కిరీటం గొప్పదా? పాదరక్షలు గొప్పవా?

0
2203

ఓరోజు విష్ణుమూర్తి శిరస్సుపై ఉన్న కిరీటం స్వామివారి పాదరక్షలను చూసి హేళనగా ఇలా మాట్లాడింది. “నేను స్వామివారి శిరస్సుపైన దర్జాగా ఉన్నాను. నువ్వు మాత్రం స్వామివారి పాదాలవద్ద పడి ఉన్నావు. అంతేకాదు మానవులు కూడా నిన్ను తొడుక్కొని ఊరంతా తిరుగుతారు. ఇంటికి వచ్చేసరికి నిన్ను గుమ్మంబయటే ఉంచి లోపలికి వెళ్తారు. నీకిచ్చే మర్యాద అంతేకదా! కాని నన్నైతే స్వామివారు శిరస్సుపై ధరించి చాలా జాగ్రత్తగా చూసు కుంటారు. అంతేకాదు, పవిత్రస్థలాల్లో నన్ను ఉంచుతారు. నిన్ను బయట ఉంచినట్లు నన్ను బయట ఉంచరని పాదరక్షలను చూసి హేళనగా నవ్వింది కిరీటం.

పాదరక్షలు మాత్రం కిరీటంతో ఎటువంటి కయ్యానికి దిగలేదు. లోలోన దుఃఖంతో కుమిలిపోతున్నాయి. విష్ణుమూర్తి ఏదో పనిమీద బయటకు వెళ్లినప్పుడు, కిరీటం చేసిన అవమానాన్ని స్వామికి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాయి పాదరక్షలు.

పాదరక్షల బాధనంతా విన్న విష్ణుమూర్తి ఓ పాదరక్షకులారా! నా పాదాలకు రక్షణ ఇస్తున్న మీరు ఎందుకు బాధపడుతున్నారు. మిమ్మల్ని నేను ఎప్పుడూ తక్కువ చెయ్యలేదు. మీరు బాధపడకండి. ఆ విషయాన్ని మరచిపోండి. ‘నేను రామావతారంలో మిమ్మల్ని పద్నాలుగు సంవత్సరాలు సింహాసనంలో ఉంచి రాజ్యాన్నే పాలించినట్లు చేయిస్తాను’ అని స్వామి హామీ ఇచ్చారు.

ఆ మేరకే రాముడుగా అవతారమెత్తి పద్నాలుగు ఏళ్లు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అప్పుడు తన తమ్ముడు భరతుడు అన్న రాముని పాదుకలను తీసుకొని వాటిని సింహాసనంపై ఉంచి రాజ్యపాలన చేయసాగాడు. అప్పుడు పాదరక్షలు తమ స్థితిని తలచి ఎంతగానో మురిసిపోయాయి. భరతుడు ప్రతిదినం సింహాసనం ముందు కూర్చొని పాదరక్షలకు నమస్కరించినప్పుడల్లా అతని శిరస్సుపై ఉన్న కిరీటం సిగ్గుతో తలవంచి తన తప్పును తెలుసుకొని పాదరక్షలను అవమానించినం దుకు సిగ్గుపడింది.

దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమంటే “ఎవరినీ తక్కువ చేసి చూడకూడదు” అని. మనం కూడా ఎవరినీ హేళన చేయకుండా అందరినీ, అన్నింటినీ సమానంగా గౌరవిద్దాం మరీ!