ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem
1. అథ పంచమాధ్యాయ ప్రారంభః
వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును జేయవలయును. పుణ్యముచేత పాము నశించుటయేగాక పుణ్యమధికమగును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీతా పారాయణమును చేయువాడు పాము కుబుసమువలెపాపములను విడుచును. ఈమాసమందు తులసీ దళములతోను, తెల్లనివి నల్లనివి అయిన అవిశపూలతో కరవీర(గన్నేరు) పూలతో హరిని పూజించినయెడల వైకుంఠమునకు బోయి హరితో గూడా సుఖించును.
భగవద్గీతయందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతియగును. హరిసన్నిధిలో శ్లోకముగాని, శ్లోక పాదముగాని, పురాణము చెప్పిన వారును, విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీకమాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాలమందు, చండాలురయొక్కయు, పాపాత్ములయొక్కయు, శూద్రులయొక్కయు, అశౌచవంతులయొక్కయు సంభాషణలను వినినచో దోషపరిహారము కొరకు కార్తీకమాసమునందు వనభోజనమాచరించవలయును.
అనేక జాతి వృక్షములతో గూడిన వనమందు ఆమలక(ఉసిరిక) వృక్షమువద్ద సాలగ్రామము నుంచి గంధపుష్పాక్షతాదులతో బూజించి శక్తి కొలది బ్రాహ్మణులను బూజించి భోజనము చేయవలెను.
ఇట్లు కార్తీకమాసమందు వనభోజనము చేసినయెడల ఆయాకలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక ఈమాసమందు వనభోజనమాచరించ వలయును. కార్తీకమహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మనుండి విముక్తుడాయెను.
ఆకథ చెప్తాను వినుము అని వశిష్ఠుడు జనకమహారాజుకు ఈ విధంగా చెప్పెను.
కథ
కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేదవేదాంగ పారంగతుడు గలడు. ఆదేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్మార్గమును జూచి తండ్రి నాయనా! నీకు పాపములు నశించెడి ఒక మాటను చెప్పెదను. కార్తీకమాసమందు ప్రాతస్స్నానము చేయుము. సాయంకాలమునందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుము. ఈలాగున తండ్రిచెప్పిన మాటలను విని కుమారుడు కార్తీకమాస ధర్మమనగా యేమి ఇట్టి కార్యమునాచే ఎన్నటికీ చేయతగదు. ఆమాట విని తండ్రి ఓరి దుర్మార్గుడా! ఎంతమాట అంటివిరా, నీవు అరణ్యమందు చెట్టుతొర్రలో ఎలుకవై పుట్టి ఉండుమని శపించెను.
తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాప పడి శాప విముక్తి దురాచారుడనైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను. ఆతండ్రి ఇట్లనెను. కుమారకా! ఎప్పుడు నీవు కార్తీక మహాత్మ్యమును వినెదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి గలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి ఊరకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టుతొర్రలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైనది. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీకస్నానమాచరించి ఆ వృక్షముయొక్క మొదట కార్తీకమహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను.
అంతలో దురాచారుడును, హింసకుడును అగు ఒక కిరాతుడును వేటనిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను జూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని జంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈపనివల్ల ఏమిఫలము అనియడిగెను. కిరాతా! వినుము చెప్పెదను. నీబుద్ధి మంచిదైనది. ఇది కార్తీకధర్మము ఈధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును.
కార్తీకమాసమందు మోహముచేతనైనను స్నానదానాదికమును జేసినవాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. ఈమాసమందు భక్తిశ్రద్ధలతో కూడినవాడై స్నానదానాదివ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడగును. విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యెను.
విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యమునొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి దెల్పి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికిబోయెను. కిరాతుడును మూషకదేహత్యాగమును బట్టి కార్తీకవ్రత ఫలమును తరువాత మునివలన సకల ధర్మములను విని వైకుంఠము జేరెను. సుగతిని గోరువాడు కార్తీకమహాత్మ్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెను.
కాని విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పక కార్తీకవ్రతము ఆచరించదగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా! నీవును పురాణములందు బుద్ధినుంచుము. అట్లయిన యెడల పుణ్యగతిక బోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు. నిశ్చయము.
ఇతి స్కాంద పురాణే కార్తీకమహాత్మ్యే పంచమోధ్యాయస్సమాప్తః
కార్తిక పురాణము – షష్ఠ అధ్యాయము | Karthika Puranam Sixth Chapter in Telugu
Promoted Content