
Kartik Purnima (కార్తిక పూర్ణిమ)
కార్తిక పౌర్ణమి ఆసేతు హిమాచలం భక్తిపారవశ్యంతో మునిగి తేలుతుంది. ఈ రోజు ఆలయాన్ని దీప కాంతులతో వెలిగిపోతాయి.
కార్తిక మాసంలో మిగిలిన రోజులు శివారాధన చేయక పోయినా పౌర్ణమి నాడు నదీ స్నానంచేసి, శివాలయంలో దీపారాధన చేస్తే ఉత్తమఫలితాలు కలుగుతాయి.
కార్తిక పౌర్ణమినాడు శివాలయంలో ఆకాశదీపాన్ని దర్శిస్తే కైలాస దర్శన ఫలితం లభిస్తుంది.
“పౌర్ణమ్యాం కార్తికేతు స్నానదానంత మాసఫలం ప్రాప్నోత్యసంశయః”
పవిత్రమైన కార్తికమాసం పుణ్యకార్యాలకే నెలవు. శాస్త్రాలు చెప్పినవిధంగా ఈ మాసంలో విధులు నిర్వర్తించడం కష్ట సాధ్యం.
శాస్రవిధులన్నీ నిర్వర్తించలేనివారు కనీసం కార్తికపౌర్ణమి నాడైనా స్నాన, దాన, జపాదులు చేస్తూ మాసమంతా సత్కార్యాలు ఆచరించిన ఫలం లభిస్తుంది.
1. శివ దర్శన ఫలం:
కార్తికపౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసి, దీపారాధన చేయాలి. శివపార్వతులను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ఆ రోజు సాయంత్రం విధిగా ఇంటినంతా దీపాలతో వెలిగించాలి. ముఖ్యంగా ఇంటి ముంగిట, తులసికోట, ధ్యానం కోటవద్ద తప్పని సరిగా దీపారాధన చేస్తే సర్వపాపాలు తొలగి శుభాలు కలుగుతాయి.
దీపం వెలిగించే అవకాశం లేనివారు శివాలయంలో ఆవు నేతిని సమర్పించినా మంచిదే. పౌర్ణమిరోజు శివాలయంలో పెట్టే ఆకాశదీపాన్ని దర్శించుకుంటే సాక్షాత్ ఆ పరమశివునీ దర్శించుకున్న పుణ్యం లభిస్తుంది. కార్తికపౌర్ణమినాడు నదులు, కోనేర్లలో అరటిదొప్పలలో దీపాలు వెలిగించి వదిలితే స్త్రీలకు సౌఖ్యం, సౌభాగ్యం కలుగుతుంది. సుఖవంత మైన వైవాహిక జీవితాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. మాసమంతా ఇళ్ళలోనూ, దేవాలయాల్లోనూ భక్తిశ్రద్ధలతో దీపారాధన చేస్తే ఎలాంటి అనారోగ్యం దరిచేరదు.