ఉద్యోగ బాధ్యత

0
969

సిరిపురం సంస్థానంలో సలహాదారుడి పదవి ఒకటి ఖాళీ అయ్యింది. గౌరాంగుడు, గంభీరుడు అనే వాళ్ళు, జమీందారు దగ్గరకు వచ్చి, ఆ ఉద్యోగం తమకు యివ్వవలసిందిగా కోరారు. జమీందారు ముందుగా గౌరాంగుణ్ణి తన కచ్చేరీగదికి తీసుకుపోయి, “అప్ప చెప్పిన విధులన్నీ, ఒక్క పొరబాటయినా చెయ్యకుండా నిర్వహించగల సమర్థత, నీకున్నదా ?” అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు గౌరాంగుడు ” అయ్యా, ఇరవై సంవత్సరాలుగా, ఎందరో సంస్థా నాధీశుల దగ్గిర పని చేసిన అనుభవం, నాకున్నది. నా విధి నిర్వహణ లో ఒక్క తప్పు జరగలేదు. నన్ను మెచ్చుకుంటూ, వారందరూ యిచ్చిన పత్రాలే అందుకు సాక్ష్యం.” అంటూ కొన్ని కాగితాలను జమీందారు కిచ్చాడు.

జమీందారు వాటిని పక్కనే వున్న దివానుకు యిచ్చి, గంభీరుణ్ణి పిలిపించాడు. ఆయన గంభీరుణ్ణి, గౌరాంగుణ్ణి అడిగిన ప్రశ్నే అడిగాడు.

దానికి గంభీరుడు, “అయ్యా, ఒక్క పొరబాటయినా దొర్లకుండా, అన్ని విధుల్నీ నిర్వహించడం సాధ్యం కాని పని. అందువల్ల, తమకు అలాంటి హామీ యివ్వలేను,” అన్నాడు. 

జమీందారు అతణ్ణి మందలిస్తు అన్నట్టుగా, “అలాంటప్పుడు, ఇటువంటి ఉన్నత పదవి కావాలంటూ ఎగబడడం తప్పు కాదా !” అన్నాడు.

“క్షమించండి! చేసిన పనిలో పొరబాటేదైనా జరిగినప్పుడు, దాన్ని సకాలంలో సరిదిద్దుకుని, మళ్ళీ అంతా సక్రమంగా జరిగిపో యేట్టు చూడగల సమర్థత, నాకున్నది. పొరబాట్ల ద్వారా నేర్చుకున్న పాఠాలూ, అనుభవాలూ- ఆ తరవాత మనిషికి ఎంతో ఉపయుక్తం కాగలవన్న సంగతి, మీకు తెలియంది కాదుగదా, “అన్నాడు గంభీరుడు. జమీందారు అతణ్ణి రేపే వచ్చి ఉద్యోగంలో చేరమని చెప్పి, పంపివేశాడు.

జమీందారు పక్కనే వున్న దివానుకు, జమీందారు గంభీరుడికి  ఉద్యోగం యివ్వడం ఆశ్చర్యం కలిగించింది.

“గౌరాంగుడికి చాలా మంది మంచి యోగ్యతాపత్రాలిచ్చారు. అతడు లో గడ నిర్వహించిన పదవుల్లో, ఒక్క పొరబాటు కూడా చేసినట్టు కనబడదు. తమరు అలంటి వాణ్ణి వదిలి, ఏ అర్హతలు చూసి గంభీరుడికి ఉద్యోగం యిచ్చారో, అర్థం కావడంలేదు.” అన్నాడు దివాను. 

దివాను సందేహం విని జమీందారు, “గౌరాంగుడు విధి నిర్వహణలో, తానెన్నడూ, ఒక్క తప్పు కూడా చేయలేదంటున్నాడు. ఆ మాట నమ్మడం ఎలా ! అలాంటివాళ్ళు, స్వయంగా ఏ పనీ ముట్టు కోకుండా సహాయకుల మీద ఆధారపడడ తారు. ఏవైనా పొరబాట్లు జరిగితే, వాటిని వాళ్ళ మీద రుద్దుతారు. ఒక్క పొరబాటు కూడా దొర్లకుండా బాధ్యత గల పదవుల్ని అంతకాలం నిర్వహించడం, ఎవరికీ సాధ్యపడదు. ఏమంటారు ? ” అన్నాడు..

దివాను జమీందారు చెప్పినదాంట్లో ఎంతో వాస్తవం వున్నదని గ్రహించి, “అవును, మీరన్నది నిజం.” అన్నాడు.

“ఏవైనా బాధ్యతలు నిర్వహించేటప్పుడు, పొరబాట్లు జరిగే అవకాశం వున్నదని గుర్తించినవాడు, గంభీరుడు. అలాంటివాటిని కప్పిపుచ్చడంకన్న, సరదిద్దుకోవడం ప్రయోజనకరమని అతడికి తెలుసు. ఆ కారణం వల్లనే, సలహాదారుగా వుండడానికి అతడు అర్హుడని నిర్ణయించాను.” అన్నాడు జమీందారు .

గంభీరుడు, జమీందారు తనకిచ్చిన పదవిలో మంచి పేరు తెచ్చుకుని, కొంత కాలం తరవాత సంస్థానానికి దివానుగా నియమించబడ్డాడు.

ఉద్యోగ ప్రయత్నం ఫలించడానికి చదవాల్సిన స్తోత్రం ఏమిటి? | Surya Astakam In Telugu

తీర్పు