కార్తీక పురాణము – పదహారవ అధ్యాయము | Karthika Puranam Sixteenth Chapter in Telugu

0
773
Karthika Masam.
Karthika Puranam Sixteenth Chapter

కార్తీక పురాణము – పదహారవ అధ్యాయము | Karthika Puranam Sixteenth Chapter in Telugu

అథ షోడశోధ్యాయ ప్రారంభః

వశిష్ఠుడిట్లు పలికెను.

 • దామోదరునకు బ్రీతికరమైన ఈకార్తిక వ్రతమును జేయనివాడు కల్పాంతము వరకు నరకమొందును.
 • కార్తికమాసము నెలరోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును.
 • కార్తీకమాసమందు నెలరోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకొనును. వైకుంఠమునకు బోవును.
 • కార్తికమాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరి సూర్యునుద్దేశించి స్నానము దానము చేయవలెను. అనగా అట్లు చేసినయెడల సంతానము గలుగునని భావము.
 • కార్తికమాసమందు హరిసన్నిధిలో టెంకాయదానమును దక్షిణతాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు. రోగము ఉండదు. దుర్మరణము ఉండదు.
 • కార్తికమాసమందు పూర్ణిమనాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతియగును.
 • కార్తికమాసమందు హరిసన్నిధిలో స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతి యగును.
 • కార్తికమాసమందు హరిసన్నిధిలోకి స్తంభదీపము అర్పణచేసిన వానికి గలిగెడి పుణ్యమును జెప్పుటకు నాతరముగాదు.
 • కార్తికమాసమందు పూర్ణిమరోజున స్తంభదీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్లవలె నశించును.
 • కార్తికమందు స్తంభమును సమర్పించినవాడు నరకమునుండు విడుదలగాడు.
 • స్తంభదీపమును శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను.
 • శిలతోగాని, కర్రతో గాని స్తంభమును జేయించి దేవాలయము ఎదుట పాతిదానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడగును. ఈస్తంభవిషయమై పూర్వకథ గలదు. చెప్పెదను వినుము.

1. పూర్వకథ

మతంగమహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి గలదు. అందొక విష్ణ్వాలయము గలదు. ఆయాలయముచుట్టును వనముండెను. కార్తీకవ్రత పరాయణులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతోను మాసమంతయును బూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి. వ్రతములు చేసిరి. అందులో ఒక ముని యిట్లు పలికెను. మునీశ్వరులారా వినుడు. కార్తికమాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసియగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును బెట్టుదము. ఈదినము కార్తికపూర్ణిమ అయి ఉన్నది. ఈదినము సాయంకాలము స్తంభదీప దానము హరికత్యంత ప్రియము. స్తంభమును జేయించి కార్తికమాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దానియందు దీపమును బెట్టువారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు. వారందరు ఆమాటవిని స్తంభదీపమును సమర్పించుట యందు ప్రయత్నము జేసిరి.

ఓరాజా! ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును జూచిరి. కార్తికవ్రత సముత్సాహులైన వారందరు కలసి ఆస్థాణువునందు శాలివ్రీహితిలసమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పికొనుచుండిరి. ఆసమయమున దేవాలయము ఎదుట చట చట అనే శత్బములు గలిగి స్తంభదీపము నశించి అందరు చూచుచుండగనే ఆస్థాణువంతయు పగిలి భూమియందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను. అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయమునుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమొంది అయ్యో అయ్యో యని ధ్వనిచేయుచుయొక పురుషునిచూసి ఇట్లనిరి.

ఓయీ! నీవెవ్వడవు? ఏ దోషముచేత మొద్దుగా నున్నావు? ఆవిషయమునంతయు త్వరగా చెప్పుము. ఓ బ్రాహ్మణోత్తములారా! నేను పూర్వమందు బ్రాహ్మణుడను. రాజ్యమును పాలించువాడను, ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు గలిగియు దయాశూన్యుడనై దుష్ట వర్తనగల వాడనైతిని. నేను వేదశాస్త్రములను జదువలేదు. హరిచరిత్రను వినలేదు. తీర్థయాత్రకు పోలేదు. స్వల్పమైన దానము చేయలేదు. దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమునందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయ కాములు అగు బ్రాహ్మణులను నాముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడును, వారికెన్నడును ఎదుర్కొని నమస్కారములు చేయలేదు. వారి ఇష్టార్థములను ఇవ్వనూలేదు. సర్వకాలమందు వారెకెన్నడును ఏదానమును యివ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పనియెడల ధనములేకుండ ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి యుండలేదు. శాస్త్రశ్రవణ సత్స్వభావసంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించు వారు. అప్పుడు సరే యిచ్చెదనని చెప్పుటయే గాని యిచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును బుచ్చుకొని స్వకార్యములను జేసికొనువాడను. మరల వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండెడివాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆదుష్కృత కర్మచేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించితిని. తరువాత భూమికి వచ్చి ఏబది రెండువేల మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము పదివేల మారులు కాకిగా బుట్టితిని. ఆవల పదివేల మారులు తొండగా జన్మించితిని. పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మలాశినైయుంటిని. ఆతరువాత కోటి మారులు వృక్షముగా నుంటిని. చివరకు కోటి మారులు స్థాణువుగా కాలము గడుపుచుంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వభూతదయావంతులగు మీరు చెప్పుదురు గాక. మీదర్శనము వలన నాకు జాతిస్మృతి గలిగినది. ఓ మునీశ్వరులారా నా పూర్వపాపమిట్టిదని పలికి వాడూరకుండెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారు యిట్లు చెప్పుకొనసాగిరి. కార్తికమాసఫలము యథార్థమయినది. ప్రత్యక్ష మోక్షమిచ్చునది. రాతికి కొయ్యకు గూడ మోక్షమిచ్చినది. అందును ఈపూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును.ఆ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తిక పూర్ణిమనాడు పరులచే ఉంచబడిన దీపమువలన ఎండిన మొద్దు ముక్తినొందెను. మొద్దయినను కార్తికమాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టినయెడల పాపమునశించి దయాళువయిన దామోదరుని చేత మోక్షమొందించబడినది. ఇట్లు వాదమును జేయి వారితో ఉద్భూతపురుషుడు తిరిగి యిట్లనియె. జ్ఞానవేత్తలయిన మునీశ్వరులారా! దేనిచేత మోక్షము కలుగును? దేనిచేత బద్ధుడగును? దేనిచేత ముక్తుడగును? దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు గలుగును? మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లుగలుగును? ఈ సర్వమును నాకు జెప్పుడు. వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరసమునిని వానికి సమాధానము జెప్పుమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షోడశాధ్యాయస్సమాప్తః

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here