నేటి సమాజంలో వివాహం యొక్క పాత్ర | Importance of Marriage in Society in Telugu

0
2912
images
నేటి సమాజంలో వివాహం యొక్క పాత్ర | Importance of Marriage in Society in Telugu

వివాహము – నేటి సమాజము

నేటి సమాజపు పోకడను చూస్తుంటే నిజంగా భయం వేస్తోందండి. మన పెద్దలు చెప్పినట్లు మన సమాజం ఎటు వెళుతోంది? మన దేశం ఏమైపోతుంది? అన్నది ఖచ్చితంగా నిజమే అని అనిపిస్తోంది.

ఎందుకంటే మన సనాతన ధర్మంలో మనము నిర్వహించుకునే ప్రతి క్రతువుకు కూడా ఉత్కృష్టమైన స్థానం ఉంది, సామాన్యంగా మనము ఏదైనా తప్పు చేసినా లేక మన ఆచారానికి విరుద్ధంగా ఏదైనా ఆచరించినా దానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంటుంది.

అంతెందుకు, బ్రహ్మహత్యా పాతకానికి కూడా అ ఈశ్వరుడు తనకు తానుగా ప్రాయశ్చిత్తం చేసుకోలేదా? ఎలాంటి పాపం చేసినప్పటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటే మనము ఆ దోషము నుండి బయట పడవచ్చేమో. కాని మన వేదాలు, శాస్త్రాలు, ధర్మాలు, పురాణాలు, ఇతిహాసాలు ఏమి చెబుతున్నాయంటే అసలు ప్రాయశ్చిత్తం లేని కాండ మన వివాహ కాండ ఒక్కటే.

అహల్య తప్పు చేసింది అని గౌతమ మహర్షికి తెలిసినా అహల్యను తాను గాలి మాత్రమే స్వీకరించి కొన్ని సంవత్సరములు ఆ శ్రీరాముడు వచ్చి శాప విమోచన అయ్యేదాకా శిలవై ఉండుగాక అని శపించాడు. అంతేకాని కనుల ఎదుట తప్పు చేసిన అహల్య కనబడినా నిన్ను వదిలివేస్తున్నాను, నీ ఇష్టం ఉన్న చోట చెప్పుకో అని గౌతమ మహర్షి తన పత్ని అయినటువంటి అహల్యను వదిలి వెయ్యలేదు.

ఇలాంటి ఇతిహాసాలు సమాజములో మన పాట్యాంశములలో పిల్లలకి చెప్పబడలేదు. ఇలాంటి కధలు మన పిల్లలకి చెప్పకపోవడం వల్లనే సమాజం ఇంతలా దిగజారి పోవడానికి కారణం కూడా. ఒక సారి వివాహం చేసుకున్న తరువాత అయ్యో, అయ్యో నేను అనుకున్న విధంగా ఈ అమ్మాయి కాని, అబ్బాయి కాని లేరు, అని అనుకోవడానికి వీలు లేదు ఒకరికొకరు తోడై జీవితాంతం కలసిమెలసి ఉండవలసినదే.

ఒక వివాహితుడైన పురుషుడి గురించి చెప్పుకొనవలసి వస్తే, గయ్యాళి భార్య కనక వస్తే, ఆ పురుషుడు భగవంతునికి ఈ విధంగా నమస్కరించు కోవాలి.

స్వామీ! నాకు ఈ జన్మలో గయ్యాళి భార్యను ఇచ్చావు, నేను ఎడ్డెం అంటే తాను తెడ్డెం అంటుంది. నేను ఒకటి అంటే తను 10 మాటలు అంటుంది. కాబట్టి నేను పూర్తిగా సంసార సాగరంలో కొట్టుకు పోకుండా నా మనసు నీ యందు తొందరగా మరలేటట్లు నన్ను అనుగ్రహించావు అని కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి.

మరి అలాగే చాలా సౌమ్యురాలైన భార్య దొరికితే, భగవంతునికి, స్వామీ! నా మనసెరిగి మసలుకునే ఇల్లాలిని అనుగ్రహించావు, కాబట్టి మేమిద్దరం కలిసి ఎన్నో పుణ్యకార్యాలు చేసే అవకాశాన్ని కల్పించినందుకు నీకు కృతజ్ఞతలు అని భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి.
అంతే కాని నేను కోరుకున్నట్లుగా ఈవిడ లేదు కాబట్టి మా ఇద్దరికీ పడటం లేదు కాబట్టి విడిపోతాము అని అనుకోవడానికి వీలులేదు. మనము ఇందాకే చెప్పుకున్నాము కదా.

ప్రాయశ్చిత్త కాండ లేనిది ఒక్క వివాహానికే అని. మరి ఎక్కడనుండి వచ్చిందో, ఎక్కడనుండి మనము ఆపాదించుకున్నామొ కాని, ఈ విడాకులు అన్న చట్టం వచ్చింది.

(నిజానికి ప్రాణాపాయ స్థితిలోనూ, ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు ఉంటే అప్పుడు ఆలోచిద్దాం). నేను ఈ తప్పు చేశాను కాబట్టి దానికి విరుగుడుగా ఈ పని చేస్తాను అనుకోవడానికి వీలులేదు. కలో-గంజో, కష్టమో-సుఖమో కలసి జీవితాంతం ఇద్దరూ అనుభవించాల్సిందే.

పైగా షష్ట్యబ్ధపూర్తినాటికి దాంపత్య జీవితపు మధురిమలు ఎలా ఉండాలంటే, ఒక తాతగారు, నాయనమ్మ, అమ్మమ్మలు, వివాహం చేసుకోబోతున్న వాళ్ళ మనవళ్ళకి, మనవరాళ్ళకి అలనాటి వారి మధురస్మృతులను చెప్పగలగాలి.

నేను ఇలా చేసినా మీ అమ్మమ్మ ఏమీ అనేది కాదురా. మీ అమ్మమ్మ నాకు తెలియకుండా ఏమన్నా చేసినా నేను నాకు తెలిసినట్లుగా అడిగే వాడిని కాదు.

కొన్ని రోజుల తరువాత మీ అమ్మమ్మ నాకు చెప్పేది అని చెప్పేటటువంటి మధురస్మృతులు ఉండాలి. బాధలు ఉంటాయి.

మరి ఆ రెండూ ఉంటేనే కదండీ జీవితం. కష్టంలో, సుఖంలో తోడుగా ఉంటామని కదా మనము దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టేముందు ప్రతిజ్ఞలు చేసేది.

అసలు షష్ట్యబ్ధపూర్తి అయ్యేనాటికి దాంపత్యం జీవితం ఎలా పండాలంటే, అవి అసలే చెక్కర కేళీలు. చెక్కెర కేళీలకి తీపి ఎక్కువ.

దానికి తోడు అవి ఒక రెండు రోజుల పాటు తేనె జాడీలో ఉంచబడ్డాయి. అప్పుడు వాటికి ఉండే రుచి మధురాతిమధురం. అసలు రుచిని వర్ణించలనవి కాదు.

దాంపత్యం కూడా అంతే. ఆ మధుర స్మృతులను నెమరువేసుకుంటుంటే మన మనసుకి ఎంత కష్టంగా ఉన్నా మన మనసు స్వాంతన పొందాలి.

యువతకి రాను రాను వివాహ వ్యవస్థమీద అవగాహన పోతోంది. ఏమో! వారి పోకడను చూస్తే అనిపిస్తోంది.
పెద్దలుగా మనము వారి వెనుక ఉండి మన వివాహ వ్యవస్థ మీద వారికి అవగాహన కల్పించాలి. అలా కల్పించినట్లైతే వారు కూడా ఆదర్శ దాంపత్య జీవితానికి వారసులు అవుతారు.

 

పంచభూతాల సాక్షిగా, అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా చేసుకున్న వివాహాన్ని ఒక్క తెల్ల కాగితం మీద మనము అనుకున్నదేదో రాసి దానికి సంబంధించిన అధికారి సంతకంతో ఆ వివాహం రద్దు అవుతుంది.

ఏ భార్యాభర్తలని మనము ఉదాహరణగా పరికించి చూసినప్పటికీ అన్ని లక్షణాలున్న ఏ భర్తకి భార్య, భార్యకి భర్త దొరరకనే చెప్పవచ్చు.

ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో మనము కోరుకున్న అన్ని లక్షణాలు ఉండాలి అనుకోవడం వేర్రితనమే అవుతుంది. ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి.

అలాంటిది ఎక్కడో పుట్టిన పిల్ల, ఇంటి పేరు మార్చుకుంది, గోత్రం మార్చుకుంది, తన వారినందరినీ వదులుకుని వచ్చేసింది. అలాంటి అమ్మాయికి, అబ్బాయికి అభిప్రాయ భేదాలు ఉండవని ఎలా చెప్పగలము?

దాంపత్యము అంటే భర్త బలహీనతల్ని భార్య ప్రేమించగలగడం, అలాగే భార్య బలహీనతల్ని భర్త కప్పిపుచ్చగలగడం.

మనము పిల్లలకి యుక్త వయసు వచ్చినప్పటినుండి కూడా అసలు వివాహ వ్యవస్థ మీద మనము సరైన అవగాహన కల్పిస్తే ఈ మూర్ఖపు ఆలోచనల్ని కొంతవరకు దూరం చేశే అవకాశం ఉంది.

అందుకనే ప్రపంచ దేశాలు మన సంస్కృతీ సంప్రదాయాలను అంతలా గౌరవిస్తాయి.

ఇది ఏమీ ఉద్యోగం కాదు కదా! ఇక్కడ ఈ పని నచ్చలేదు. ఇచ్చే జీతం నచ్చలేదు. కాబట్టి నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంకో ఉద్యోగంలోకి వెళ్తున్నా అనుకోవడానికి.

ఇది జీవితం, అది పాశ్చాత్య దేశాలకు చెందిందేమో కాని మన సంస్కృతి అది కాదు. తస్మాత్ జాగ్రత్త.

ఇట్లు

శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here