భాస్కరులు ప్రపంచానికి అందించిన కానుక సిద్దాంత శిరోమణి గ్రంధం. 1,150వ సంవత్సరం లో రచించిన “సిద్దాంత శిరోమణి”గ్రంధం భాస్కరులకు ఖ్యాతిని గణితప్రపంచానికి అమూల్యమైన కానుకను అందించినది.
ఇందులో భాగాలు నాలుగు. అవి,
1. లీలావతి(అంకగణితం)
2 . బీజ గణితం
3. గోళాధ్యాయ(గోళాలు, అర్దగోళాలు)
4. గ్రహ గణితo (గ్రహాలకు, నక్షత్రాలకు సంబంధించినది)
ఈ గ్రంధం సున్న (0) యొక్క ధర్మాలను, “పై” యొక్క విలువను, వర్గాలను, వర్గమూలాలను, ధనాత్మక-ఋణాత్మక అంకెలను, వడ్డీలెక్కలను, సమీకరణాలను గురించి తెలియజేస్తుంది.
మరియు పాశ్చాత్యులు గత శతాబ్దంలో కనుగొన్నామనుకొంటున్న కరణులు, వర్గ సమీకరణాలను, అనంతం (ఇన్‌ఫినిటీ)ని కనుగొని చర్చించి, వాటిని సాధించింది. సమీకరణాలను వాటి 3వ, 4వ ఘాతం వరకు సాధించింది. త్రికోణమితిని కూడా చాలా చర్చించింది.
మన దౌర్భాగ్యం మరియు అలసత్వం కొద్దీ గురుత్వాకర్షణను న్యూటన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెబితే అదే నిజమని అనుకొని మోసపోతున్నాము..
కాని ఈ గ్రంధంలో(న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే) భాస్కరుల వాక్యాలను గమనించండి.
“వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి .కాబట్టి భూమి, గ్రహాలు, చంద్రుడు, నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్ష్యలలో పడిపోకుండా ఉన్నాయి. వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి.”
ఇంత స్పష్టంగా వీరు చెప్పినా ఇంకా మనం మన ప్రాచీన శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలుసుకొనలేక పోతున్నాము.