కార్తీక పురాణం – ఇరవై ఒకటో అధ్యాయము | Karthika Puranam 21st Day Chapter in Telugu

0
915
Karthika Masam
Karthika Puranam Twenty First Chapter

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

Karthika Puranam Twenty First Chapter

కార్తీక పురాణము – ఇరవై ఒకటో అధ్యాయము

ఇట్లు యుద్ధమునకు పురంజయుని జూచి యుద్ధ ప్రవీణులయిన ఆ రాజులు కోప రక్తాక్షులై శస్త్రములతోను, అస్త్రములతోను, బాణములతోను, వాడియైన గుదియలతోను, ఇనుపకట్ల లాటీ కర్రలతోను, హస్తాయుధములయిన గుదియలతోను, కత్తులతోను, భల్లాతకములతోను, పట్టసములతోను, రోకళ్ళతోను, శూలములతోను, తోమరములతోను, కుంభాయుధములతోను, గొడ్డళ్ళతోను, కర్రలతోను, ఆయుధముల విక్షేపములతోను, యుద్ధము చేసిరి. గుర్రపురౌతులతో గుర్రపు రౌతులు, ఏనుగులు ఏనుగుల తోడను, రథికులతో రథికులు, కాల్బంటులతో కాల్బంటులు, శూరులతో శూరులును, ఆయుధములతో యుద్దమును భటులనన్యోన్యము క్రూరవాక్యములను పలుకుచు చేసిరి.

ఓ అగస్త్య మునీంద్రా! అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలపరచికట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడువందల బాణముల వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును నరికినవి. తరువాత కాంభోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి అయిదు బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను జంపెను. తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వాలే విక్రమించి భుజాస్ఫాలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంభోజుని హృదయమందు కొట్టెను. పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వాలే పోయి కాంభోజ రాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు.

సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంభోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనుస్సునందు గూర్చి పురంజయునితో యిట్లనియె.

క్షత్రియా! వినుము. నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మునందాసక్తి గలవాడను కాను. ఇట్లు పలికి కాంభోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారధిని, ఛత్రమును వాని ధనుస్సును త్రుంచినవి. పురంజయుడు మరియొక ధనుస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో గూడిన బాణములను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంభోజునితో ఇట్లనియెను. రాజా! శూరుడువౌదువు గాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నాచేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీవంటి నీచులకు ప్రతిదాన విధి తెలియునా? నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను.
ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంభోజుని కవచమును ద్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి.

అప్పుడు భయంకరమయిన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులూడి పాదములు మొండెములై మేడలు విరిగి భూమియందు పడిరి.

అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి. గుర్రముల తోకలు తెగినవి. కాల్బంటులు హతులైరి. రథములు చక్రములతో సహా చూర్ణములాయెను. కొందరు తొడలు తెగి నేలబడిరి. కొందరు కంఠములు తెగి కూలిరి. బాణముల చేత శరీరమంతయు గాయములు పడినయొకభటుడు ధనుస్సును ధరించి నారి బిగించి అన్య భటునితో యిట్లనియె. తిరుగు వెనుకను తిరుగు, నాముందుండు ఉండుము. నీ వీపును నాకు చూపకుము. నీవు శూరుడవు కదా, ఇట్లు చేయవచ్చునా? ఓ మునీ ఇట్టి నిష్ఠురములగు మాటలను విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకార ధ్వని జేయుచు సింహగర్జనములను చేయుచు బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను. ఆకాశమందుండి చూచెడి దేవతలు బాణములు తూణీరములనుండి తీయుటను, అనుసంధించి వేయుటను గుర్తించ లేరైరి. బహునేర్పుతో బాణములను వేయుచుండిరి. ఆయుద్ధమందు సూదిదూరు సందులేకుండా బాణవర్షము కురిసెను. ఇట్లన్యోన్యము శూరులను, భటులను బంగారపు కట్లతో గూడినవియు, స్వయముగా వాడియైనవియు, సానపెట్టబడినవియు, స్వనామ చిహ్నితములు అయిన అర్థ చంద్ర బాణములతోను, ఇనుప నారాచములతోను, ఇనుప అలుగులు గల బాణములతోను, ఖడ్గములతోను, పట్టసములతోను, ఈటెలతోను కొట్టుకొనిరి. గుర్రపురౌతులు కొందరిని చంపిరి. గుర్రపు రౌతులను ఏనుగు బంట్లు చంపిరి. రధికులు కాల్బంట్లను జంపిరి. కాల్బంట్లు రథికులను జంపిరి. ఇట్లు తొడలు, భుజములు, శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురుతో యొకనది ప్రవహించెను. ఆకాశమందు మేఘాచ్చాదితలైన అప్సర స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడునావాడు, వీడు నావాడని పలుకుచుండగా శూరహతులయిన శూరులు యుద్ధమందు మృతినొంది దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు బోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుబడుచుండిరి. యుద్దమందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకుని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వాప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు బోవుదురు. కాంభోజుడు మొదలగు రణకోవిదులైన శూరులచేతను, ఇతర రాజుల చేతను, సుభటులచేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికి ఒళ్ళు గగుర్పొడిచినది. ఇట్టి యుద్దమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులును యుద్ధభూమిని వదలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటియందుండిరి. యుద్ధభూమి భూతప్రేత పిశాచ భేతాళములతోడను, నక్కలతోడను, రాబందులతోను, గద్దలతోను, మాంసాశనులతోను, బ్రకాశించుచుండెను. కాంభోజరాజునకు పదమూడు అక్షౌహిణీళ సేన యున్నది. మూడు అక్షౌహిణీలసేన హతమైనది. పురంజయుడు తానూ యుద్ధమందోడుటకును, తన రాజ్యము శతృరాజుల చేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమియు తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను.
ఓ రాజా! శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయించ గోరితినేని విష్ణుమూర్తి సేవ జేయుము. ఇప్పుడు కార్తికపూర్ణిమ, నిండు పూర్ణిమ, కృత్తికా నక్షత్రముతో కూడినది. కాబట్టి యిది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజింపుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరిముందు గోవిందా, నారాయణా మొదలయిన నామములను పాడుచు నాట్యమును జేయుము. సుశీలుడిట్లు చెప్పెను. కార్తిక వ్రతమాచరించితివేని హరి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించుట కొరకు తన వేయి అరలు గల విష్ణు చక్రము పంపును. కార్తిక మాసమందు చేసిన పుణ్య మహిమను జెప్పుటకెవ్వని తరమౌను? నీ అధర్మ వర్తనము వలన అపజయము కలిగినది. ఇకముందు సత్ధర్మపరుడవు గమ్ము. అట్లయిన కొనియాడదగిన వాడగుదువు. ఓ రాజా! కార్తిక వ్రతమాచరింపుము. హరి భక్తుడవు కమ్ము. కార్తిక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగును. నామాట నమ్ముము. త్వరగా చేయుము. 

ఇతి స్కాంద పురాణే కార్తికమహాత్మ్యే ఏక వింశాధ్యాయః సమాప్తః

Related Stories

కార్తీక పురాణము – ఇరవై రెండవ అధ్యాయము | Karthika Puranam Twenty Second Chapter in Telugu

కార్తీక పురాణము – ఇరవై మూడవ అధ్యాయము | Karthika Puranam Twenty Third Chapter in Telugu

కార్తీక పురాణము – ఇరవై నాలుగవ అధ్యాయము | Karthika Puranam Twenty Fourth Chapter in Telugu

కార్తీక పురాణము – ఇరవై అయిదవ అధ్యాయము | Karthika Puranam Twenty Fifth Chapter in Telugu

కార్తీక పురాణము – ఇరవై ఆరవ అధ్యాయము | Karthika Puranam Twenty Sixth Chapter in Telugu

కార్తీక పురాణము – ఇరవై ఏడవ అధ్యాయము | Karthika Puranam Twenty Seventh Chapter in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here