మత్తును తొలగించే మార్గాలు

0
1148

అతినిద్రతో అనర్థాలు – ఆ మత్తును తొలగించే మార్గాలు

అతినిద్రతో – అనర్థాలు 

భగవంతుడు ప్రసాదించిన రాత్రులు నిద్రకోసం కేటాయించడమైనది ‘ఆహార నిద్రా భయ మైథునాని’ (ఆహారం – నిద్ర – భయం – దాంపత్యం) ఇవి ప్రకృతి నియమాలు. వీటిని అనుకరిస్తే ఆరోగ్యం, ఉల్లంఘిస్తే అనారోగ్యం. వారివారి వయసునుబట్టి 5 నుండి 8 గంటలు నిద్రించవచ్చు. అధిక నిద్ర అయినా కష్టమే, అల్ప నిద్ర అయినా కష్టమే. 

84 లక్షల జీవరాశుల్లో మానవజన్మ ఉత్తమమైనది. ఈ జన్మరావడం – దుర్లభం అయినా భగవంతుని అనుగ్రహంతో మనం చేసుకున్న పుణ్యఫలంతో ఈ జన్మ ఎత్తడం జరిగింది. కావున ఈ జన్మ సార్ధకతకోసం ప్రతిక్షణం ఉపయోగించుకోవాలి. నిద్రమత్తుతో, అతినిద్రతో గడపరాదు. 

మహాభారతంలో ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు తెలియజేయడం సమంజసంగా భావిస్తున్నాం. పాండవులు వనవాసం చేసే సమయంలో ఎన్ని కష్టాలొచ్చిన శ్రీకృష్ణుడు వారిని కాపాడుతుంటాడు. ఒకానొకప్పుడు లక్క ఇంటిలో పాండవులుండగా వారిని దహింపజేయడానికి కౌరవులు కుట్రపన్నగా వారిని కాపాడటానికి కాపలాగా భీమసేనున్ని ఏర్పాటుచేస్తారు. కాని ఆ భీముడు వత్తుగా తిని మత్తుగా పడుకొని ఉండగా ఆ సమయంలో శ్రీ కృష్ణుడు ఇలా మత్తు వదిలించడానికి పాడిన పాట గుర్తు తెచ్చుకుందాం.

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా! 
ఆ మత్తులోనబడితే గమ్మత్తుగ చిత్తవుదువురా ||మత్తు!! 
జీవితంలో సగభాగం నిద్దురకేసరిపోవును 
మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవును 
కర్తవ్యం నీవంతు, కాపాడుట నావంతు 
చెప్పడమే నా ధర్మం. వినకపోతే నీ ఖర్మం |మత్తు!!

మనలో ఉండే ఆత్మ, మన వెనుకవుండే కానరాని భగవంతుడు ఎల్లవేళలా మనలను ఉత్తేజపరుస్తు కర్మలనన్నింటిని నిర్వర్తింపజేస్తుంటాడు మరియు మనలను కాపాడుతుంటాడు. కాని మనం వ్యసనాలకు లోబడి మన కర్తవ్యాన్ని ఉల్లంఘిస్తుంటాం. అర్థరాత్రి వరకు క్లబ్బుల్లో పబ్బుల్లో తాగితందానాలాడుతూ కొంతమంది అర్థరాత్రివరకు టీ.విలు చూస్తూ కూర్చొని ఉదయం సూర్యోదయం తరువాత 8,9 గంటలకు నిద్రలేవడం, మరికొంతమంది నిత్యకార్యక్రమాలైన యోగసాధన, నడక, వ్యాయామం మానివేసి అనారోగ్యాల పాలుకావడం మనం చూస్తున్నాం. మనకందరికి తెలుసు ‘ఆరోగ్యం భాస్కరాథిచ్ఛేత్’ అనగా మన ఆరోగ్యం సూర్యుని ఆధీనంలో ఉందని తెలుసుకోవాలి.

సూర్యోదయానికి ముందులేచి కాలకృత్యాలు నిర్వర్తించుకొని సూర్యనమస్కారాలు చేస్తే సూర్యుడు కనికరించి ఆరోగ్యం ప్రసాదిస్తాడు. నిద్రమత్తులోపడి 8,9 గంటల వరకు పడుకుంటే ఉన్న ఆరోగ్యం కాస్త తీసుకెళ్తాడు. శరీరవ్యాయామం లేకున్న నిద్రమత్తు ఎక్కువగా ఉంటుంది. బయటికి వెళ్ళవలసిన బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) శరీరంలో నిలువుండి తలకు చేరి నిద్రమత్తును పెంచుతుంది.

ఆ మత్తులో విధినిర్వహణలో వృత్తిధర్మపరంగా కొన్ని కష్టాలు జరుగుతయ్. వాహనం మత్తులో నడిపితే ప్రమాదం జరిగి ప్రాణాలు పోతయ్. మంగలివాడు మత్తులోవుండి రంచేస్తే గొంతు తెగుతుంది. వ్యాపారంలో ఉన్నప్పుడు నిద్ర మత్తుంటే లెక్కలు తప్పి నష్టాలు వాటిల్లుతయ్. ఇలా ఎన్నో ఎన్నెన్నో నష్టాలు కలిగే నిద్రమత్తును తొలగించే కొన్ని సులభ మార్గాలు తెలుసుకుందాం.

అతినిద్ర తొలగడానికి అనువైన మార్గాలు 

  • ఉదయం పరగడపున అవసరమనిపిచ్చినప్పుడెల్లా ఎండించి దంచి వస్త్రఘాళితంపట్టిన తులసిఆకుల మెత్తటి చూర్ణాన్ని నస్యరూపకంగా ముక్కుతో పీలిస్తే నిద్రమత్తు తొలగిపోతుంది. 
  • వేపనూనె లేదా నువ్వులనూనె రోజూ ఉదయం ముక్కుల్లో వేసుకోవాలి. 
  • పసుపు వేసి మరిగించగా వచ్చిన నీటి ఆవిరిని రోజూ రెండుపూటలా పీల్చాలి. 
  • కపాలభాతి ప్రాణాయామాన్ని రోజూ 10 నిమిషాలు సాధన చేయాలి. 
  • మలబందం తొలగడానికి వారంలో ఒకరోజు 1-3 చెంచాల ఆముదాన్ని రాత్రిపూట పాలతో కలిపి సేవిస్తే ఉదయం సుఖవిరేచనంచెంది మత్తు తొలగుతుంది. 
  • అధికమైన నూనె పదార్థాలు, పిండిపదార్థాలు, మాంసాహారం సేవించడంవల్ల పొట్టలో ఆహారం మురిగి గ్యాస్ ఉత్పత్తియై తలకుచేరి నిద్రను పెంచుతుంది. కాబట్టి అలాంటి పదార్థాలు సేవించరాదు. 
  • రాత్రి 10గంటల తరువాత అధికమైన ఆహారం సేవించరాదు. పొట్ట బరువైతే మత్తు పెరిగిపోతుంది. పొట్ట కూడా పెరుగుతుంది. ఆ తర్వాత కష్టాలేకష్టాలు. 
  • రోజూ ఉదయం వేకువజామునే లేచి నడకచేయడంవల్ల మత్తు వదులుతుంది. 
  • ఆసనాలు, ప్రాణాయామం చేయడంవల్ల అతినిద్ర అసలుండదు. 
  • మనకవసరమున్నంత నిద్రను మనమన పనులనుబట్టి నిర్ణయించుకోవాలి. రాత్రులు ఉద్యోగం చేసేవారు పగలు పడుకోవచ్చు. లేకున్న నిద్రమత్తులో పనులుచెడిపోతాయి. ఆరోగ్యం కుంటుపడుతుంది.

– డా॥ ఏల్చూరి