ విధానాన్ని అనుసరించడంద్వారా కోపాన్ని నిగ్రహించుకోవచ్చు.
కోపాన్ని అదుపులో పెట్టటానికి మార్గాలు | How To Control Anger